AP: 13 వరకు ఇంటర్ పరీక్ష ఫీజు గడువు
సాక్షి, అమరావతి: ఇంటర్మీడియెట్ మార్చి–2022 పబ్లిక్ పరీక్షలకు ఫస్టియర్, సెకండియర్ రెగ్యులర్ విద్యార్థులు, గతంలో ఫెయిలై మళ్లీ పరీక్షలకు హాజరవ్వాలనుకొనే విద్యార్థులు డిసెంబర్ 13వ తేదీలోగా పరీక్ష ఫీజు చెల్లించవచ్చని ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి ఎం.వి.శేషగిరి బాబు పేర్కొన్నారు. ఈ మేరకు ఫీజుల వివరాలతో మంగళవారం బోర్డు ప్రకటన జారీ చేసింది.
ఆలస్య రుసుములతో 2022 జనవరి 20 వరకు గడువు ఉందని పేర్కొంది. ఆలస్య రుసుము రూ.120తో డిసెంబర్ 23, రూ.500తో డిసెంబర్ 30, రూ.1,000తో 2022 జనవరి 4, రూ.2 వేలతో జనవరి 10, రూ.3 వేలతో జనవరి 17, రూ.5 వేలతో జనవరి 20 వరకు పరీక్ష ఫీజులను చెల్లించవచ్చునని వివరించింది. దరఖాస్తు రుసుము, పరీక్షలకు సంబంధించి ఫీజులను (పేపర్ల వారీగా, సంవత్సరాల వారీగా), ఇతర అంశాలను సర్క్యులర్‌లో పొందుపరిచింది. (చదవండి: ఏపీ నీట్ ర్యాంక్‌లు విడుదల)
పీహెచ్డీ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం
సాక్షి, తాడేపల్లిగూడెం: పీహెచ్డీ పార్ట్‌టైం, ఫుల్‌టైం కోర్సులు, ఎంఎస్ (బై రీసెర్చ్) కోర్సుల్లో చేరడానికి ఏపీ నిట్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. డిసెంబర్ 2021 సెషన్‌కు సంబంధించి అర్హులైన వారిని ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కోరింది. దరఖాస్తులకు డిసెంబర్ 4 వరకు గడువు ఉన్నట్లు నిట్ అధికారులు మంగళవారం తెలిపారు. పార్ట్‌టైం కోర్సులో 148 సీట్లు, ఫుల్‌టైం కోర్సులో 144 సీట్లు అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు. అర్హులైన వారిని రాతపరీక్ష, ఇంటర్వ్యూ పద్ధతుల్లో ఎంపిక చేయనున్నారు. మరిన్ని వివరాలు www.nitandhra.ac.in/main/లో పొందుపరిచినట్లు పేర్కొన్నారు.