intermidiate board
-
ఇంగ్లిష్–1 బండిల్లో కెమిస్ట్రీ ప్రశ్నపత్రాలు!
కోదాడ (సూర్యాపేట): ఇంటర్ ఇంగ్లిష్–1 ప్రశ్నపత్రాల బండిల్ లో కెమిస్ట్రీ ప్రశ్నపత్రాలు దర్శనమిచ్చాయి. ఇంగ్లిష్ ప్రశ్నపత్రాలని భావించి పరీక్షా కేంద్రాలకు తీసుకెళ్లిన తర్వాత.. తెరిచి చూస్తే కెమిస్ట్రీ ప్రశ్నపత్రాలు బయటపడటంతో అధ్యాపకులు బిత్తరపోయారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వారి సూచన మేరకు జిల్లాలోని వివిధ సెంటర్లలో మిగిలిపోయిన ప్రశ్నపత్రాలను తెప్పించారు. గంటన్నర ఆలస్యం గా 10:30 గం.కు విద్యార్థులకు పరీక్ష ప్రారంభించి 1:30 గం.కు ముగించారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా కోదాడలోని సిటీ సెంట్రల్ జూనియర్ కళాశాలలో సోమవారం చోటుచేసుకుంది. అధికారులు, విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం.. కోదాడ లోని 243 మంది విద్యార్థులు ఇక్కడ ఇంగ్లిష్–1 పరీక్ష రాయాల్సి ఉంది. ఈ మేరకు కోదాడ పోలీస్‌స్టేషన్‌లో ఉన్న ప్రశ్నపత్రాలను కస్టోడియన్స్ నుంచి తీసుకొని కళాశాల వద్దకు వెళ్లి తెరిచి చూడగా విష యం బయటపడింది. దీంతో బల్క్ సెంటర్ నల్ల గొండ నుంచి ఇంగ్లిష్ ప్రశ్నపత్రాలు తీసుకురావడం ఆలస్యం అవుతుందని భావించిన జిల్లా ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం.. సమీప సెంటర్లలో విద్యార్థులకు ఇవ్వగా మిగిలిన ప్రశ్న పత్రాలను యుద్ధ ప్రాతిపదికన తెప్పించి పరీక్ష నిర్వహించారు. ప్రశ్నపత్రాలు ఎలా మారాయన్న దానిపై బోర్డు అధికారులు నోరు విప్పడం లేదు. బోర్డు నుంచి ఇంటర్ ప్రశ్నపత్రాలు తక్కువగా వచ్చాయని ఇంటర్ బోర్డు జిల్లా అధికారి ప్రభాకర్‌రెడ్డి చెప్పడం గమనార్హం. -
Inter First Year: సిలబస్ తక్కువ.. చాయిస్ ఎక్కువ
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ ఫస్టియర్ పరీక్షలు సరళతరంగానే ఉంటాయని ఇంటర్ బోర్డ్ అధికారులు చెబుతున్నారు. అన్నివైపుల నుంచి వస్తున్న ఒత్తిడి, విద్యార్థుల ఆందోళనను పరిగణనలోనికి తీసుకుని కొంత మానవీయకోణంలోనే వెళ్తున్నామని అంటున్నారు. ఐచ్ఛిక(మల్టీపుల్ చాయిస్) ఎక్కువ, సిలబస్ 30 శాతం తగ్గించి ప్రశ్నపత్రం రూపొందించినట్టు ఓ ఉన్నతాధికారి స్పష్టం చేశారు. కొద్దోగొప్పో ఇంటర్ సబ్జెక్టులు అవగాహన చేసుకున్నవారికి ఈ పరీక్ష ఎంతమాత్రం కఠినం కాబోదన్నారు. సైన్స్ విద్యార్థుల ప్రాక్టికల్స్ విషయంలోనూ కొంత సానుకూల ధోరణితోనే ఉండే వీలుందని అధికార వర్గాల సమాచారం. ప్రాక్టికల్స్ నిర్వహించే కాలేజీల్లో కోవిడ్ మూలంగా ప్రయోగశాలలు పూర్తిస్థాయిలో పనిచేయడం లేదని బోర్డు గుర్తించింది. ఈ కారణంగా మౌఖిక ప్రశ్నలతో విద్యార్థుల సృజనాత్మకతను రాబట్టే ప్రయత్నం చేయాలని క్షేత్రస్థాయిలో అంతర్గత ఆదేశాలు ఇచ్చినట్టు ఉన్నతాధికారులు చెబుతున్నారు. గతేడాది ఇంటర్ ఫస్టియర్‌లో చేరిన విద్యార్థులకు కోవిడ్ కారణంగా పరీక్షలు నిర్వహించలేదు. దాదాపు 4.75 లక్షల మందిని ఉత్తీర్ణులుగా గుర్తించి, ద్వితీయ సంవత్సరానికి ప్రమోట్ చేశారు. కానీ, రెండో ఏడాదీ పరీక్షలు నిర్వహించని పరిస్థితి తలెత్తితే అది సమస్యగా అవుతుందని అధికారులు భావించారు. ఈ నేపథ్యంలో ఇంటర్ బోర్డు ఈ నెల 25 నుంచి పరీక్షల నిర్వహణకు సిద్ధమైంది. ద్వితీయ సంవత్సరం పరీక్షలు నిర్వహించని పక్షంలో మొదటి ఏడాది మార్కులనే కొలమానంగా తీసుకోవచ్చని భావిస్తున్నారు. సిలబస్ సింపుల్.. ఫస్టియర్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు బోర్డ్ ఇప్పటికే మోడల్ ప్రశ్నపత్రాలను అందుబాటులో ఉంచింది. 70 శాతం సిలబస్‌లోని పాఠాల్లో తేలికైన, విద్యార్థులకు ఆన్లైన్ ద్వారా అర్థమైన వాటినే గుర్తించారు. వీటిని ఎంపిక చేయడం కోసం నిపుణులైన అధ్యాపకుల సలహాలు కూడా తీసుకున్నారు. మెజారిటీ విద్యార్థులు తేలికగా సమాధానం ఇవ్వగల పాఠ్యాంశాలను ప్రశ్నపత్రం కూర్పుకు తీసుకునేలా ఏర్పాటు చేసినట్టు బోర్డ్ పరీక్షల నిర్వహణ విభాగం అధికారి ఒకరు చెప్పారు. ఇందులో కూడా మల్టిపుల్ చాయిస్‌ను ఈసారి ఎక్కువగా పెడుతున్నారు. ఒక ప్రశ్న కష్టమనుకుంటే, తేలికైన మరో ప్రశ్నకు జవాబు ఇచ్చే వెసులుబాటు 90 శాతం విద్యార్థులకు ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సైన్స్ విద్యార్థులకు ఈ విధానం సులభతరమవుతుందని భావిస్తున్నారు. ముఖ్యంగా ఫిజిక్స్, మేథమెటిక్స్ విద్యార్థులకు ప్రయోజనకరమని అధ్యాపకవర్గాలు చెబతున్నాయి. ఎకనమిక్స్‌లోనూ ఛాయస్ ఉండటం వల్ల తేలికగా పరీక్ష పాసయ్యే వీలుందని విద్యారంగ నిపుణులు అంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1,800 కేంద్రాల్లో ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు నిర్వహించబోతున్నారు. పరీక్ష మొదలుకొని, మూల్యాంకనం పూర్తయ్యే వరకూ కాలేజీ అధ్యాపకులే కీలకపాత్ర పోషిస్తారు. అధ్యాపకుల కొరత వల్ల ప్రస్తుతం ఫస్టియర్‌లో ఉన్నవాళ్లే కాకుండా, సెకండియర్ చదువుతున్న పరీక్షార్థులు కూడా ఇబ్బందిపడవచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది. ద్వితీయ సంవత్సరం మధ్యలో ఉన్న విద్యార్థులు మరోవైపు జాతీయ, రాష్ట్రీయ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. పరీక్ష పూర్తయిన తర్వాత యథావిధిగా ఇంటర్ క్లాసులు జరుగుతాయని, ఫస్టియర్ రాసే విద్యార్థులు పరీక్షల అనంతరం ఎప్పటిలాగే క్లాసులకు హాజరవ్వొచ్చని చెబుతున్నారు. మూల్యాంకనం చేసే అధ్యాపకులు కూడా వారి సబ్జెక్టులను విధిగా బోధించే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. పక్కా ప్రణాళికతోనే ఇంటర్ బోర్డు ముందుకెళ్తోందని అధికారవర్గాలు స్పష్టం చేస్తున్నాయి. చదవండి: Telangana: ధరణి పోర్టల్‌ను దారికి తేవడంపై నిపుణుల సూచనలు -
ఇంటర్లో సివిక్స్ సబ్జెక్ట్ పేరెందుకు మార్చారు?
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ కోర్సు కోసం సవరించిన సిలబస్‌లో ’సివిక్స్’సబ్జెక్ట్ పేరును ’పొలిటికల్ సైన్స్’గా మార్పు చేయడాన్ని సవాల్ చేసిన కేసులో రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఇంటర్ బోర్డుకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎందుకిలా మార్పు చేస్తున్నారో తెలియజేయాలని, పూర్తి వి వరాలతో కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని మంగళవారం న్యాయమూర్తి జస్టిస్ టి.వినోద్‌కుమార్ ఆదేశించారు. తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేశారు. ఏపీ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ యాక్ట్–1971 ప్రకారం సివిక్స్ సబ్జెక్ట్ ప్రవేశపెట్టడం జరిగిందని, దేశవ్యాప్తంగా ప్లస్ టు స్థాయి విద్య లో సివిక్స్ బోధన జరుగుతోందని, ఎలాంటి అధికారాలు లేకపోయినా ఇంటర్ బోర్డు కార్యదర్శి సివిక్స్ సబ్జెక్ట్ పేరు మార్పు చేయడం చెల్లదని పేర్కొంటూ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ స్కాలర్స్ అసోసియేషన్ రిట్ దాఖలు చేసింది. ఢిల్లీలోని ఒక విశ్వవిద్యాలయంలో సివిక్స్ చదివిన విద్యార్థికి బీఏ పొలిటికల్ సైన్స్ సీటు రాలేదని చెప్పి ఇంటర్ బోర్డు సెక్రటరీ ఇలా ఏకపక్షంగా పేరు మార్పు చేశారని తెలిపారు. ఇంటర్ బోర్డు సెక్రటరీకి ఎలాంటి అధికారం లేదని రిట్లో పేర్కొన్నారు. -
ఎగ్జామ్ సెంటర్ తెలుసుకునేందుకు ‘ఆప్’
హైదరాబాద్‌సిటీ: తెలంగాణ సచివాలయంలో ఇంటర్మీడియట్ బోర్డు ఎగ్జామ్ సెంటర్ లొకేటర్ ఆప్ ను విద్యాశాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ రంజీవ్ ఆర్ ఆచార్య ఆవిష్కరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం విద్యావ్యవస్థను పటిష్టం చేస్తోందన్నారు. విద్యార్థులు పరీక్షా సమయంలో సెంటర్ లు దొరక్క ఇబ్బందులు పడుతున్నారని, వాటిని దృష్టిలో ఉంచుకొని ఈ లొకేటర్ ఆప్ ని విడుదల చేశామని తెలిపారు. దేశ చరిత్ర లొనే ఇలాంటి ఆప్ ను రూపొందించడం మొదటిసారని అన్నారు. విద్యార్థులు ఆప్‌ని ఆండ్రాయిడ్ మొబైల్ లో డౌన్ లోడ్ చేసుకొని, హాల్ టికెట్ నెంబర్ ని ఎంటర్ చేస్తే ఎగ్జామ్ సెంటర్ బిల్డింగ్ తో పాటు లొకేషన్ రూట్ మ్యాప్ చూపిస్తుందన్నారు. ఇంటి నుంచి సెంటర్ కి చేరుకోవడానికి ఎంత సమయం పడుతుందో కూడా ఈ ఆప్ ద్వారా తెలుసుకోవచ్చుని తెలిపారు.