నోట్ల రద్దుతో ఆర్థిక వ్యవస్థ మందగమనం: ఎస్బీఐ
బ్యాంకు వ్యాపారం దెబ్బతినొచ్చన్న ఆందోళన
న్యూఢిల్లీ: ఆర్థిక రంగంపై పెద్ద నోట్ల రద్దు ప్రభావం ఎప్పుడో ముగిసిపోయిన అంశమని కేంద్రం పేర్కొంటుండగా... దీనికి భిన్నంగా ఎస్బీఐ వ్యాఖ్యలు చేసింది. డీమోనిటైజేషన్ కారణంగా ఆర్థిక రంగ క్షీణత ఇకపైనా కొనసాగుతుందని, తమ వ్యాపారాన్ని గణనీయంగా దెబ్బతీయొచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. గతేడాది డిసెంబర్లో కేంద్రం రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేసి వాటి స్థానంలో రూ.2,000 నోట్లను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఎస్బీఐ ఇటీవలే ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు రూ.15,000 కోట్ల మేర షేర్లను ప్రైవేటు ప్లేస్మెంట్ విధానంలో కేటాయించింది.
ఈ సందర్భంగా ఎస్బీఐ తన అభిప్రాయాలను కుండబద్ధలు కొట్టినట్టు తెలియజేసింది. ‘‘నోట్ల రద్దు నిర్ణయం దేశ ఆర్థిక వ్యవస్థపై, బ్యాంకింగ్ రంగంపై దీర్ఘకాలం పాటు ప్రభావం చూపించవచ్చు. బ్యాంకు వ్యాపారాన్ని ఇది బాగానే దెబ్బతీయెచ్చు’’ అని ఎస్బీఐ షేర్ల కేటాయింపునకు ముందు జారీ చేసిన ప్రాథమిక పత్రంలో పేర్కొంది. డీమోనిటైజేషన్ కారణంగా ఎదురయ్యే సవాళ్ల గురించి బ్యాంకు ప్రస్తావిస్తూ... ఇతర వాణిజ్య బ్యాంకులు, రుణాలిచ్చే సంస్థల నుంచి అధిక పోటీని ఎదుర్కోవచ్చని వివరించింది.
దీంతో నికర వడ్డీ మార్జిన్, ఇతర ఆదాయంపైనా తీవ్ర ప్రభావం పడుతుందని, దీంతో బ్యాంకు పోటీనివ్వలేని పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇంకా నిబంధనలపరమైన వ్యయాలు, మోసపూరిత ఘటనలు అధికం కావచ్చని ఇవన్నీ కలసి బ్యాంకు వ్యాపారం, కార్యకలాపాలు, ఆర్థిక పరిస్థితులకు విఘాతం కలిగించవచ్చని వివరించింది.