issued circular
-
సోమవారం నుంచి తాజా గోల్డ్ బాండ్లు
ముంబై: సావరిన్ గోల్డ్ బాండ్ల స్కీమ్ సోమవారం నుంచి అందుబాటులోకి రానుంది. ఐదు రోజుల పాటు (ఫిబ్రవరి 28 నుంచి మార్చి 4వ తేదీ) అమల్లో ఉండే ఈ బాండ్ స్కీమ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) సిరీస్‌లో పదవది. గ్రాము ధర రూ.5,109 అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) శుక్రవారం జారీ చేసిన ప్రకటన పేర్కొంది. ఆన్లైన్లో కొనుగోలుకు గ్రాముకు రూ.50 డిస్కౌంట్ లభిస్తుంది. అంటే ఈ సందర్భంలో గ్రాము ధర రూ.5,059గా ఉంటుందన్నమాట. జనవరి 10 నుంచి 14వ తేదీ వరకూ అమలయిన తొమ్మిదివ సిరీస్ జారీ ధర గ్రాముకు రూ.4,786 కావడం గమనార్హం. ఎనిమిదవ సిరీస్ ధర రూ. 4,791. భారత ప్రభుత్వం తరఫున బాండ్లను ఆర్బీఐ జారీ చేస్తుంది. స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌హెచ్‌సీఐఎల్), నిర్దిష్ట పోస్టాఫీసులు, బ్యాంకులు, స్టాక్ ఎక్సే్ఛంజీలు– ఎన్ఎస్ఈ, బీఎస్ఈల్లో గోల్డ్ బాండ్లు లభ్యం అవుతాయి. భౌతికంగా బంగారం కొనుగోళ్లు తగ్గించడం, తద్వారా దేశంపై దిగుమతుల బిల్లు భారంగా మారకుండా చూడ్డం లక్ష్యంగా 2015 నవంబర్‌లో సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్‌ను కేంద్రం ప్రకటించింది. సబ్స్క్రిప్షన్ పీరియడ్‌కు ముందు వారంలోని చివరి మూడు పనిదినాల్లో ఇండియా బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ ప్రచురించిన 999 స్వచ్ఛత బంగారం సాధారణ సగటు ముగింపు ధర ఆధారంగా బాండ్ ధర నిర్ణయమవుతుంది. -
క్యాంపులు నిర్వహించొద్దు
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల నేపథ్యంలో ఏ రాజకీయ పార్టీ లేదా అభ్యర్థి, ఎన్నికైన ప్రతినిధులతో ప్రత్యక్షంగాగానీ, పరోక్షంగాగానీ ఎలాంటి క్యాంపులు(శిబిరాలు) నిర్వహించొద్దని రాష్ట్ర ఎన్నికల కమిషన్(ఎస్ఈసీ) స్పష్టం చేసింది. లంచం లేదా ప్రలోభాలకు గురిచేయొద్దని, రాజకీయ పార్టీలు, మేయర్ / డిప్యూటీ మేయర్ వంటి పదవులను ఆశిస్తున్న వారు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అక్రమపద్ధతులు పాటించడం, ప్రోత్సహించడం చేయొద్దని పేర్కొంది. జీహెచ్ఎంసీ చట్టం, భారత శిక్షాస్మృతి(ఐపీసీ)లలోని నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక నిర్వహణ ప్రారంభసమయానికి 48 గంటల ముందు నుంచి ఎలాంటి ప్రచారం లేదా ప్రచార కార్యకలాపాలు చేపట్టవద్దని, ఈ నిషేధం ఈ ఎన్నికలు పూర్తయ్యేవరకు కొనసాగుతుందని స్పష్టం చేసింది. శనివారం ఈ మేరకు ప్రత్యేక ప్రవర్తనా నియమావళిని ఎస్ఈసీ జారీ చేసింది. ప్రభావితం చేయొద్దు..: రాజకీయపార్టీలు జారీ చేసిన విప్‌లకు వ్యతిరేకంగా ఓటు చేసే విధంగా ఎన్నికైన సభ్యులను ప్రభావితం చేయవద్దని ఎస్ఈసీ తెలిపింది. రాజకీయ పార్టీలు, ఆ పార్టీల అభ్యర్థుల్లో ఎవరైనాగానీ పరోక్ష ఎన్నికల్లో ఓటర్లు వారి ఓటుహక్కులను వినియోగించే సందర్భంలో వారిని ప్రలోభపరచడానికి ప్రయత్నించొద్దని తెలిపింది. ఏదైనా రాజకీయపార్టీ, మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు పోటీ పడుతున్నవారు ఓటర్లు, వారి ఓటింగ్ హక్కులను వినియోగించుకునే సందర్భంలో పార్టీ విప్‌ను ధిక్కరించేందుకుగాను ప్రోత్సాహకంగా వారికి ఎలాంటి పదవిని ఇవ్వజూపొద్దని పేర్కొంది. అధికార పార్టీ లేదా ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు/అధికారులు సర్టిఫికెట్లు, లైసె న్సులు, కాంట్రాక్టు పనులు, పెండింగ్ కేసులను ఎత్తివేయడం, పెండింగ్ బిల్లులు చెల్లించడం, కాంట్రాక్టుల పునరుద్ధరణ, ఇతర ప్రోత్సాహకాలు, ఇతర పద్ధతుల్లో దుర్వినియోగానికి ప్రయత్నిం చొద్దని స్పష్టం చేసింది. ఎన్నికల సందర్భంగా ప్రత్యర్థులపై విచారణ సం స్థల ద్వారా కేసుల నమోదు లేదా చార్జి షీట్ల దాఖలు/రూపకల్పన, అరెస్టులు, నాన్ బెయిలబుల్ వారెంట్లు వంటి వాటి అమలులో పక్షపాతానికి పాల్పడవద్దని పేర్కొంది. -
కంకిపాడు మండల ప్రత్యేకాధికారిగా రవికిరణ్
మచిలీపట్నం(చిలకలపూడి): కంకిపాడు మండల ప్రత్యేకాధికారిగా డీఎస్వో వి.రవికిరణ్‌ను నియమిస్తూ సోమవారం కలెక్టర్ బాబు.ఎ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటివరకు కంకిపాడు మండల ప్రత్యేకాధికారిగా పనిచేసిన జిల్లా క్రీడలశాఖ అధికారి బదిలీ కావటంతో ఖాళీ ఏర్పడింది. డీఎస్వోను మండల ప్రత్యేకాధికారిగా బాధ్యతలు నిర్వహించాలని సోమవారం మీకోసం కార్యక్రమంలో సూచించారు. ప్రత్యేకాధికారిగా కంకిపాడు మండలంలో గ్రామాలన్నింటిలో మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేయాలని, కనీసం పది గ్రామాలైన ఆత్మగౌరవ గ్రామాలుగా ప్రకటించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.