IPS Batch
-
పటేల్ తరహాలో మోదీ సక్సెస్ అయ్యారు
సాక్షి, హైదరాబాద్ : సర్దార్ వల్లభాయ్ పటేల్ తరహాలో భారత ప్రధాని నరేంద్ర మోదీ జమ్మూకశ్మీర్‌కు సంబంధించిన ఆర్టికల్ 370ని రద్దు చేసి సక్సెస్ అయ్యారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. దేశంలో సివిల్స్‌ని ప్రవేశ పెట్టింది సర్దారేనని తెలిపారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరుతో ఉన్న నేషనల్ పోలీస్ అకాడమీకి రావడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా సర్దార్ పటేల్ కృషిని స్మరించుకుంటూ అమిత్ షా నివాళులు అర్పించారు. శనివారం సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ(ఎన్పీఏ)లో అమిత్ షా మాట్లాడుతూ.. ‘‘70వ ఐపీఎస్ బ్యాచ్‌లో 12 మంది మహిళలు ప్రొబేషనరీలుగా శిక్షణ పూర్తి చేసుకోవడం దేశానికి గర్వకారణం. ఐపీఎస్ శిక్షణ పూర్తి కాగానే మీ లక్ష్యం పూర్తి అయినట్టు కాదు. లక్ష్య సాధన ఇప్పుడే ప్రారంభం అయ్యింది. దేశం కోసం చెయ్యాల్సింది ఇంకా ఉంది. ప్రతిరోజు మీరు ప్రతిజ్ఞను గుర్తు చేసుకుంటూ ఐపీఎస్ ఆఫీసర్‌గా విధులు నిర్వహించండి. దేశంలో ఎక్కడ విధుల్లో ఉన్నా ప్రతి ఒక్కరి సమన్వయంతోనే సక్సెస్ కాగలం. మోదీ స్మార్ట్ పోలీస్ మంత్రాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్లాలి. పోలీస్ సేవలు ఎక్కడ ఉంటే అక్కడ సర్దార్ పటేల్ ఉంటారు. ఐపీఎస్‌లు, ఉన్నతాధికారులు పేదరికాన్ని పూర్తిగా రూపుమాపేందుకు కృషి చేయాలి. దేశాన్ని సాధించేందుకు, దేశాన్ని రక్షించేందుకు వేల సంఖ్యలో పోలీసులు ప్రాణాలను అర్పించారు. ఉగ్రవాదం, సైబర్ క్రైమ్, ఆర్థిక నేరాలు లాంటి సవాళ్లు మన ముందు ఉన్నాయి. నిర్భయంగా ప్రతి ఒక్క ఆఫీసర్ దేశానికి సేవ చేయాలి. రాజకీయ నాయకులుగా కేవలం 5 సంవత్సరాల వరకు మాత్రమే దేశానికి సేవ చేయగలం. ఐపీఎస్‌లు 60 ఏళ్ల వరకు దేశానికి సేవ చేసే మంచి అవకాశం ఉంది. ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. హైదరాబాద్‌ను భారత్‌లో కలపడానికి నిజాం ఒప్పుకోలేదు. సర్దార్ వల్లభాయ్ పటేల్ దాన్ని పరిపూర్ణం చేశార’’ ని తెలిపారు. -
నాడు సామాన్యులు.. నేడు అసామాన్యులు
సాక్షి, హైదరాబాద్ : ‘రెండేళ్ల శిక్షణ పూర్తి చేసుకున్న 2017 ఐపీఎస్ బ్యాచ్‌కు ఎంపికైన వారంతా సామాన్యులే. వారి పట్టుదలే వారిని ఈ రోజు అసామాన్యులుగా సమాజానికి పరిచయం చేస్తోంది’ అని నేషనల్ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభయ్ అన్నారు. 24వ తేదీన ఐపీఎస్ 2017 బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించనున్న నేపథ్యంలో గురువారం బ్యాచ్ క్యాడెట్లను మీడియాకు పరిచయం చేశారు. ఈ బ్యాచ్‌లో ఎంపికైన వారంతా సామాన్య కుటుంబాలవారేనని, మారుమూల పల్లెటూరు నేపథ్యం నుంచి వచ్చిన వారేనని వెల్లడించారు. వీరంతా ఇప్పుడు సమాజసేవకు సిద్ధంగా ఉన్నారని వివరించారు. మొత్తం 92 మందిలో 80 మంది పురుషులు, 12 మంది మహిళలు. అందులో ఆరుగురు రాయల్ భూటాన్ పోలీసు, ఐదుగురు నేపాల్ పోలీస్ విభాగానికి చెందిన విదేశీయులున్నారు. ట్రైనీలంతా చాలా కష్టపడి శిక్షణ పూర్తి చేశారని వివరించారు. వీరందరికీ కఠోర శిక్షణ ఇచ్చామని, 40 కి.మీ.ల దూరం మేర 10 కేజీల భారాన్ని మోస్తూ ఎండలో ఆగకుండా పరుగులు పెట్టించామన్నారు. దేశంలోని అత్యున్నత దర్యాప్తు, నిఘా సంస్థలతోనూ వీరికి దశలవారీగా శిక్షణ ఇచ్చామని వివరించారు. ఢిల్లీకి చెందిన గౌస్ ఆలం, యూపీకి చెందిన రిచా తోమర్, బెంగాల్‌కు చెందిన పలాష్ చంద్ర, నేపాల్‌కు చెందిన క్రిష్ణ కడ్కా, అను లామాలు ఈ బ్యాచ్‌లో వరుసగా తొలి ఐదు స్థానాల్లో నిలిచారని తెలిపారు. తెలంగాణకు ముగ్గురు, ఏపీకి ముగ్గురు ఐపీఎస్ అధికారులను కేటాయించారు. 24వ తేదీన దీక్షంత్ పరేడ్ పేరిట జరిగే ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. తెలుగు రాష్ట్రాలకు ఆరుగురు.. తెలంగాణకు చెందిన గరికపాటి బిందు మాధవ్, వాసన విద్యాసాగర్ నాయుడు, ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన తుహిన్ సిన్హా ఏపీ కేడర్‌కు ఎంపికయ్యారు. ఢిల్లీకి చెందిన గౌస్ ఆలం, కర్ణాటకకు చెందిన డాక్టర్ వినీత్, డాక్టర్ శబరీశ్‌లను తెలంగాణ కేడర్‌కు కేటాయించారు. తెలంగాణకు చెందిన బీబీజీటీఎస్ మూర్తిని యూపీకి కేటాయించారు. ఏపీకి చెందిన కేవీ అశోక్‌ను యూపీ, బోగాటి జగదీశ్వర్‌రెడ్డిని త్రిపుర, మల్లాది కార్తీక్‌ని మణిపూర్ కేడర్‌కు కేటాయించారు. ఇంజనీర్లు, డాక్టర్లదే పైచేయి.. ఈసారి బ్యాచ్‌లో విద్యార్హతల పరంగా ఇంజనీర్లు, డాక్టర్లదే పైచేయిగా నిలిచింది. మొత్తం 92 మంది ఐపీఎస్ అధికారుల విద్యా నేపథ్యాన్ని ఒకసారి పరిశీలిస్తే.. ఆర్ట్స్–7, సైన్స్–5, కామర్స్–02, ఇంజనీరింగ్–57, మెడిసిన్–11, ఎంబీఏ–7, ఇతరులు–3 మంది ఉన్నారు. -
వీవీ శ్రీనివాసరావుకు ఐజీగా పదోన్నతి
సాక్షి, హైదరాబాద్: 1995 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన డీఐజీ వీవీ శ్రీనివాసరావు(వీవీఎస్ఆర్)కు ఐజీగా పదోన్నతి లభించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు వీవీఎస్ఆర్కు ఐజీగా పదోన్నతి కల్పించినట్టు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.