ఇస్తాంబుల్ దాడిలో ఇద్దరు భారతీయుల మృతి
న్యూఢిల్లీ: టర్కీ ఆర్థిక రాజధాని ఇస్తాంబుల్‌లోని ఓ నైట్‌క్లబ్‌లో న్యూ ఇయర్ వేడుకలో దుండగుడు కాల్పులు జరిపిన ఘటనలో మృతుల సంఖ్య 39కి పెరిగింది. కాగా, చనిపోయినవారిలో ఇద్దరు భారతీయులు కూడా ఉన్నట్లు భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ వెల్లడించారు. మధ్యప్రదేశ్‌కు చెందిన మాజీ రాజ్యసభ ఎంపీ తనయుడు అబీస్ రిజ్వీ అనే యువకుడితోపాటు గుజరాత్‌కు చెందిన ఖుషీ అనే యువతి ఇస్తాంబుల్ కాల్పుల్లో మరణించినట్లు సుష్మా ఆదివారం తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. విషయం తెలిసిన వెంటనే టర్కీలోని భారత రాయబారి హుటాహుటిన ఇస్తాంబుల్‌కు బయలుదేరారని మంత్రి పేర్కొన్నారు. (ప్రధాన వార్త కోసం చదవండి: న్యూ ఇయర్ వేడుకల్లో పెను విషాదం)
శనివారం(డిసెంబర్ 31) అర్ధరాత్రి దాటిన తర్వాత ఆర్టకోయ్ లోని నైట్‌క్లబ్‌లోకి శాంటాక్లాజ్ వేషధారణలో ప్రవేశించిన దుండగుడు విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో 39 మంది అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 16 మంది విదేశీయులే కావడం గమనార్హం. మరో 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. కాల్పులు చోటుచేసుకున్న సమయంలో నైట్‌క్లబ్‌లో దాదాపు 500 మంది ఉన్నారు. సాయుధుడు నైట్‌క్లబ్ లో కాల్పులు జరపక ముందు ఓ పోలీసు అధికారి, ఓ పౌరుడిపైనా కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనను ఉగ్రచర్యగా అనుమానిస్తోన్న టర్కీ ప్రభుత్వం దర్యాప్తు చేపట్టింది. చనిపోయిన భారతీయుల మృతదేహాల తరలింపునకు సంబంధించి తదుపరి సమాచారాన్ని మంత్రి సుష్మ వెల్లడిస్తారు. ('దొరికినవారిని దొరికినట్లు కాల్చేశాడు'.. ప్రత్యక్ష సాక్షి కథనం)
I have a bad news from Turkey. We have lost two Indian nationals in the Istanbul attack. Indian Ambassador is on way to Istanbul. /1
— Sushma Swaraj (@SushmaSwaraj) 1 January 2017
The victims are Mr.Abis Rizvi son of former Rajya Sabha MP and Ms.Khushi Shah from Gujarat. /2
— Sushma Swaraj (@SushmaSwaraj) 1 January 2017