Investigation of case
-
ఆధారాల్లేకుండా అరెస్టులా?
సాక్షి, అమరావతి : పోలీసులు ఆయా కేసుల్లో నిందితులు ఇచ్చే వాంగ్మూలాలను సాక్ష్యంగా పరిగణించాలన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. కేసుల దర్యాప్తు విషయంలో రాష్ట్ర వైఖరి పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నామని తెలిపింది. వాంగ్మూలాలను అడ్డం పెట్టుకుని నిందితులను నెలల తరబడి జైళ్లలో ఉంచాలంటే సాధ్యం కాదని తేల్చి చెప్పింది. వాంగ్మూలాలను సాక్ష్యాలుగా పరిగణించాలన్న ప్రభుత్వ వాదనను సైతం తోసిపుచ్చుతున్నట్లు తెలిపింది. ఈ వాదనతో ఏ మాత్రం ఏకీభవించలేమంది. సహ నిందితుల వాంగ్మూలాలను తమను (కోర్టులను) కూడా పరిగణనలోకి తీసుకోవాలని పోలీసులు కోరుతున్నారని, ఇది ఎంత మాత్రం సాధ్యం కాని పని అని స్పష్టం చేసింది. ఆధారాలు సేకరించకుండా వాంగ్మూలాలపై ఆధార పడాలంటే ఎలా? అంటూ పోలీసులపై అసహనం వ్యక్తం చేసింది. వాంగ్మూలాల ఆధారంగా ఇతరులను నిందితులుగా చేర్చి, అరెస్ట్ చేస్తున్న పోలీసులు.. ఆ తర్వాత ఎలాంటి దర్యాప్తు చేయకుండా, ఎలాంటి ఆధారాలు సేకరించకుండా నెలల తరబడి నిందితులను జైళ్లలో ఉంచుతున్నారంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. వాంగ్మూలాలు కేవలం దర్యాప్తునకు ఓ దారి చూపుతాయే తప్ప, వాటిని సాక్ష్యంగా తీసుకోజాలమంది. దర్యాప్తు చేయనప్పుడు నిందితులను జైళ్లలో ఉంచడం అనవసరమంది. వాళ్లను ఊరికే జైళ్లలో ఉంచి, ప్రజల డబ్బును ఎందుకు వృథా చేస్తున్నారని ప్రశ్నించింది. పేపర్ ఖాళీగా ఉందని వాంగ్మూలాల పేరుతో ఏది పడితే అది రాసేస్తామంటే ఎలా అంటూ నిలదీసింది. వాంగ్మూలాలను చూస్తుంటే నిందితులంతా రాష్ట్రానికి విశ్వాస పాత్రులుగా కనిపిస్తున్నారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది. దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేనప్పుడు ఏ కారణంతో బెయిల్ ఇవ్వొద్దని కోర్టులను కోరుతారని పోలీసులను నిలదీసింది. చాలా కేసుల్లో ఇంతే.. ఆయా కేసుల్లో రాష్ట్రం తీరు ఎంత మాత్రం సరిగా లేదని హైకోర్టు స్పష్టం చేసింది. బెయిల్ పిటిషన్ల విషయంలో రాష్ట్రం చాలా రొటీన్‌గా వ్యవహరిస్తోందని, దీంతో హైకోర్టులో పుంఖాను పుంఖాలుగా బెయిల్ పిటిషన్లు దాఖలవుతున్నాయని తెలిపింది. వీటి సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేసింది. ఎన్నో వందల కిలోమీటర్ల నుంచి న్యాయం కోసం ఎంతో మంది హైకోర్టును ఆశ్రయిస్తున్నారని చెప్పింది. వీళ్లంతా నవ్వులాటకు ఈ బెయిల్ పిటిషన్లు దాఖలు చేస్తున్నారని అనుకుంటున్నారా? అంటూ తీవ్ర స్వరంతో పోలీసులను ప్రశి్నంచింది. గంజాయి కేసులో విశాఖపట్నం జిల్లా నక్కపల్లి మండలం ఒడ్డిమిట్ట గ్రామం వద్ద పట్టుబడిన లారీ డ్రైవర్ వాంగ్మూలం ఆధారంగా హనుమంతరావు అనే వ్యక్తిని నిందితునిగా చేర్చి, అరెస్ట్ చేసిన పోలీసులు.. ఆ వ్యక్తికి వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలను సేకరించకుండా అతన్ని నాలుగు నెలలుగా జైల్లో ఉంచడంపై మండి పడింది. అతనికి బెయిల్ ఇవ్వొద్దని కోరడంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. హనుమంతరావుకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. హనుమంతరావు నుంచి ఎలాంటి గంజాయిని స్వాదీనం చేసుకోలేదని తెలిపింది. అతనికి వ్యతిరేకంగా పోలీసులు ఒక్క కాగితం ముక్కను కూడా ఆధారంగా చూపలేకపోయారని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి జస్టిస్ కృపాసాగర్ రాష్ట్రం తీరును తీవ్రంగా గర్హించారు. పీపీ వాదనపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ దానిని తన ఉత్తర్వుల్లో రికార్డ్ చేశారు. -
డబ్బులు డబుల్ చేస్తామని బురిడీ
సాక్షి, చౌటుప్పల్: ముగ్గురు వ్యక్తులు ముఠాగా ఏర్పడి మోసాలకు పాల్పడుతూ అడ్డంగా దొరికిపోయారు. రెండు వేల నోట్లు రెండిస్తే వాటిని నాలుగు చేస్తానని చెప్పి ఓ వ్యక్తికి నిజంగానే ఇచ్చారు. దాంతో ఆ అమాయకుడికి మరింత ఆశ పుట్టింది. దానిని ఆసరాగా చేసుకున్న నిందితులు ఆ అమాయకుడి నుంచి రూ.12 లక్షలు వసూలు చేసి పరారయ్యారు. పోలీసులకు ఫిర్యాదు అందడంతో చాకచక్యంగా నిందితుల్లో ఒకరిని పట్టుకున్నారు. ఈ సంఘటన చౌటుప్పల్ మండలం కైతాపురం గ్రామంలో చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించిన వివరాలను భువనగిరి డీసీపీ నారాయణరెడ్డి శుక్రవారం మండల కేంద్రంలోని ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. సూర్యాపేట జిల్లా నాగారం మండలం శాంతినగర్ గ్రామానికి చెందిన షేక్ సైదా (33) వృత్తి రీత్యా బండరాళ్లు కొట్టి జీవనం సాగిస్తుంటాడు.ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా మాచవరం మండలం తుర్కపాలెం(జింకలపాలెం) గ్రామంలో స్థిరపడ్డాడు. ఇదే గ్రామానికే చెందిన షేక్ చిన్నవలీ, ప్రకాశం జిల్లా మార్టూరు మండలం వరపల్ల గ్రామానికి చెందిన షేక్ బాషా వరసకు అన్నదమ్ములు. వీరిలో షేక్ బాషా రకరకాల మోసాలకు పాల్పడుతుంటాడు. చిన్నవలీ ద్వారా షేక్ సైదాకు షేక్ బాషా పరిచయమయ్యాడు. మీరు పొద్దంతా కష్టపడినా పెద్దగా డబ్బులు రావడంలేదని, తనను నమ్ముకుంటే తొందరగా డబ్బులు సంపాదించవచ్చని బాషా ఆశ కల్పించాడు.దీంతో ముగ్గురూ ముఠాగా ఏర్పడ్డారు. మొదట కైతాపురం గ్రామంలో మోసాలు చేయడం మొదలు పెట్టారు. కైతాపురానికి మార్చిన మకాం.. ముగ్గురు నిందితుల్లో ఒకడైన షేక్ సైదా గత రెండేళ్ల క్రితం మండల పరిధిలోని కైతాపురం గ్రామానికి వలస వచ్చాడు. బండరాళ్లు కొడుతూ జీవించాడు. రెండు నెలల క్రితం తుర్కపాలెం వెళ్లిపోయాడు. సులువుగా డబ్బులు సంపాదించాలని భావించాడు. దాంతో షేక్ చిన్నవలీ, షేక్ బాషాతో కలిసి సైదా ఇటీవల మళ్లీ తిరిగి కైతాపురం వచ్చాడు. గ్రామంలో ఎవరిని సులువుగా మోసం చేయొచ్చో ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు. తనకున్న పాత పరిచయాల ప్రకారం ఓ వ్యక్తిని గుర్తించాడు. రెండు నోట్లను నాలుగు చేస్తామని... నిందితులు కైతాపురం గ్రామానికి చెందిన ఐలయ్య అనే వ్యక్తి ఇంటి వద్దకు వచ్చారు. తమకు రెండు వేల రూపాయల నోట్లు రెండు ఇస్తే వాటిని నాలుగు చేస్తామని, అవి ఎక్కడైనా చెల్లుతాయని నమ్మబలికారు. దీనికి అంగీకరించిన ఐలయ్య తన వద్ద ఉన్న రెండు రెండు వేల రూపాయల నోట్లను వారికి ఇచ్చాడు. ఇంట్లోని వేరే గదిలోకి వెళ్లి కొన్ని రకాల రసాయన ద్రావణాలు నోట్లపై వేయాల్సి ఉందని చెప్పి నిందితులు లోనికి వెళ్లారు. కొంత సేపటి తర్వాత బయటకు వచ్చి నాలుగు నోట్లను ఐలయ్యకు ఇచ్చారు. దాంతో ఐలయ్య మరుసటి రోజు ఆ నాలుగు నోట్లను తీసుకొని చౌటుప్పల్‌లోని ఓ బ్యాంకులోని తన ఖాతాలో వేశాడు. దాంతో అవి ఎకౌంట్లో జమయ్యాయి. అనంతరం ఐలయ్య నిందితుల మాట నిజమని నమ్మాడు. రూ. 12 లక్షల సేకరణ రెండు నోట్లను నాలుగు చేయడంతో ఐలయ్యకు ఆశ ఎక్కువైంది. దాంతో నిందితులు 30 నుంచి 40 లక్షల రూపాయలు తీసుకొస్తే వాటిని రెండింతలు చేస్తామని ఐలయ్యకు చెప్పారు. పూర్తిగా రెండు వేల నోట్లే తేవాలని సూచించారు. సరేనన్న ఐలయ్య బంధువులు, మిత్రుల వద్ద రూ.12 లక్షలు సేకరించి నిందితులకు సమాచారం అందించాడు. దాంతో వారు ఈనెల 21న ఐలయ్య ఇంటికి వచ్చారు. రూ. 12 లక్షలు తీసుకొని ఇంట్లోని వేరే గదిలోకి వెళ్లారు. నగదు తీసుకొని రెండు వేల నోటు సైజులో ఉన్న నల్ల రంగుకాగితాలను మరో బ్యాగులో చుట్టి ఇచ్చారు. రసాయన ద్రావణాలు వేసినందున బ్యాగులోని కట్టలను రెండు రోజుల తర్వాత తెరవాలని సూచించి వెళ్లిపోయారు. కానీ ఐలయ్య మరుసటి రోజే బ్యాగును తెరిచిచూశాడు. బ్యాగులో ఉన్న కాగితాలను చూసి నెత్తీనోరు కొట్టుకున్నాడు. మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించాడు. అదుపులోకి తీసుకున్న పోలీసులు బాధితుడు ఐలయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుల స్వగ్రామాలపై నిఘా పెట్టారు. ఇవేమీ తెలియని నిందితుల్లో ఒకడైన షేక్ సైదా ఈనెల 27న రాత్రి 10 గంటల సమయంలో చౌటుప్పల్ మండలంలోని వలిగొండ రోడ్డు వద్ద బస్సు దిగాడు. రాత్రి వేళలో పెట్రోలింగ్ నిర్వహించే పోలీసులు అతన్ని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. మరింతగా విచారించగా చేసిన మోసం ఒప్పుకున్నాడు. ఇతని వద్ద 12 లక్షల రూపాయల నగదు, నల్లరంగు పూసిన కాగితాలు స్వాధీనం చేసుకున్నారు. షేక్ బాషా, షేక్ చిన్నవలీలు పరారీలో ఉన్నారు. వారి కోసం గాలింపు నిర్వహిస్తున్నామని డీసీపీ తెలిపారు. కేసులో చురుకుగా పని చేసిన హెడ్‌కానిస్టేబుల్ నర్సింహ, హోంగార్డు ఊడుగు సైదులును అభినందించారు. ఈ సమావేశంలో ఏసీపీ సత్తయ్య, సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ సత్యనారాయణ, సిబ్బంది పాల్గొన్నారు. -
మహిళ కాళ్లు, చేయి లభ్యం.. కలకలం!
సాక్షి, సేలం: ఓ గుర్తు తెలియని మహిళ కాళ్లు, చేతులు లభించిన సంఘటన నామక్కల్ జిల్లాలో శుక్రవారం కలకలం రేపింది. వివరాలివి.. నామక్కల్ సమీపంలోని కరూర్- సేలం జాతీయ రహదారి ఉంది. ఇక్కడే ఓ వంతేన కింద ఓ మహిళ రెండు కాళ్లు, ఒక చేయి ఉన్నట్లు నల్లిపాలయం పోలీసులకు సమాచారం అందింది. ఇన్స్పెక్టర్ తంగవేల్ సిబ్బంది అక్కడికి చేరుకుని ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ఓ మహిళ కాళ్లు, గోరింటాకు పెట్టిన ఒక చేయి పడి ఉన్నాయి. ఇతర శరీర భాగాల కోసం ఆ ప్రాంతంలో వెతికగా గొంతు నులిమి చంపిన స్థితిలో మూడు మేకల కళేబరాలు లభించాయి. పోలీసులు ఆ రెండు కాళ్లు, చేయిని పోస్టుమార్టం నిమిత్తం నామక్కల్ జీహెచ్‌కు తరలించారు. మేకల కళేబరాలను కూడా పశువైద్య కళాశాల ఆస్పత్రికి పంపించారు. అనంతరం డీఎస్పీ రాజేంద్రన్ ఘటన స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. ఆ మహిళను ఎవరైనా బలి ఇచ్చారా? అక్రమ సంబంధంతో హత్యకు గురైందా అనే కోణాల్లో పోలీసులు కేసు విచారణ చేస్తున్నట్లు సమాచారం. -
ఎస్తేర్ అనూహ్య కేసు విచారణలో జాప్యం
* ఘటన జరిగి ఏడాది పూర్తి * నిందితునికి టీబీ వ్యాధి సాక్షి ముంబై: ముంబైలో హత్యకు గురైన తెలుగు యువతి ఎస్తేర్ అనూహ్య కేసు విచారణ జాప్యమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ సంఘటన జరిగి ఇప్పటికే ఏడాది పూర్తయింది. మరోవైపు కేసుకు సంబంధించి ప్రధాన ఆధారాలుగా భావించిన ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్ ఇంతవరకు లభించలేదు. ఇక ఈ కేసులో నిందితుడైన చంద్రబాన్ సానప్ అలియాస్ లౌక్యాకు టీబీ వ్యాధి సోకిందని వె ళ్లడైంది. ఈ నేపథ్యంలో కేసు విచారణ జాప్యం కానుందని తెలుస్తోంది. ఎస్తేర్ అనూహ్య కేసు ముంబైతోపాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. గత ఏడాది జనవరి అయిదవ తేదీన విజయవాడలో రెలైక్కిన అనూహ్య కుర్లా నుంచి అదృశ్యమై కంజూర్‌మార్గ్-భాండూప్ రోడ్డుపక్కన పొదలలో 16న శవమైతేలిన సంగతి తెలిసిందే. కాలిపోయిన ఆమె మృతదేహాన్ని అక్కడ లభించిన బట్టల ఆధారంగా గుర్తించారు. ఈ సంఘటనతో ముంబైలో మహిళల భద్రతపై తీవ్రస్థాయిలో నిరసనలు వెల్లువెత్తాయి. తెలుగు సంఘాలతోపాటు అనేక స్వచ్ఛంద, రాజకీయ సంస్థలు నిరసనలను వ్యక్తం చేస్తు ర్యాలీలు నిర్వహించాయి. ఎట్టకేలకు నిందితుడు చంద్రబాన్‌ను మార్చి రెండవ తేదీన పట్టుకున్నారు. ఘటన జరిగిన 85 రోజులకు మే 26వ తేదీన పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. ఈ సంఘటన జరిగి సంవత్సరం పూర్తి అయినప్పటికీ కేసు విచారణ మాత్రం కొనసాగుతోంది. నిందితుడు చంద్రబాన్ సానప్కు టీబీ సోకిందని తెలియడంతో, అతడిని విచారణ కోసం కోర్టులో హాజరుపరచవద్దని న్యాయమూర్తి ఆదేశించారు. దీంతో 2014 డిసెంబరు 22వ తేదీ నుంచి నిందితున్ని కోర్టులో హాజరుపరచడంలేదు.