అంతర పంటలపై అమితాసక్తి
పెద్దేముల్: అంతర పంటలు వేయటంతో ఏదైనా ఓ పంట చేతికి వస్తుందని... వరుణుడు అనుకూలిస్తే రెండు పంటలూ చేతికి వస్తాయనే నమ్మకంతో రైతులు మండలంలో అంతర పంటసాగుపై ఎక్కువ మక్కువ చూపుతున్నారని పెద్దేముల్ ఏఓ వెంకటేశం తెలిపారు.
మండలంలోని పాషాపూర్, సిద్దన్నమడుగు తండా, ఓగ్లాపూర్, మారేపల్లి, ఇందూరు, నాగులపల్లి, నర్సపూర్, తట్టెపల్లి, రుద్రారం, మంబాపూర్ తదితర గ్రామాల్లో రైతులు ఖరీఫ్ విత్తనాలు నాటుకునే సమయంలో కంది పంటలతో పాటు, మెక్కజొన్న, కంది- మినుము, కంది- పెసర, కంది- తెల్లజొన్న పంటలను రైతులు అధికంగా సాగు చేస్తున్నారు.
ఆయా పంటల్లో ఏ ఒక్క పంటయినా దక్కుతుందన్న నమ్మకంతో రైతులు సాగు చేస్తున్నారు. కాగా ఈ ఏడాది మినుము, పెసర పంటలు రైతులకు అనుకూలించలేదు. కొన్ని గ్రామాల్లో తెల్లజొన్న పంటలు అనుకూలించాయి. ప్రస్తుతం కంది పంటలు మాత్రం బాగా ఉన్నాయని రైతులు అంటున్నారు. అన్ని పంటల కంటే రైతులు ఈ ఏడాది కంది, పత్తి పంటలను సుమారు 8 వేల ఎకరాల్లో సాగు చేశారు.