బెంగళూరు నుంచి ఐఎస్ఐఎస్ ప్రచారం!
ఉగ్రవాదుల ట్వీటర్ ఖాతాను నిర్వహిస్తున్న నగర వాసి!
బ్రిటిష్ చానల్ వెల్లడి
సాక్షి, బెంగళూరు: ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా(ఐఎస్ఐఎస్) ఉగ్రవాదులు వాడుతున్న సామాజిక మాధ్యమం ట్వీటర్లో దాని ఖాతాను బెంగళూరుకు చెందిన వ్యక్తే నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు వెలుగుచూశాయి. బ్రిటన్‌కు చెందిన చానల్ ‘4 న్యూస్’ ఈ విషయాన్ని బయటపెట్టింది. దీంతో బెంగళూరు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఖాతాను అనుమానితుడు బెంగళూరు నుంచి నిర్వహిస్తుండకపోవచ్చని భారత నిఘావర్గాలు పేర్కొన్నాయి. జిహాదీలకు అనుకూలంగా ‘షామీ విట్నెస్’ పేరుతో మెహ్దీ అనే వ్యక్తి ఈ ఖాతాను నిర్వహిస్తున్నట్లు బ్రిటిష్ చానల్ వెల్లడించింది. అయితే అతని జీవితం ప్రమాదంలో పడే అవకాశమున్నందున పూర్తి పేరును వెల్లడించడం లేదని పేర్కొంది.
బెంగళూరులోని ఓ కంపెనీలో అతను పనిచేస్తున్నట్లు తెలిపింది. షామీ విట్నెస్ పేరుతో ఐఎస్‌కు అనుకూలంగా అతను తన మొబైల్ ద్వారా ఇచ్చే ట్వీట్లను ప్రతి నెలా 20 లక్షల మంది చూస్తున్నారు. దీనికి 17,700 మంది ఫాలోయర్లు కూడా ఉన్నారు. వీరిలో మూడు వంతుల మంది విదేశీయులే. దీంతో ఐఎస్ ఖాతాల్లోకెల్లా ఇదే అత్యంత ప్రచారం జరుగుతున్న ఖాతాగా గుర్తింపు పొందింది. ఐఎస్‌లో చేరే వారి కోసం సమాచారం అందించడం, బందీల తలల నరికివేత వీడియోలు వంటివి ఈ ఖాతాలో ఉన్నాయి. ఈ విషయం బయటకు పొక్కిన వెంటనే ఆ ఖాతా స్తంభించిపోయింది. కుటుంబం ఆర్థికంగా తనపైనే ఆధారపడటంతో ఖాతాదారుడు ఇంకా ఉగ్రవాద సంస్థలో చేరలేదని చానల్ తెలిపింది.