చెత్త బిజినెస్ రూ.7 కోట్లు
సాక్షి, హన్మకొండ : వార్తా పత్రికల ప్రాధాన్యం తెలియని వారుండరు. ప్రపంచవ్యాప్త సమాచారాన్ని అవి అందిస్తాయి. ఇక స్కూలు పుస్తకాల నుంచి వార, మాస పత్రికలు, మ్యాగజైన్లు అందించే విజ్ఞానం, వినోదం ఎంతో ఉంది. ఇవన్నీ ఎంత విజ్ఞానాన్ని అందించినా సంవత్సరాల తరబడి వీటిని ఇంట్లో పెట్టుకోలేం. ఎప్పుడో ఒకప్పుడు వీటిని బయటకు పంపాల్సిందే. అలాగే పలు రకాల గృహోపకరణాలతో వచ్చే ప్యాకింగ్ అట్టలు, పేపర్లు తదితరాలను ఎప్పుడెప్పుడు వదిలించుకుందామా అని వ్యాపారులు ఆలోచిస్తుంటారు.
కానీ ఇలా వదిలించిన సరుకుతో జిల్లా వ్యాప్తంగా ప్రతీరోజు రూ.20లక్షల వ్యాపారం జరుగుతోంది. ఇందులో సగం వాటా వరంగల్దే. ప్రస్తుతం పాతపేపర్లకు మార్కెట్లో కేజీ రూ.10 నుంచి రూ.11 వరకు ధర పలుకుతోంది. అట్టలకు కేజీ రూ. 9 పలుకుతోంది. ప్రతీ ఇంటినుంచి సేకరించే ఈ చెత్త టన్నుల కొద్దీ పోగవుతోంది. ప్రతీరోజు సగటున 18 టన్నుల బరువు గల పాత పేపర్లు, అట్టలు వరంగల్ నగరం నుంచి రాష్ట్రంలో ఉన్న వివిధ రీసైక్లింగ్ యూనిట్లకు తరలివెళ్తున్నాయి.
తుక్కు రేగుతోంది
గత దశాబ్దకాలంలో పాత పేపర్లు, బీరు బాటిళ్లకు గిరాకీ పెరిగింది. కానీ ఎప్పటి నుంచో పాత ఇనుప సామాన్లకు ఉన్న డిమాండే వేరు. ఇంటి నిర్మాణం నుంచి పైపుల వరకు వాడే ఇనుప పరికరాలు కాలక్రమంలో చేరేది పాత ఇనుప సామాన్ల దుకాణాలకే. తుప్పు పట్టిన ఇనుము ధర కిలోకు రూ.22 వరకు పలుకుతోంది. జిల్లావ్యాప్తంగా 22 టన్నుల పాత ఇనుప సామాన్లు పోగవుతున్నాయి. రోజుకో లారీ తుక్కు ఇనుము వరంగల్ నుంచి ఎగుమతవుతోంది.
ఇలా సేకరించి.. అలా పంపించి..
రీసైక్లింగ్‌కు అవకాశం ఉన్న పేపర్లు, బాటిళ్లు, ఇనుప సామాన్లు, ప్లాస్టిక్ వస్తువులను పలు రకాలుగా సేకరిస్తారు. చెత్త కుప్పల్లో పడేసే వ్యర్థాల నుంచి వ్యాపారానికి పనికి వచ్చే బీరు బాటిళ్లు, ప్లాస్టిక్ బాటిళ్లను కాలినడకన కొందరు, సైకిళ్లు, మోటారు సైకిళ్లతో పాటు నాలుగుచక్రాల బండితో ఇంటింటికీ తిరుగుతూ మరికొందరు సేకరిస్తారు. ఇంకొందరు ఆటోలో ప్రతీ వీధీ తిరుగుతూ పాత పేపర్ల నుంచి పాత ఇనుప సామాన్ల వరకు సేకరిస్తుంటారు. రోజంతా సేకరించిన వీటిని హన్మకొండ హంటర్‌రోడ్డు, రాంనగర్, బడేమసీద్ లతో పాటు వరంగల్‌లోని కరీమాబాద్ ఏరియాలో ఉన్న దుకాణాల్లో విక్రయిస్తారు.
రూ.కోట్లలో వ్యాపారం
చెత్త బిజినెస్‌లో ఉన్న వారి అంచనాలకు బట్టి ప్రతీ రోజు పాత పేపర్లు, అట్టలు సేకరణ, అమ్మకాలకు సంబంధించి రోజుకు రూ.20 లక్షల వరకు క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. ఆ తర్వాతి స్థానంలో ఇనుప సామన్లు ఉన్నాయి. నిత్యం మూడు లక్షల రూపాయల విలువ చేసే పాత ఇనుము దుకాణాలకు చేరుతోంది. మూడో స్థానంలో ఖాళీ మద్యం సీసాలున్నాయి. వీటి సేకరణ.. విక్రయం వల్ల రోజుకు లక్ష రూపాయలు చేతులు మారుతున్నాయి. ప్లాస్టిక్ బాటిళ్లు, బకెట్లకు కూడా గిరాకీ బాగానే ఉంటోంది.
ఐదు వందల మందికి ఉపాధి
పాతపేపర్లు, ఇతర వ్యర్థాలను సేకరించడం ద్వారా నగరంలో ప్రత్యక్షంగా సుమారు ఐదువందల మంది ఉపాధి పొందుతున్నారు. వీరిలో నాలుగువందలమంది చెత్తను సేకరిస్తుంటే మ రో వందమంది కార్మికులు ఆ చెత్తను కేటగిరీల వారీగా విభజిం చే పనిలో ఉన్నారు. వీరే కాక చెత్తను లోడింగ్, అన్లోడింగ్, ర వాణా పనిలో సుమారు మరో వందమంది వరకు ఉపాధి పొందుతున్నారు.
ఇక్కడా తగ్గని కిక్కు
ఖాళీ మద్యం బాటిళ్ల వ్యాపారం కూడా కిక్కెక్కేలా సాగుతోంది. ప్రస్తుతం మార్కెట్లో ఖాళీ బీరు బాటిల్ రూ.1.60 వరకు హోల్‌సేల్ ధర పలుకోతోంది. విస్కీ, బ్రాందీ, జిన్, వోడ్కాలకు సంబంధించి అవి లభించే క్వార్టర్, ఆఫ్, ఫుల్ బాటిల్ పరిమాణాలను బట్టి ఒక్కో బాటిల్‌కు 25 పైసల నుంచి రెండు రూపాయల వరకు చెల్లిస్తున్నారు. ప్రతిరోజూ ఇంటింటికీ తిరిగి సేకరించే బీరుబాటిళ్లు సగటున రోజుకు 50వేల వరకు ఉంటున్నాయి. ఈ మద్యం సీసాలను స్థానికంగా ఉన్న మద్యం షాపులు, బార్లు, చెత్తకుప్పలతో పాటు ఇంటింటికి తిరిగి సేకరిస్తారు. సేకరించిన బీరు బాటిళ్లను కొనే కేంద్రాలు నగరంలో యాభై వరకు ఉన్నాయి. ఆయా షాపుల నుంచి వరంగల్‌కు చేరుస్తారు. అక్కడ వాటిని బాటిల్ కంపెనీల ప్రకారం వేరుచేసి బస్తాల్లో నింపి హైదరాబాద్‌కు పంపుతారు. ఒక బస్తాలో 200 బాటిళ్లను నింపుతారు. ఇటువంటి బస్తాలు రోజుకు 250 వరకు నిండుతాయి.