Invisible forces
-
మీరు గానీ.. ఒక్కసారి గానీ.. ఈ షీల్డ్ వెనక్కి వెళ్లారంటే!
హ్యారీ పాటర్ సినిమాలో చూసే ఉంటారు. ఒక వింత వస్త్రాన్ని చుట్టేసుకొని హ్యారీ టక్కున మాయమైపోతుంటాడు. అతను అక్కడే ఉన్నా చూసే వాళ్లకు మాత్రం లేడనిపించేలా ఆ వస్త్రం కనికట్టు చేస్తుంది. వెనకున్న వస్తువులు కనిపిస్తాయి కాని అతను మాత్రం కనిపించడు. మళ్లీ దాన్ని తీసేయగానే హ్యారీ బయటకు కనిపిస్తుంటాడు. ఇలా సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో కనిపించే ఈ వెరైటీ వస్త్రాన్ని ఇప్పుడు నిజంగానే షీట్ రూపంలో తయారు చేశారు. లండన్‌కు చెందిన స్టార్టప్ కంపెనీ ‘ఇన్విజిబిలిటీ షీల్డ్ కో’.. ఈ మ్యాజిక్ షీట్‌ను తాజాగా ప్రపంచానికి పరిచయం చేసింది. ఎంతలా కష్టపడ్డారో! ఇన్విజిబిలిటీ షీల్డ్‌ను అనుకున్నట్టు తయారు చేయడానికి ఎంతో కష్టపడ్డామని తయారీ బృందం చెప్పింది. ఎన్నో వస్తువులు, పదార్థాలను పరీక్షించామని, ఎన్నో వైఫల్యాలు ఎదురయ్యాయని తెలిపింది. విభిన్న కోణాలు, ఆకృతులు, దూరాల్లో లెన్స్‌లను పరీక్షించామని.. చివరగా కుంభాకార కటకాలను పాలిమర్ షీట్లో ఓ శ్రేణిలో అమర్చి అనుకున్న ఫలితాన్ని రాబట్టామని వివరించింది. గడ్డి ప్రాంతాలు, తీర ప్రాంతాలు లాంటి బ్యాక్‌గ్రౌండ్ ఒకేలా ఉన్న ప్రదేశాల్లో ఈ షీల్డ్‌లు అద్భుతంగా పని చేస్తాయంది. ఎక్కువ ఉష్ణోగ్రతను, అల్ట్రావయోలెట్ కాంతిని తట్టుకోగలవని తెలిపింది. ఇంతకీ ఈ షీల్డ్‌ల ధరెంతో తెలుసా? 37్ఠ25 ఇంచుల షీల్డ్‌కు కేవలం రూ.30 వేలు. ఇప్పటికే 25 షీల్డ్‌లను తయారు చేశారు. మరిన్ని తయారు చేసేందుకు సిద్ధమవుతున్నారు. షీల్డ్ ఎలా పని చేస్తుందంటే..? ఇన్విజిబిలిటీ షీల్డ్ వెనుక దాక్కునే వ్యక్తులు, వస్తువులు కనిపించకుండా ఉండేందుకు నిలువు పద్ధతిలో ప్రత్యేక లెన్స్ శ్రేణిని (ఒకదాని పక్కన మరొకటి వరుసగా పేర్చడం) వాడారు. షీల్డ్ ముందు నుంచి చూసే వ్యక్తికి షీల్డ్ వెనకున్న వ్యక్తి కనిపించకుండా కాంతిని పరావర్తనం చెందించే సూత్రాన్ని ఉపయోగించారు. అంటే షీల్డ్ వెనకున్న వ్యక్తి నుంచి పరావర్తనం చెందే కాంతి షీల్డ్ ముందున్న వ్యక్తి వరకు చేరకుండా పక్కలకు ప్రసరించేలా లెన్స్‌లను వాడారు. షీల్డ్ వెనకున్న బ్యాక్‌గ్రౌండ్ మాత్రం బాగా కనబడేలా జాగ్రత్తలు తీసుకున్నారు. మొత్తంగా షీల్డ్ వెనకున్న వ్యక్తి కనిపించడు కానీ వెనకాల బ్యాక్‌గ్రౌండ్ మాత్రం కనిపిస్తుంది. అంటే షీల్డ్ వెనకున్న వ్యక్తి మాయమైనట్టే! చదవండి: 24 వేల ఏళ్లుగా గడ్డకట్టే మంచులోనే పడిఉంది... కానీ ఆ జీవి బతికే ఉంది! –సాక్షి సెంట్రల్ డెస్క్ -
జిమ్‌లో ‘దెయ్యం’.. కాలు పట్టుకుని మరీ లాక్కెళ్లింది
దెయ్యాలు ఉన్నాయా.. లేవా.. అనే విషయం మీద ఎప్పటికి చర్చలు నడుస్తూనే ఉంటాయి. చాలా మంది దెయ్యాలున్నాయని విశ్వసిస్తే.. కొందరు మాత్రం అదంతా ఉట్టిదే అని కొట్టిపారేస్తారు. ఇక ఇంటర్నెట్లో దెయ్యాలకు సంబంధించిన వీడియోలు కోకొల్లలు. అయితే వీటిలో చాలా మటుకు ఫేక్ వీడియోలే అని మనం గుర్తించగలం. కానీ కొన్ని వీడియోలుంటాయి.. ఎంతటి ధైర్యవంతులైనా సరే.. వాటిని చూస్తే.. దడుసుకోవాల్సిందే. ఈ తరహాకు చెందిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఎక్సర్సైజ్ చేసుకుందామని జిమ్‌కు వచ్చిన వ్యక్తిని ‘దెయ్యం’ పరుగులు పెట్టించింది. కాలు పట్లుకుమని లాక్కెళ్లింది. ఆ వివరాలు.. టిక్‌టాక్ యూజర్ @carlosruizoficial పోస్ట్ చేసిన ఈ వీడియో ఇప్పటికే 12 మిలియన్లకు పైగా వ్యూస్‌తో విపరీతంగా వైరల్ అవుతోంది. దీనిలో జిమ్‌కు వెళ్లిన ఓ వ్యక్తిని అదృశ్య శక్తి ఫ్లోర్ అంతటా లాగుతున్నట్లు వీడియోలో చూడవచ్చు. ఎక్సర్సైజ్ కోసం ఓ వ్యక్తి జిమ్‌కు వెళ్లాడు. ఆ సమయంలో జిమ్‌లో అతనొక్కడే ఉన్నాడు. ఇక అతడు వామప్ చేసుకుంటూ ఉండగా.. అతడి వెనక ఉన్న కొన్ని జిమ్ పరికరాలు వాటంతట అవే కదులుంతుంటాయి. మొదట ఆ వ్యక్తి దాన్ని పెద్దగా పట్టించుకోడు. ఆ తర్వాత మరి కొన్ని పరికరాలు అలానే అసాధారణ రీతిలో కదలడం మొదలవుతుంది. వీటన్నింటిని గమనించిన సదరు వ్యక్తి అక్కడ ఏదో అదృశ్య శక్తి ఉందని భావించి... బయటకు వెళ్లాలని అనుకుంటాడు. ఇక తనతో పాటు తీసుకువచ్చిన వస్తువులు తీసుకుని బయటకు వెళ్తుండగా.. సడెన్‌గా కిందపడతాడు. ఆ తర్వాత ఉన్నట్టుండి అతడి కాలు గాల్లోకి లేస్తుంది. ఆ తర్వాత ఎవరో అతడి కాలు పట్టి జిమ్ ఫ్లోర్ మీద కొంత దూరం ఈడ్చుకెళ్లినట్లు కనిపిస్తుంది. కానీ అక్కడ ఎవరు కనిపించరు. వదిలేయగానే.. ఆ వ్యక్తి కాలుకు పని చెప్పి.. అక్కడ నుంచి బయటకు పరిగెత్తాడు. ఈ వీడియోపై నెటిజనులు రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు కావాలనే ఇలాంటి స్టంట్లు చేశారు.. అక్కడ దెయ్యం లేదు పాడు లేదు అంటుండగా.. మరి కొందరు దెయ్యం కూడా జిమ్ చేద్దామని వచ్చి ఉంటుంది.. అతడు అక్కడే ఉండటం దానికి నచ్చలేదేమో.. అందుకు ఇలా బయటకు గెంటేసింది అని కామెంట్ చేస్తున్నారు నెటిజనులు. -
అదృశ్య శక్తి సాధ్యమేనా?
ప్రయత్నం అదృశ్య శక్తులతో రాకాసి మూకలు చెలరేగి సాగించే యుద్ధబీభత్స ఘట్టాలను పురాణాల్లో చదువుకునే ఉన్నాం. అలనాడు రామాయణ కాలంలో మారీచుడు, ఇంద్రజిత్తు, మహాభారత కాలంలో అలంబసుడు, ఘటోత్కచుడు వంటి వారు అదృశ్య యుద్ధాలలో ఆరితేరిన వీరులు. మాయలు, మంత్రాల శక్తులతో వారు కంటికి కనిపించకుండా, శత్రువులను ముప్పు తిప్పలు పెట్టేవారు. అదంతా పురాణకాలం. అప్పట్లో మంత్రాలకు చింతకాయలేం ఖర్మ, ఏకంగా తలకాయలే తాటికాయల్లా తెగిపడేవి. పురాణకాలం గతించి, నవీనకాలం వచ్చింది. నవీనకాలంలో మనుషులు తెలివి మీరారు. యుద్ధవిద్యల్లో మార్పులు వచ్చాయి. కత్తులు, కటార్లు, బరిసెలు, ఈటెలు, గదలు, ధనుర్బాణాలు వంటి ఆయుధాలు రంగస్థలానికీ, సినీరంగానికే పరిమితమయ్యాయి. ఆధునిక రణరంగాలలోకి తుపాకులు, ఫిరంగులు, బాంబులు కురిపించే యుద్ధవిమానాలు, క్షిపణులు, రాకెట్లు వచ్చి పడ్డాయి. దివ్యాస్త్రాలు ఉన్నాయో లేదో నవీన మానవులకు తెలియదు గానీ, అణ్వస్త్రాలు సృష్టించే బీభత్సం మాత్రం హిరోషిమా, నాగసాకిల సాక్షిగా బాగానే తెలుసు. ఆధునిక కాలంలో రెండు ప్రపంచ యుద్ధాలు జరిగాయి. అయితే, అక్కడితోనే యుద్ధకాండ సమసిపోలేదు. అంతర్యుద్ధాలు, శీతల యుద్ధాలు అక్కడక్కడా జరుగుతూనే ఉన్నాయి. వీటికి తోడు అత్యంత శాంతికాముకులైన అగ్రరాజ్యాలు శాంతిస్థాపన కోసం, ఉగ్రవాద నిర్మూలన కోసం సాగించే యుద్ధాలు సరేసరి! అధునాతన యుద్ధకాండ మరీ మొనాటనస్‌గా మారిపోతోందని అగ్రరాజ్యమైన అమెరికా దిగులు పెట్టేసుకున్నట్లుగా ఉంది. యుద్ధరంగంలో మొనాటనీని బద్దలు కొట్టేందుకు పురాణ రణతంత్రాన్నే వినూత్నంగా తెరపైకి తెచ్చేందుకు కసరత్తు మొదలుపెట్టింది. అదృశ్య యుద్ధాలతో కంటికి కనిపించకుండానే శత్రువులను తుదముట్టించేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. ఏడాదిన్నర వ్యవధిలోనే తన సైనికులకు అదృశ్య కవచాలను సమకూర్చేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు చేసుకుంటోంది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించే ఈ అదృశ్య కవచాలు, ఊసరవెల్లి మాదిరిగా పరిసరాలకు తగినట్లుగా రంగులు మార్చేసుకుంటాయి. వాటి ప్రభావంతో వాటిని ధరించిన సైనికులు ఇతరులకు కనిపించరు. ఎడారులు, అడవులు, పర్వత ప్రాంతాలలోనే కాదు, పట్టణ ప్రాంతాల్లో సైతం ఈ అదృశ్య కవచాలు సునాయాసంగా రంగులు మార్చేసుకోగలవు. వీటి బరువు కూడా ఒకటిన్నర కిలోల లోపే ఉంటుంది కాబట్టి సైనికులకు కూడా పెద్దగా భారం కాదు. అదృశ్య కవచాలకు విద్యుత్తు సరఫరా చేసే పరికరాలు దానిలోనే ఉంటాయి. ఆ పరికరాల బరువు అరకిలో లోపే ఉంటుంది. కెనడాకు చెందిన హైపర్స్టీల్త్ బయోటెక్నాలజీ సంస్థ ఇప్పటికే ఈ అదృశ్య కవచాల నమూనాలను అమెరికన్ మిలటరీ సైంటిస్టులకు ప్రదర్శించింది. వారు అందులో మరిన్ని మార్పులను కోరుకున్నారు. వారు కోరుకున్న మార్పులతో తుది నమూనా రూపొందించడానికి దాదాపు ఏడాదిన్నర పడుతుందని కెనడా సంస్థ చెబుతోంది.