'నిర్భయ'తో 'అభయ'మేది?
దేశ రాజధానిలో 2012 డిసెంబర్లో చోటు చేసుకున్న నిర్భయ ఉదంతంతో యావత్ భారతావనీ గళం విప్పింది. ఢిల్లీ వీధులు దద్దరిల్లే స్థాయిలో జరిగిన ఉద్యమంతో కంగుతిన్న కేంద్ర ప్రభుత్వం ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండేందుకు వర్మ కమిటీని ఏర్పాటు చేసింది. ఆపై దీన్ని పట్టించుకోని కేంద్రం ఆ కమిటీ సిఫార్సుల్ని పొందుపరచకుండా ‘ఉరి’తో కూడిన ఆర్డినెన్స్‌ను అమలులోకి తెచ్చింది. దీనిపై విమర్శలు వెల్లువెత్తడంతో పార్లమెంట్లో చర్చించి నిర్భయ చట్టం తీసుకువచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్ 2 నుంచి అమలులోకి వచ్చిన ఈ యాక్ట్‌లో ప్రత్యేకించి ఏర్పాటు చేసినవంటూ పెద్దగా లేవు.
అప్పటికే ఐపీసీలో ఉన్న యాసిడ్ దాడులు, ఆత్మగౌరవానికి, స్త్రీ తత్వానికి భంగం కలిగించడం, అత్యాచారం, లైంగిక వేధింపులు వంటి మహిళా సంబంధిత నేరాలను క్రోడీకరించి ఒకే గొడుకు కిందికి తెస్తూ విస్తృత పరిచింది. ఒక్కో సెక్షన్ కు ఎ,బి,సి,డి, ఇ... ఇలా క్లాజ్లు చేరుస్తూ విపులీకరించారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు అడ్డుకట్ట వేయడానికి, నిందితుల్ని కఠినంగా శిక్షించడానికి ఇది ఉపకరిస్తుందని కేంద్రం ప్రకటించింది.
అధికారులకూ తెలియని అంశాలెన్నో..
నిర్భయ చట్టంలో ఉన్న కీలకాంశాలపై సాక్షాత్తు పోలీసు అధికారులకే అంతగా అవగాహన ఉండట్లేదు. ఫలితంగా దీని పరిధిలోకి వచ్చే కేసుల్ని సైతం మూస ధోరణిలోనే పాత సెక్షన్ల కిందే నమోదు చేస్తున్నారు. ‘నిర్భయ’లో ఉన్న మూడు అత్యంత సున్నితాంశాల కారణంగా దీని కింద నమోదయ్యే కేసుల్లో శిక్షలు పడే అవకాశం అధికంగా ఉంటుంది. ఈ చట్టం కింద నమోదయ్యే కేసుల్లో వైద్యుల నివేదిక సైతం న్యాయస్థానం లో ఆధారంగా మారుతుంది. ఈ కేసుల దర్యాప్తును రెండు నెలల్లోగా పూర్తి చేసి అభియోగపత్రం దాఖలు చేయాల్సి ఉంటుంది. న్యాయస్థానం సైతం దీని విచారణను ఆరు నెలల్లో పూర్తి చేసి తీర్పు ఇవ్వాలి. సాధారణ కేసుల్లో నిందితులకు ‘బెనిఫిట్ ఆఫ్ డౌట్’ అనే అంశం కలిసి వచ్చి నిర్దోషులుగా బయటపడుతుంటారు. అయితే నిర్భయ చట్టం కింద నమోదైన కేసులకు మాత్రం ఇది వర్తించదు. బాధితురాలు చెప్తోంది కాబట్టి కచ్చితంగా నేరం చేసి ఉంటాడనే అంశం పరిగణలోకి వస్తుంది. సాంకేతికంగా దీన్ని ప్రిజెమ్షన్ అంటారు. వీటివల్ల ఈ కేసుల్లో శిక్షల శాతం పెరిగి మరొకరు నేరం చేయడానికి భయపడే పరిస్థితి ఉత్పన్నమవుతుంది. ఇన్ని అవకాశాలు ఉన్నా... అవగాహన లేమి కా రణంగా అనేక కేసులు ‘నిర్భయ’ కింద నమోదు కావట్లేదు.
ఇవన్నీ పట్టేదెవరికి?
కేంద్ర ప్రభుత్వం అత్యంత శక్తివంతమైందని చెప్పుకున్న నిర్భయ చట్టం అమలులోకి వచ్చినప్పటికీ రోజు రోజుకూ మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. దీనికి ప్రధాన కారణం ‘నిర్భయ’పై అవగాహన కల్పించడంలో సర్కారు విఫలం కావడమైతే... మరో కారణం మిగిలిన అంశాలను పట్టించుకోకపోవడం. కేవలం ఓ చట్టాన్ని తీసుకురావడం ద్వారా కుటుంబ, సామాజిక తదితర పరిస్థితుల్లో పూర్తి మార్పు తీసుకురావడమనేది దుర్లభం. ఇవి మారాలంటే సమస్యని లోతుల నుంచి అధ్యయనం చేసి దానికి, పునరావృతం కావడానికి కారణాలను గుర్తించాలి. వాటిని సాధ్యమైనంత వరకు వేళ్లతో సహా పెకిలించి వేయడానికి ప్రయత్నం చేయాలి. మహిళలు, యువతులపై అఘాయిత్యాలకు ప్రధానంగా ఎనిమిది కారణాలు ఉంటున్నాయని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. చట్టం తీసుకువచ్చి చేతులు దులుపుకున్న యంత్రాంగాలు ఈ కీలకాంశాలను పట్టించుకుని మార్పు కోసం ప్రయత్నం చేయకపోవడం కూడా నిర్భయ తర్వాత కూడా అనేక మంది బలికావడానికి కారణంగా మారుతున్నాయి.
ప్రతి ఒక్కరికీ బాధ్యత ఉండాలి..
కేవలం అఘాయిత్యాలు మాత్రమే కాదు స్నేహం, ప్రేమ పేరిట ఆడపిల్లల్ని లోబరుచుకుని, మోసం చేసి, బ్లాక్‌మెయిల్‌కు దిగి వారి జీవితాలతో ఆటలాడటం నిత్యకృత్యంగా మారిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో మార్పు రావాలి అంటే ప్రతి స్థాయిలోనూ అది చోటు చేసుకోవాలి. ప్రాథమికంగా ప్రతి ఒక్కరి ఇంటి నుంచే ప్రారంభం కావాలి. ఏదైనా ఉదంతం జరిగినప్పుడు మాత్రం అంతా రోడ్లపైకి వచ్చి తమ వాణి వినిపిస్తున్నారు. ఆ తర్వాత ఆ విషయాన్ని, అవసరమైన మార్పు చేర్పుల్ని మర్చిపోతున్నారు. ఫలితంగానే అఘాయిత్యాల పరంపర కొనసాగుతోంది. అయితే ఎవరికి వారు తమ ఇళ్లల్లో పిల్లలపై శ్రద్ధ పెట్టి పెంచాలి. ఆడపిల్లల్ని గౌరవించడం, మహిళలతో మర్యాదగా ప్రవర్తించడం, సమాజంలో వారికి ఉండాల్సిన సముచిత స్థానం తెలియజేస్తూ సభ్యత, సంస్కారాలు నేర్పించాలి. మహిళలపై అఘాయిత్యాలు జరిగిన తర్వాత బాధపడేకంటే... జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
శిక్షలు ఇలా
ఉద్దేశపూర్వకంగా యాసిడ్ దాడి చేసి గాయపరిస్తే ఐపీసీ సెక్షన్ 326-ఎ ప్రకారం పదేళ్లు లేదా జీవిత ఖైదు, జరిమానా
ఉద్దేశపూర్వకంగా యాసిడ్ దాడికి ప్రయత్నిస్తే ఐపీసీ సెక్షన్ 326-బి ప్రకారం ఐదు నుంచి ఏడేళ్ల జైలు, జరిమానా
స్త్రీ తత్వానికి భంగం కలిగించేలా, అవమానించేలా, దౌర్జన్యం/ బలప్రయోగం చేస్తే ఐపీసీ సెక్షన్ 354 ప్రకారం ఏడాది నుంచి ఐదేళ్ల వరకు శిక్ష, జరిమానా
లైంగిక వేధింపులు (ఫోన్ ద్వారా అయినా), అశ్లీల చిత్రాలు చూపించడం చేస్తే ఐపీసీ సెక్షన్ 354-ఎ ప్రకారం మూడేళ్ల జైలు, జరిమానా
దౌర్జన్యం/బలప్రయోగం ద్వారా వివస్త్రను చేస్తే ఐపీసీ సెక్షన్ 354-బి ప్రకారం మూడు నుంచి ఏడేళ్ల జైలు, జరిమానా
స్త్రీల రహస్యాంగాలను చాటుగా చూసినా, ఫొటోలు తీసినా ఐపీసీ సెక్షన్ 354-సి ప్రకారం ఏడాది నుంచి ఏడేళ్ల జైలు
దురుద్దేశంతో స్త్రీని భౌతికంగా కానీ, ఎలక్ట్రానిక్ సాధనాల ద్వారా కానీ పదేపదే వెంబడిస్తే ఐపీసీ సెక్షన్ 354-డి ప్రకారం ఐదేళ్ల జైలు, జరిమానా
మహిళల్ని అక్రమ రవాణా చేసి వ్యభిచారం చేయిస్తే ఐపీసీ సెక్షన్ 370 ప్రకారం ఏడు నుంచి పదేళ్ల జైలు, జరిమానా
ఒకరి కంటే ఎక్కువ మందిని/మైనర్‌ను అక్రమ రవాణా చేసి వ్య భిచారం చేయిస్తే గరిష్టంగా 14 ఏళ్లు లేదా జీవితఖైదు విధిస్తారు
{పభుత్వ ఉద్యోగి లేదా పోలీసు అధికారి అక్రమ రవాణాకు పాల్పడితే మరణించే వరకు జీవిత ఖైదు
అక్రమ రవాణాకు గురైన వారిని వ్యభిచారంలోకి దింపితే ఐపీసీ సెక్షన్ 370-ఎ ప్రకారం ఐదు నుంచి ఏడేళ్ల జైలు శిక్ష, జరిమానా
అత్యాచారానికి పాల్పడితే ఐపీసీ సెక్షన్ 376 ప్రకారం ఏడేళ్లకు తగ్గకుండా జైలు శిక్ష లేదా చనిపోయే వరకు జీవిత ఖైదు
అత్యాచారం కారణంగా లేదా గాయపరిచిన కారణంగా సదరు మహిళ చనిపోతే ఐపీసీ 376-ఎ ప్రకారం 20 ఏళ్ల జైలు లేదా మరణించే వరకు జీవిత ఖైదు
న్యాయబద్ధంగా విడిపోయి వేరుగా నివసిస్తున్న భార్యను బలాత్కరిస్తే ఐపీసీ సెక్షన్ 376-బి ప్రకారం రెండు నుంచి ఏడేళ్ల జైలు, జరిమానా
అధికారాన్ని వినియోగించి మహిళలను లొంగదీసుకుంటే ఐసీపీ సెక్షన్ 376-సి ప్రకారం ఐదు నుంచి పదేళ్ల జైలు, జరిమానా
మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడితే ఐపీసీ సెక్షన్ 376-డి ప్రకారం 20 ఏళ్ల జైలు లేదా చనిపోయే వరకు జీవితఖైదు
ఒకటి కంటే ఎక్కువ సార్లు అత్యాచారం చేస్తే ఐపీసీ సెక్షన్ 376-ఇ ప్రకారం మరణించే వరకు జీవితఖైదు
మహిళల్ని అల్లరిపెట్టి అవమానపరిస్తే ఐపీసీ సెక్షన్ 509 ప్రకారం మూడేళ్ల జైలు, జరిమానా
అఘాయిత్యాలకు ప్రధాన కారణాలివి..
1. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం కావడం
2. విదేశీ సంస్కృతి మోజులో యువత దారి తప్పడం
3. తల్లిదండ్రులకు, పిల్లలకు మధ్య సరైన సత్సంబంధాలు లేకపోవడం
4. మత్తుమందులు, వ్యసనాలకు బానిసైన యువకులు
5. సినిమా, మాస్ మీడియాల్లో మితిమీరుతున్న అశ్లీల ప్రభావం
6. మహిళల్ని వ్యాపార వస్తువుగా చిత్రీకరిస్తున్న ప్రకటనలు
7. చదువుకునే వయస్సులో తల్లిదండ్రుల నిర్లక్ష్యం కారణంగా ఆకర్షణ, ప్రలోభాలకు లోను కావడం
8. విపత్కర పరిస్థితుల్లో యువతులు, మహిళలు ఆత్మవిశ్వాసం కోల్పోవటం