* ఘటన జరిగి ఏడాది పూర్తి
* నిందితునికి టీబీ వ్యాధి
సాక్షి ముంబై: ముంబైలో హత్యకు గురైన తెలుగు యువతి ఎస్తేర్ అనూహ్య కేసు విచారణ జాప్యమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ సంఘటన జరిగి ఇప్పటికే ఏడాది పూర్తయింది. మరోవైపు కేసుకు సంబంధించి ప్రధాన ఆధారాలుగా భావించిన ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్ ఇంతవరకు లభించలేదు. ఇక ఈ కేసులో నిందితుడైన చంద్రబాన్ సానప్ అలియాస్ లౌక్యాకు టీబీ వ్యాధి సోకిందని వె ళ్లడైంది. ఈ నేపథ్యంలో కేసు విచారణ జాప్యం కానుందని తెలుస్తోంది. ఎస్తేర్ అనూహ్య కేసు ముంబైతోపాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. గత ఏడాది జనవరి అయిదవ తేదీన విజయవాడలో రెలైక్కిన అనూహ్య కుర్లా నుంచి అదృశ్యమై కంజూర్‌మార్గ్-భాండూప్ రోడ్డుపక్కన పొదలలో 16న శవమైతేలిన సంగతి తెలిసిందే. కాలిపోయిన ఆమె మృతదేహాన్ని అక్కడ లభించిన బట్టల ఆధారంగా గుర్తించారు.
ఈ సంఘటనతో ముంబైలో మహిళల భద్రతపై తీవ్రస్థాయిలో నిరసనలు వెల్లువెత్తాయి. తెలుగు సంఘాలతోపాటు అనేక స్వచ్ఛంద, రాజకీయ సంస్థలు నిరసనలను వ్యక్తం చేస్తు ర్యాలీలు నిర్వహించాయి. ఎట్టకేలకు నిందితుడు చంద్రబాన్‌ను మార్చి రెండవ తేదీన పట్టుకున్నారు. ఘటన జరిగిన 85 రోజులకు మే 26వ తేదీన పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. ఈ సంఘటన జరిగి సంవత్సరం పూర్తి అయినప్పటికీ కేసు విచారణ మాత్రం కొనసాగుతోంది. నిందితుడు చంద్రబాన్ సానప్‌కు టీబీ సోకిందని తెలియడంతో, అతడిని విచారణ కోసం కోర్టులో హాజరుపరచవద్దని న్యాయమూర్తి ఆదేశించారు. దీంతో 2014 డిసెంబరు 22వ తేదీ నుంచి నిందితున్ని కోర్టులో హాజరుపరచడంలేదు.
ఎస్తేర్ అనూహ్య కేసు విచారణలో జాప్యం
Published Thu, Jan 8 2015 10:45 PM | Last Updated on Sat, Sep 2 2017 7:24 PM
Advertisement