అంతా మా ఇష్టం
ఎన్పీకుంట : స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న పదో తరగతి పరీక్షల కోసం జిల్లా కేంద్రం నుంచి వచ్చిన జాబితాలోని ఇన్విజిలేటర్ల ఎంపికను డిపార్టు మెంటల్ ఆఫీసర్, చీఫ్లు అంతా మా ఇష్టం అన్నట్లు నిర్వహిస్తున్నారు. ఓ ఉపాధ్యాయుడు తనకు అనుకూలంగా ఉన్న ఉపాధ్యాయులు మాత్రమే ఇన్విజిలేటర్లుగా కొనసాగాలనే ఉద్ధేశంతో పూర్తి తతంగం సాగించినట్లు సమాచారం. అందుకు తగ్గట్టుగానే సోమవారం పరీక్షా కేంద్రం వద్దకు 13 మంది ఇన్విజిలేటర్లు రాగా వారిలో ఎవరిని తీసుకున్నది అధికారులు చివరి వరకు గోప్యంగా ఉంచడంపై తీవ్ర అనుమానాలకు తావిస్తోంది.
పరీక్షలకు ముందు రోజే ఎంపికైన ఇన్విజిలేటర్లను పిలిపించుకుని వారితో పరీక్షా కేంద్రంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు ఇవ్వడంతో పాటు వారి నుంచి సంతకాలు చేయించుకోవాల్సి ఉంటుంది. అందుకు విరుద్ధంగా డీఓ సాంబశివారెడ్డి, చీఫ్ తిరుపాల్ నాయక్ సమావేశం నిర్వహించకుండా సోమవారం 9 గంటల వరకు ఎవరిని ఇన్విజిలేటర్లుగా ఉన్నారో విషయం చెప్పకుండా ఒకే సారి గదులు కేటాయిస్తూ పేరు చెప్పడంతో ఒక్కసారిగా ఉపాధ్యాయుల మధ్య గొడవ మొదలైంది. 13 మంది ఇన్విజిలేటర్లలో తొమ్మిది మందిని మాత్రమే తీసుకుని తక్కిన నలుగురు అవసరం లేదంటూ చెప్పారు.