10న పీఎస్ఎల్వీ సీ26 ప్రయోగం
షార్‌లో రేపటి నుంచి కౌంట్‌డౌన్
శ్రీహరికోట (సూళ్లూరుపేట): శ్రీపొట్టిశ్రీరాము లు నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) మరో ప్రయోగానికి సిద్ధమవుతోంది. నావిగేషన్ టెక్నాలజీకి సంబంధించి ఇస్రో స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానం తో రూపొందించిన ఐఆర్ఎన్ఎస్ఎస్-1సీ ఉపగ్రహాన్ని పీఎస్ఎల్వీ సీ26 రాకెట్ ఈ నెల 10న నింగిలోకి మోసుకెళ్లనుంది. 1,425.5 కిలోల బరువైన ఉపగ్రహాన్ని ఆ రోజు వేకువజామున 1.56 గంటలకు పీఎస్ఎల్వీ సీ26 ద్వారా నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చురుగ్గా సాగుతున్నాయి.
పీఎస్ఎల్వీ రాకెట్ సిరీస్‌లో ఇది 28వ ప్రయోగం కాగా, అతిపెద్ద ఎక్సెల్ స్ట్రాపాన్ బూస్టర్లతో చేపడుతున్న ఏడో ప్రయో గం. భూమికి 36 కిలోమీటర్లు ఎత్తులోని భూస్థిరకక్ష్యలో ప్రవేశపెడతారు. సోమవారం షార్‌లోని బ్రహ్మప్రకాశ్ హాల్లో మిషన్ సంసిద్ధతా(ఎంఆర్ఆర్) సమావేశం నిర్వహించనున్నారు.