పీఎస్ఎల్వీ సీ33 కౌంట్ డౌన్ ప్రారంభం
శ్రీహరికోట(సూళ్లూరుపేట): శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని భారత అంతరిక్ష ప్రయోగకేంద్రమైన సతీష్ ధవన్ స్పేస్ సెంటర్(షార్) నుంచి పీఎస్ఎల్వీ సీ33 ఉపగ్రహం ప్రయోగానికి కౌంట్ డౌన్ మంగళవారం ఉదయం 9.20గంటలకు ప్రారంభమైంది. గురువారం మధ్యాహ్నం 12.50 నిమిషాలకు ప్రయోగం జరగనుంది. ఈ రాకెట్ ద్వారా ఇండిపెండెంట్ రీజినల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ సిరీస్లో ఆఖరి ఉపగ్రహమైన ఐఆర్ఎన్ఎస్ఎస్ 1జీ ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నారు. ప్రయోగం సఫలమైతే రెండు నెలల్లోనే భారత్కు పూర్తి స్వదేశీ నావిగేషన్ సిస్టమ్ అందుబాటులోకి వస్తుంది.
జూన్లో పీఎస్ఎల్వీ సీ34 ప్రయోగం..
పీఎస్ఎల్వీ సీ34 ప్రయోగాన్ని వాస్తవంగా మే నెలాఖరులో చేపట్టేందుకు ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది. కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ ప్రయోగం జూన్ మొదటి వారానికి వాయిదావేయాలని ఎఆర్ఆర్ సమావేశంలో నిర్ణయించారు. ఈ ప్రయోగంలో సరికొత్తగా 22 ఉపగ్రహాలను రోదసీలోకి పంపేం దుకు ఏర్పాట్లు చేస్తున్నారు.