రాష్ట్ర ప్రభుత్వం నాలుగున్నరేళ్లలో సాగునీటి పనులకు రూ.58,064 కోట్లు ఖర్చు చేసినా ఒక్క ప్రాజెక్టూ పూర్తి కాకపోవడం, అదనంగా ఆయకట్టుకు నీళ్లందించలేకపోవడం వెనుక గుట్టును రట్టు చేసేందుకు కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టులవారీగా ఎంత ఖర్చు చేశారు? ఇప్పటివరకూ చేసిన పనులు ఎన్ని? మిగిలిపోయినవి ఎన్ని? అదనంగా ఆయకట్టుకు నీళ్లందించారా? తదితర అంశాలపై వివరాలు ఇవ్వాలని కోరుతూ ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. సాగునీటి పనులపై సర్కారు సమర్పించే వివరాలు, క్షేత్రస్థాయిలో పరిస్థితులను అధ్యయనం చేసి అసెంబ్లీ శీతాకాల సమావేశాల నాటికి పూర్తి స్థాయి నివేదికను సభకు సమర్పించాలని కాగ్ నిర్ణయించింది. మరోవైపు 2016–17, 2017–18 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి సాగునీటి పనులపై శాసనసభకు కాగ్ సమర్పించిన నివేదికల్లో ప్రస్తావించిన అంశాలపై తీసుకున్న చర్యల వివరాలను వెల్లడించాలని లేఖలో కోరారు.