ISIS links
-
ఐసిస్‌తో లింకులు.. గువాహటి ఐఐటీ విద్యార్థి అరెస్ట్
గువాహటి: అంతర్జాతీయ ఉగ్ర సంస్థ ఐసిస్‌తో సంబంధాలున్నాయనే ఆరోపణలపై గువాహటి–ఐఐటీకి చెందిన తౌసిఫ్ అలీ ఫరూకీ అనే విద్యారి్థని అస్సాం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బీటెక్ బయోసైన్స్ నాలుగో సంవత్సరం చదువుకుంటున్న ఇతడిపై చట్ట వ్యతిరేక కార్యకలాపాల (నివారణ)చట్టం ఉపా కింద కేసు నమోదు చేశారు. విచారణ జరిపిన అనంతరం ఐసిస్‌తో సంబంధాలున్నట్లు పక్కా ఆధారాలు దొరకడంతో శనివారం అరెస్ట్ చేసినట్లు అస్సాం పోలీస్ టాస్‌్కఫోర్స్ ఐజీ పార్థసారధి మహంతా చెప్పారు. కోర్టు అతడిని 10 రోజుల పోలీసు కస్టడీకి అనుమతి ఇచ్చిందన్నారు. ఢిల్లీలోని బాట్లా ప్రాంతానికి చెందిన అతడు ఐసిస్‌లో చేరేందుకు వెళ్తుండగా కామ్రూప్ జిల్లా హజో వద్ద అదుపులోకి తీసుకున్నామన్నారు. మూడు రోజుల క్రితం బంగ్లాదేశ్ నుంచి వచి్చన ఐసిస్ భారత్ చీఫ్ హారిస్ ఫరూకీ, అతడి అనుచరుడు అనురాగ్ సింగ్ అలియాస్ రేహాన్‌లను ధుబ్రి జిల్లాలో అదుపులోకి తీసుకున్నట్లు టాస్క్‌ఫోర్స్ ఐజీ వివరించారు. అయితే, గువాహటి ఐఐటీకి చెందిన ఇద్దరు విద్యార్థులకు ఐసిస్‌తో సంబంధాలున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు తనకు సమాచారం ఇచి్చనట్లు హోం శాఖ బాధ్యతలు కూడా చూసుకుంటున్న సీఎం హిమాంత బిశ్వ శర్మ చెప్పారు. ఇద్దరిలో ఒక్కరు మాత్రమే దొరికారని, తప్పించుకుపోయిన మరో విద్యార్థిని కూడా త్వరలోనే పట్టుకుంటామన్నారు. ఉగ్రవాదం వైపు ప్రేరేపితులైన వీరి గురించి తల్లిదండ్రులకు సమాచారం అందించినట్లు సీఎం చెప్పారు. -
ఉగ్రవాద ఆరోపణలపై డాక్టర్ రెహమాన్ అరెస్ట్
సాక్షి, న్యూఢిల్లీ : ఉగ్రవాద సంస్థతో సంబంధముందన్న ఆరోపణలతో బెంగళూరుకు చెందిన ఒక కంటి డాక్టర్ని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు ఆరెస్ట్ చేశారు. ఐసిస్ కార్యకర్తలతో సంబంధాలు, ఉగ్రవాద కార్యకర్తలకు సహాయం చేయడానికి వైద్య, ఆయుధ సంబంధిత యాప్‌ను రూపొందించాడని ఎన్ఐఏ ఆరోపించింది. ఐసిస్ అనుబంధ సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఖోరాసన్ ప్రావిన్స్ (ఐఎస్కేపీ) కేసును ఏజెన్సీ దర్యాప్తు సందర్భంగా, పక్కా సమాచారంతో ఎంఎస్ రామయ్య మెడికల్ కాలేజీలో పనిచేస్తున్న అబ్దుర్ రహమాన్ (28)ను అదుపులోకి తీసుకున్నామని అధికారులు ప్రకటించారు. అతడినుంచి వివరాలను సేకరిస్తున్నట్టు తెలిపారు. రెహమాన్ 2014లో సిరియాలోని ఐసిస్ మెడికల్ క్యాంప్‌ను సందర్శించి, అక్కడే 10 రోజుల ఉండి ప్రత్యేక శిక్షణ పొందినట్లు ఎన్ఐఏ విచారణలో తేలింది. ఆ తర్వాత భారత్‌కు తిరిగొచ్చి ఉగ్రవాదులకు సాయం చేస్తున్నట్లు ఎన్ఐఏ తెలిపింది. అలాగే మూడు ప్రాంగణాల్లో సోదాలు నిర్వహించి డిజిటల్ పరికరాలు, మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారి సోనియా నారంగ్ తెలిపారు. యుద్ధంలో గాయపడిన ఐసిస్ ఉగ్రవాదులకు మెడికల్ యాప్ ద్వారా వైద్య సాయం చేయడంతోపాటు ఆయుధాల సమాచారానికి సంబంధించిన వివరాలతో మరో యూప్‌ను కూడా రూపొందిస్తున్నట్లు ఎన్ఐఏ తేల్చింది. విచారణలో నేరాన్ని అంగీకరించడంతో అతడిని ఢిల్లీలోని ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరచి రిమాండ్‌కు తరలించనున్నామన్నారు. కాగా విధ్వంసకర, దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో కశ్మీరీ దంపతులు జహన్‌జైబ్ సామి వాని, అతని భార్య హీనా బషీర్ బీగ్లను అరెస్టు చేసిన అనంతరం మార్చిలో ఐఎస్కేపీ కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ జంట ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న ఐసిస్ అబుదాబి సభ్యుడు అబ్దుల్లా బాసిత్‌తో సంప్రదింపులు జరిపినట్టు తేలింది. ఇప్పటికే ఇతనిపై ఎన్ఐఏ కేసు నమోదు చేసింది. ఈ కేసు విచారణలో భాగంగా తాజా పరిణామం చోటు చేసుకుంది. -
ఐసిస్‌తో సంబంధాలు.. పోలీసుల అదుపులో దంపతులు
న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ చట్టానికి(సీఏఏ) వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనల ముసుగులో దేశ రాజధాని ఢిల్లీలో ఉగ్రదాడికి ప్రణాళికలు రచిస్తున్న ఓ జంటను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కశ్మీర్‌కు చెందిన ఈ జంటకు ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఖోరాసన్ ప్రావిన్స్‌తో(ఐఎస్కేపీ) సంబంధాలు ఉన్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఢిల్లీలో ఆత్మహుతి దాడులకు ప్రణాళికలు రచించడమే కాకుండా, ఉగ్రదాడులకు పాల్పడేలా ముస్లిం యువతను ఈ దంపతులు ప్రేరేపిస్తున్నట్టుగా తెలుస్తోంది. అరెస్ట్ అయిన వారిలో శ్రీనగర్‌కు చెందిన జహన్‌జెబ్ సమి, అతని భార్య హీనా బషీర్‌లు అన్నారు. వీరు ప్రస్తుతం ఢిల్లీలోని జామియా నగర్లో నివాసం ఉంటున్నారు. ఆదివారం ఉదయం ఈ దంపతుల నివాసంపై దాడులు నిర్వహించిన పోలీసులు.. వారిద్దరని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. జహన్‌జెబ్, హీనాలు అఫ్ఘానిస్తాన్‌లోని ఐసిస్ సభ్యులతో రెగ్యులర్‌గా సంప్రదింపులు జరుపుతున్నట్టు చెప్పారు. అలాగే ఎన్నార్సీ, సీఏఏకు వ్యతిరేకంగా ముస్లిం యువతను రెచ్చగొట్టడంతోపాటు, దేశంలో ఉగ్రదాడులకు పాల్పడేందుకు ప్రేరేపిస్తున్నారని తెలిపారు. కాగా, జహన్‌బెబ్ ఓ ప్రైవేటు కంపెనీలో వర్క్ చేస్తున్నట్టుగా సమాచారం. ఈ దంపతులు సీఏఏ, ఎన్నార్సీకి వ్యతిరేకంగా మద్దతు కూడగట్టేందుకు ఇండియన్ మస్లిమ్స్ యూనిటీ పేరిట సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టినట్టుగా సమాచారం. -
'మా ఆయనకు ఐఎస్ఐఎస్ తో లింక్స్ ఉన్నాయి'
ముంబై: ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) ఉగ్రవాద గ్రూపుతో ముద్దబిర్ ముష్తాక్ షైక్ కు సంబంధాలు ఉన్న విషయం ఆయన కుటుంబానికి కూడా తెలిసినట్టు కనిపిస్తోంది. మహారాష్ట్రలోని ముంబ్రా పట్టణానికి చెందిన షైక్ (34)ను అతని ఇంటి నుంచి శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు ఏటీఎస్, ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేశారు. షైక్ ఎప్పుడూ సిరియాకు వెళ్తున్నానని చెప్పేవాడని ఆయన కుటుంబం చెప్తోంది. షేక్ భార్య ఉజ్మా (30) బీకాం డిగ్రీ చదివింది. ఆమె తండ్రి రియల్ ఎస్టేట్ ఎజెంట్. ఐఎస్ఐఎస్ ఉగ్రవాద భావజాలాన్ని అనుసరించవద్దని వారు ఎప్పుడూ షైక్ కు కౌన్సెలింగ్ చేస్తూ వచ్చారు. 'మనకు ఓ కుటుంబం ఉంది. ఇద్దరు పిల్లలు ఉన్నారని నేను ఎప్పుడూ ఆయనకు చెప్పేదాన్ని. కానీ ఆయన మాత్రం నన్ను పట్టించుకునేవారు కాదు. ఇస్లామిక్ గ్రూపులో తానొక భాగమని, అది మంచి కోసం పనిచేస్తుందని చెప్పేవారు' అని ఉజ్మా తెలిపింది. ఈ క్రమంలో అమృతనగర్‌లోని రెష్మా అపార్ట్మెంట్లోని తమ నివాసంలో షైక్‌తో కలిసి ఉండలేక ఆమె బంధువుల వద్దకు వచ్చేసింది. భారత్‌లో ఐఎస్ఐఎస్కు నియామకాలు చేపడుతున్న వారిలో షేక్ ప్రధాన నిందితుడు అని పోలీసులు భావిస్తున్నారు. ఐటీ వృత్తినిపుణుడు అయిన అతన్ని శుక్రవారం ముంబైలోని ఎన్ఐఏ కోర్టులో ప్రవేశపెట్టి.. ట్రాన్సిట్ రిమాండ్ పొందారు. అతన్ని సోమవారం ఢిల్లీలోని పాటియాల కోర్టు ఎదుట హాజరపరిచారు. ఐఎస్ఐఎస్ వ్యవహారంలో అరెస్టైన మొత్తం 12 మందికి పాటియాల కోర్టు సోమవారం రిమాండ్ విధించింది. గత కొన్ని నెలల నుంచి ఐఎస్ఐఎస్తో తన భర్త క్రియాశీలంగా వ్యవహరిస్తున్నాడని, అయితే గత నెలరోజులుగా అతను అంత చురుగ్గా ఈ ఇందులో పాలుపంచుకోలేదని ఉజ్మా తెలిపింది. ఈ విషయాన్ని తాను పోలీసులకు తెలిపానని, కేవలం విచారణ కోసమే తన భర్తను అరెస్టు చేసినట్టు వారు తెలిపారని ఆమె వివరించింది.