ఆఫ్రికాలో రాబడి ఎక్కువే..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అపార వాణిజ్య అవకాశాలున్న ఆఫ్రికాలో పెట్టుబడులపై రాబడులు అధికంగా ఉంటాయని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్స్ (ఎఫ్ఐఈవో) అంటోంది. రాబడులతోపాటు ఆఫ్రికాలోని కొన్ని దేశాల్లో రిస్క్ కూడా ఉందని ఎఫ్ఐఈవో దక్షిణ ప్రాంత చైర్మన్ వాల్టర్ డిసౌజా అన్నారు. కెన్యాలో వ్యాపార అవకాశాలపై శుక్రవారమిక్కడ జరిగిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. ఫార్మా, ఆటోమొబైల్, విడిభాగాలు, మౌలిక రంగం, టెలికం, ఐటీ, ఆరోగ్య రంగాల్లో అవకాశాలు పుష్కలమని తెలిపారు.
కెన్యా, ఇథియోపియా, టాంజానియా, ఐవరీకోస్ట్, ఘనా, బెనిన్, జాంబియా దేశాలు వ్యాపారానికి అనుకూలమని చెప్పారు. నైరోబీలో మార్చి 27-29 తేదీల్లో ఇండియా ఎక్స్పో జరుగుతోందని వివరించారు. భారత్ నుంచి సుమారు 100 కంపెనీలు ఎక్స్‌పోలో పాల్గొనే అవకాశం ఉందని తెలిపారు. ఆఫ్రికా-భారత్‌ల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 2013-14లో 75 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఆఫ్రికాలో రూ.180 లక్షల కోట్ల వ్యాపార అవకాశాలున్నాయని కెన్యా మాజీ ప్రధాని రైలా ఒడింగా అన్నారు. కార్యక్రమంలో టీఎస్ఐఐసీ వైస్ చైర్మన్ జయేష్ రంజన్ తదితరులు పాల్గొన్నారు.