పీఎంకేఎస్‌వై ప్రాజెక్టులపై నేడు సమావేశం
పాల్గొననున్న రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు
సాక్షి, హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టుల రంగంలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు, నిధుల వెచ్చింపు, సత్వర అనుమతుల వంటి అంశాలపై ఆదివారం కేంద్ర జలవ నరుల సమన్వయ కమిటీ రెండో భేటీ ఢిల్లీలో జరగనుంది. ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన (పీఎంకేఎస్‌వై) కింద దేశవ్యాప్తంగా ఎంపిక చే సిన 46 ప్రాజె క్టులను సత్వరం పూర్తి చేయడం, మరిన్ని ప్రాజెక్టులను దీనికిందకు తెచ్చే అంశంపై ఈ కమిటీ చర్చిస్తుంది.
ఈ సమావేశంలో సమన్వయ కమిటీ సభ్యుని హోదాలో రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు పాల్గొననున్నారు. ఒక్కొక్క ప్రాజెక్టుకు అనుమతుల కోసం కేంద్రం చుట్టూ తిరగాల్సి రావడం, అనుమతుల కోసం సీడబ్ల్యూసీకి నివేదిక పంపితే రెండేళ్ల కాలం పడుతున్న దృష్ట్యా, దీనికి పరిష్కారంపై సంస్కరణలు తెచ్చే దిశగా ఈ సమావేశంలో నిర్ణయాలు చేయనున్నారు. ఏఐబీపీ కింద చేర్చిన దేవాదుల, ఇందిరమ్మ వరద కాలువలతోపాటు కొత్తగా సీతారామ ప్రాజెక్టు, లోయర్ పెన్‌గంగ, నిజాంసాగర్ ఆధునికీకరణ, మోదికుంటవాగులను కేంద్ర పథకం కింద చేర్చాలని రాష్ట్రం కోరే అవకాశం ఉంది.