సిరిసిల్ల ఎస్పీని సస్పెండ్ చేయాలి: వీహెచ్
సాక్షి, హైదరాబాద్: సిరిసిల్ల జిల్లా నేరెళ్లలో దళితులపై దాడికి దిగిన జిల్లా ఎస్పీని సస్పెండ్ చేయాలని, లేకుంటే ఈ నెల 30న దీక్షకు దిగుతానని ఏఐసీసీ కార్యదర్శి వి.హన్మంతరావు హెచ్చరించారు. శుక్రవారం ఆయన గాంధీభవన్లో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ అహంకారపూరిత మాటాలను మానుకోవాలని హెచ్చరించారు.
ఇది ప్రజాస్వామ్య దేశమా? దొరల రాజ్యమా? అని ప్రశ్నించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నేరెళ్ల బాధితులను మంత్రి కేటీఆర్ దొంగలాగా వెళ్లి పరామర్శించాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. ఈ ఘటనలో ఎస్పీని వదిలి ఎస్ఐని సస్పెండ్ చేయడం సమంజసంకాదని వీహెచ్ అన్నారు. బాధితుల పక్షాన ప్రతిపక్షాలు పోరాడుతుంటే రాజకీయమంటూ నిందలు వేయడం తగదన్నారు. నేరెళ్ల ఘటనలో లారీ ప్రమాదంలో చనిపోయినవారి కుటుంబాలకు రూ.20 లక్షలు, పోలీసుల చేతిలో థర్డ్ డిగ్రీకి గురయిన వారికి రూ.5 లక్షల పరిహారం చెల్లించాలని వీహెచ్ డిమాండ్ చేశారు.