IT and Electronics
-
4 ఏళ్లలో భారీగా ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు
నోయిడా: దేశీయంగా ఎల్రక్టానిక్స్ పరికరాల వ్యవస్థ అభివృద్ధి చెందుతోందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. వచ్చే 3–4 ఏళ్లలో భారత్ చెప్పుకోతగ్గ స్థాయిలో విడిభాగాల ఎగుమతిదారుగా ఎదగగలదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మొబైల్ రంగానికి ప్రకటించిన ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక పథకంతో అదనంగా 5 లక్షల ఉద్యోగావకాశాలు వచ్చాయని, రాబోయే అయిదేళ్లలో ఇది మరింతగా పెరుగుతుందని మంత్రి చెప్పారు. ‘దేశీయంగా డిజైన్ సామర్థ్యాలను మెరుగుపర్చుకుంటున్నాం. ఇది దేశానికి ప్రయోజనకరంగా ఉండనుంది. ఎల్రక్టానిక్స్ పరికరాల తయారీ కూడా వృద్ధి చెందుతోంది. వచ్చే 3–4 ఏళ్లలో మొబైల్ ఫోన్ల తరహాలోనే మనం విడిభాగాలను కూడా గణనీయంగా ఎగుమతి చేయబోతున్నాం‘ అని ఆయన పేర్కొన్నారు. డిక్సన్ టెక్నాలజీస్‌కి చెందిన నాలుగో మొబైల్ ఫోన్స్ తయారీ యూనిట్‌ను ప్రారంభించిన సందర్భంగా మంత్రి ఈ విషయాలు చెప్పారు. డిక్సన్ అనుబంధ సంస్థ ప్యాడ్జెట్ ఎల్రక్టానిక్స్ దీన్ని రూ. 256 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసింది. ఈ ప్లాంటు వార్షిక సామ ర్ధ్యం 2.5 కోట్ల యూనిట్లు కాగా, చైనా కంపెనీ షావో మికి కోసం స్మార్ట్ఫోన్లను తయారు చేస్తారు. ఎల్రక్టానిక్స్ సంస్థల సమాఖ్య ఎల్సినా అంచనల ప్రకారం 2021–22లో దేశీయంగా మొత్తం విడిభాగాల మార్కెట్ 39 బిలియన్ డాలర్లుగా ఉండగా.. ఇందులో 68 శాతం వాటా దిగుమతులదే ఉంటోంది. -
రియల్మీ ఫోన్లలో వ్యక్తిగత డేటా సేకరణ? స్పందించిన కేంద్రమంత్రి
చైనాకు చెందిన మొబైల్ కంపెనీ రియల్మీ ఫోన్లలోని కాల్ లాగ్‌లు, లొకేషన్ సమాచారం, ఎస్సెమ్మెస్ వంటి వినియోగదారుల వ్యక్తిగత డేటాను సేకరిస్తోందని యూజర్లు ఆరోపిస్తున్నారు. రియల్మీ ఫోన్లలోని 'మెరుగైన ఇంటెలిజెంట్ సర్వీసెస్' వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని క్యాప్చర్ చేస్తుందని, ఈ సర్వీస్ డిఫాల్ట్‌గా యాక్టివేట్ చేశారని పేర్కొంటూ ఓ యూజర్ చేసిన ట్వీట్‌కు ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పందించారు. దీనిని తనిఖీ చేస్తామని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్లో ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ అధికారిక ట్విటర్ హ్యాండిల్‌ను కూడా ఆయన ట్యాగ్ చేశారు. ‘రియల్మీ స్మార్ట్‌ఫోన్‌లో యూజర్ డేటా (కాల్ లాగ్‌లు, ఎస్సెమ్మెస్, లొకేషన్ సమాచారం) క్యాప్చర్ చేసే ఫీచర్ (మెరుగైన ఇంటెలిజెంట్ సర్వీసెస్) ఉంది. ఇది డిఫాల్ట్‌గా 'ఆన్'లో ఉంది. సెట్టింగ్‌లు -> అదనపు సెట్టింగ్‌లు -> సిస్టమ్ సేవలు -> మెరుగుపరచబడిన ఇంటెలిజెంట్ సర్వీసెస్‌కి వెళ్లినప్పుడు డిఫాల్ట్ ఫీచర్‌గా 'ఆన్' ఉండటం చూడవచ్చు. భారతీయ వినియోగదారుల అనుమతి లేకుండా వారి డేటాను సేకరిస్తున్నారు. ఇది డిఫాల్ట్‌గా ఆన్‌లో ఉన్నందున ఇది బలవంతపు సమ్మతి. ఈ డేటా చైనాకు పంపుతున్నారా?’ అంటూ రిషి బాగ్రీ అనే యూజర్ ట్విటర్లో షేర్ చేశారు. ఈ సర్వీస్ ఫీచర్ సెట్టింగ్‌ల కింద లోతుగా ఉండటంతో చాలా మంది వినియోగదారులకు దాని గురించి కూడా తెలియదు. కానీ ఈ ట్వీట్‌ను ఫాలో అయిన మరికొందరు యూజర్లు వన్‌ప్లస్ ఫోన్లలో కూడా ఇలాంటి ఫీచర్‌ను గుర్తించినట్లు పేర్కొన్నారు. ఒప్పో, వివో, రియల్మీ కంపెనీలకు మాతృ సంస్థ బీబీకే ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్. వన్‌ప్లస్ బ్రాండ్ కూడా ఒప్పో అనుబంధ సంస్థే. రియల్మీ స్మార్ట్‌ఫోన్ కంపెనీ భారతదేశంలో ప్రసిద్ధి చెందింది. ఇక్కడ 14.5 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. రియల్మీ ఇండియా సీఈఓ మాధవ్ సేథ్ ఇటీవలే తప్పుకున్నారు. ఉన్నట్టుండి తన పదవి రాజీనామా చేశారు. Will hv this tested and checked @rishibagree copy: @GoI_MeitY https://t.co/4hkA5YWsIg — Rajeev Chandrasekhar 🇮🇳 (@Rajeev_GoI) June 16, 2023 -
కొత్త డిజిటల్ ఇండియా చట్టంలో తగిన రక్షణలు
న్యూఢిల్లీ: కొత్తగా తీసుకురాబోయే డిజిటల్ ఇండియా చట్టంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) తరహా అత్యాధునిక సాంకేతిక టెక్నాలజీల నుంచి తగిన రక్షణలతో ప్రత్యేక చాప్టర్ ఉంటుందని కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. భారత్ సరైన విధానాన్నే అనుసరిస్తుందంటూ.. ఇంటర్నెట్ను భద్రంగా, యూజర్లకు విశ్వసనీయమైనదిగా ఉండేలా చూస్తామన్నారు. డిజిటల్ ఇండియా చట్టం రూపకల్పన విషయంలో భాగస్వాములతో రాజీవ్ చంద్రశేఖర్ విస్తృతమైన సంప్రదింపులు నిర్వహించడం గమనార్హం. రెండు దశాబ్దాల క్రితం నాటి ఐటీ చట్టం స్థానంలో కొత్తది తీసుకురానున్నారు. ఏఐ ఆధారిత చాట్ జీపీటీ సంచలనాలు సృష్టిస్తున్న తరుణంతో తగిన రక్షణలు ఏర్పాటు చేస్తామంటూ మంత్రి చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. అంతేకాదు చాట్ జీపీటీని సృష్టించిన ఓపెన్ఏఐ సంస్థ సీఈవో శామ్ ఆల్ట్‌మన్ సైతం ఏఐ టెక్నాలజీ నియంత్రణకు అంతర్జాతీయంగా నియంత్రణ సంస్థ అవసరమని పేర్కొనడం గమనార్హం. శామ్ ఆల్ట్‌మన్ వ్యాఖ్యలను మంత్రి వద్ద ప్రస్తావించగా.. ఆయనో స్మార్ట్ మ్యాన్ అని పేర్కొన్నారు. ఏఐని ఎలా నియంత్రించాలో ఆయనకంటూ స్వీయ అభిప్రాయాలు ఉండొచ్చన్నారు. కానీ, భారత్‌లోనూ స్మార్ట్ బుర్రలకు కొదవ లేదంటూ, ఏఐ నుంచి ఎలా రక్షణలు ఏర్పాటు చేయాలనే విషయమై తమకు అభిప్రాయాలు ఉన్నట్టు చెప్పారు. దీనిపై ఇప్పటికే సంప్రదింపులు కూడా మొదలైనట్టు తెలిపారు. డేటా బిల్లుతో దుర్వినియోగానికి అడ్డుకట్ట ప్రతిపాదిత డిజిటల్ వ్యక్తిగత డేటా రక్షణ బిల్లుతో డేటా దుర్వినియోగానికి అడ్డుకట్ట పడగలదని కేంద్ర ఐటీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. సుదీర్ఘకాలంగా దోపిడీ చేసిన ప్లాట్‌ఫాంల ధోరణుల్లో మార్పులు రాగలవని ఆయన చెప్పారు. ఫ్యాక్ట్–చెక్ విభాగం ఏర్పాటుపై నెలకొన్న ఊహాగానాలకు తెరదించారు. వాస్తవాలతో పోలిస్తే తప్పుడు సమాచారం 10–15 రెట్లు వేగంతో ప్రయాణిస్తుందని, 20–50 రెట్లు ఎక్కువ మందికి చేరే ప్రమాదముందని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో విద్వేషాన్ని, హింసను రెచ్చగొట్టడానికి ప్రభు త్వానికి వ్యతిరేకంగా ఎవరైనా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తే.. అది తప్పు అని స్పష్టత ఇచ్చేందుకు ప్రభుత్వానికి ఒక అవకాశం ఉండాలని మంత్రి చెప్పారు. అందుకోసమే ఫ్యాక్ట్ చెక్ విభాగం పని చేస్తుందే తప్ప దాని వెనుక సెన్సార్షిప్ ఉద్దేశమేమీ లేదని పేర్కొన్నారు. -
కృత్రిమ మేథను నియంత్రించే యోచన లేదు
న్యూఢిల్లీ: దేశీయంగా కృత్రిమ మేథ (ఏఐ) అభివృద్ధిని నియంత్రించే యోచనేదీ లేదని కేంద్ర ఐటీ, టెలికం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. దానికి సంబంధించి ఏవైనా చట్టాలు తెచ్చే అంశం గానీ పరిశీలనలో లేదని లోక్‌సభకు ఇచ్చిన రాతపూర్వక సమాధానంలో ఆయన పేర్కొన్నారు. కృత్రిమ మేథ విషయంలో నైతికత, రిస్కుల గురించి ఆందోళనలు ఉన్నాయని.. ఏఐని ప్రామాణీకరించడంలో ఉత్తమ విధానాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వ ఏజెన్సీలు కృషి చేస్తున్నాయని మంత్రి వివరించారు. బాధ్యతాయుతమైన ఏఐ అంశంపై నీతి ఆయోగ్ ఇప్పటికే పలు పత్రాలు ప్రచురించిందని చెప్పారు. ఏఐపై పరిశోధనలకు ఉపయోగపడేలా సీడీఏసీతో కలిసి కేంద్ర ఎలక్ట్రానిక్స్.. ఐటీ శాఖ ఐరావత్ (ఏఐ రీసెర్చ్, అనలిటిక్స్ ప్లాట్‌ఫామ్)కు రూపకల్పన చేసిందని పేర్కొన్నారు. -
యోట్టా ఇన్ఫ్రా రూ.39,000 కోట్ల పెట్టుబడి
డేటా సెంటర్ కంపెనీ యోట్టా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రూ.39,000 కోట్ల పెట్టుబడి చేస్తున్నట్టు ప్రకటించింది. వచ్చే 5–7 ఏళ్లలో ఈ వ్యయం చేయనున్నట్టు హీరానందానీ గ్రూప్‌నకు చెందిన ఈ సంస్థ వెల్లడించింది. కంపెనీ మొత్తం ఆరు డేటా సెంటర్లను నెలకొల్పనుంది. ఈ మేరకు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం చేసుకుంది. డేటా సెంటర్ క్యాంపస్, ఐటీ ఉపకరణాలు, ఇతర హార్డ్‌వేర్ కోసం ఈ మొత్తం ఖర్చవుతుందని యోట్టా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కో–ఫౌండర్ దర్శన్ హీరానందానీ తెలిపారు. గ్రేటర్ నోయిడా డేటా సెంటర్ పార్క్‌లో యోట్టా డీ1 డేటా సెంటర్ ప్రారంభించిన సందర్భంగా సోమవారం ఆయన ఈ విషయాలను వెల్లడించారు. చదవండి: ఎయిర్టెల్ బంపరాఫర్: ఒకే రీచార్జ్‌తో బోలెడు బెనిఫిట్స్, తెలిస్తే వావ్ అనాల్సిందే! -
ట్విటర్‌కు షాక్: జూలై 4 వరకే డెడ్‌లైన్
సాక్షి, న్యూఢిల్లీ: మైక్రో బ్లాకింగ్ సైట్ ట్విటర్‌కు కేంద్రం మరో అల్టిమేటం జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే జారీ చేసిన ఆదేశాలన్నింటినీ అమలు చేసేందుకు జూలై 4 చివరి గడువు ఇచ్చింది. ఈ మేరకు తుది నోటీసులు జారీ అయ్యాయి. జులై 4 లోగా గత ఆదేశాలన్నింటినీ పాటించాలని ప్రభుత్వం ట్విట్టర్‌కు నోటీసు జారీ చేసినట్లు బుధవారం అధికారిక వర్గాలు తెలిపాయి. దీనికి సంబంధించి ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ జూన్ 27 న నోటీసు జారీ చేసింది. దీన్ని ట్విటర్ బేఖాతరు చేయడంతో తుది నోటీసులిచ్చిన మంత్రిత్వ శాఖ ఇదే చివరి నోటీసని తేల్చి చెప్పింది. గడువులోగా ప్రభుత్వ ఆదేశాలను అమలు చేయడంలో విఫలమైతే ట్విటర్ మధ్యవర్తి స్థితిని కోల్పోతుందని హెచ్చరించింది. ఆ తరువాత ట్విటర్ పోస్ట్‌లకు బాధ్యత వహించాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది. కాగా అంతర్జాతీయ న్యాయవాద గ్రూప్ ఫ్రీడమ్ హౌస్, జర్నలిస్టులు, రాజకీయ నాయకులు, రైతు ఉద్యమానికి మద్దతు పలికిన ట్విటర్ ఖాతాలను, కొన్ని ట్వీట్లను బ్లాక్ చేయాలని 2021లో ప్రభుత్వం ట్విటర్‌ను కోరింది. ఈ నేపథ్యంలో 80కి పైగా ట్విటర్ ఖాతాలను బ్లాక్ చేశామంటూ దీనికి సంబంధించిన జాబితాను జూన్ 26న కేంద్రానికి సమర్పించింది. అయితే, ట్విటర్ పాటించాల్సిన ఆర్డర్లు ఇంకా ఉన్నాయని, ఇందుకు జూలై 4 మాత్రమే చివరి గడువిచ్చామని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు తాజా పరిణామంపై ట్విటర్ ఇంకా స్పందించలేదు. -
కలిసి రండి...తిరుపతిని ఐటీ హబ్ చేద్దాం
తిరుచానూరు: తిరుచానూరు రోడ్డులోని సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా(ఎస్టీపీఐ)లో మంగళవారం సాయంత్రం ఐటీ నిపుణులతో మంత్రి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉందన్నారు. ఈ ఇబ్బందుల నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించేందుకు ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ ఒక్కటే మార్గం అని ఆ దిశగా ఈ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ఇందులో భాగంగా రానున్న ఐదేళ్లల్లో హైదరాబాదుకు దీటుగా తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, కాకినాడను ఐటీ హబ్‌లుగా మారుస్తామన్నారు. ఈ సందర్భంగా తిరుపతి ఐటీ అసోసియేషన్(టిటా) ప్రతినిధులు, ఇతర ఐటీ నిపుణులు తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. తమకు ఎటువంటి సౌకర్యాలు, వసతులు, ప్రోత్సాహం ఇవ్వకుంటే ఐటీ రంగం ఎలా అభివృద్ధి సాధిస్తుందని ప్రశ్నించారు. కొత్త కంపెనీలను నెలకొల్పేందుకు ప్రభుత్వం సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఇదివరకే నెలకొల్పిన సంస్థల అభివృద్ధికిపన్నులో రాయితీ, ఇతరత్రా సౌకర్యాలు, వెసలుబాటు కల్పించాలని కోరారు. చిన్న కంపెనీలని తమకు టీటీడీ, యూనివర్సిటీ, ఎస్పీడీసీఎల్లో అవకాశం కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేపట్టే ఐటీ ప్రాజెక్టుల్లో తమకు అవకాశం కల్పించాలని, తద్వారా మరికొందరికి ఉద్యోగావకాశాలు కల్పించగలమని చెప్పారు. అలాగే పబ్లిక్ ప్రయివేటు కంపెనీలు, స్థానిక యూనివర్సిటీలు, ప్రభుత్వం కలిసి పనిచేస్తే ఐటీ రంగం మరింత అభివృద్ధి అవుతుందన్నారు. పీహెచ్డీ నుంచి పుట్టుకొచ్చిందే గూగుల్ అని ఉదాహరణగా పేర్కొన్నారు. ఎస్టీపీఐలోని సృజన్ టెక్నాలజీస్ సంస్థ అధినేత లక్ష్మీనారాయణరెడ్డి మాట్లాడుతూ ఎస్టీపీఐకి ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం, రాయితీలు అందకపోవడంతో ఇక్కడ సంస్థలను నెలకొల్పేందుకు ఎవరూ ముందుకురావడం లేదన్నారు. తిరుపతిని ఐటీ హబ్‌గా తీర్చిదిద్దాలని విదేశాల నుంచి వచ్చిన తనలాంటి ఎన్ఆర్ఐలకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం అందడం లేదన్నారు. వీటిపై స్పందించిన మంత్రి గతాన్ని మరిచిపోవాలని, అపార అవగాహన ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో ఐటీ రంగం కొత్త పుంతలు తొక్కుతుందని తెలిపారు. ఐటీ రంగాన్ని ఈ ప్రభుత్వం బలోపేతం చేస్తుందని, కొత్తగా స్థాపించే ఐటీ సంస్థలకు అనేక రాయితీలు, వసతులు అందిస్తామని స్పష్టం చేశారు. అలాగే పెద్దపెద్ద కంపెనీలను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. తద్వారా రానున్న ఐదేళ్లలో ఐటీ రంగం అభివృద్ధి చెందడంతో పాటు పాటు పెద్ద సంఖ్యలో ఉద్యోగావకాశాలు కల్పిస్తామని చెప్పారు. కార్యక్రమంలో అడిషనల్ జాయింట్ కలెక్టర్ వెంకటసుబ్బారెడ్డి, ఐటీఈ అండ్ సీ శాఖ జేడీ ప్రతాప్, ఎస్టీపీఐ(హైదరాబాదు) డెప్యూటీ డెరైక్టర్ వరప్రసాద్, తుడా కార్యదర్శి డాక్టర్ కే.మాధవీలత, ఇండస్ట్రీస్ జీఎం రామలింగేశ్వరరాజు, టిటా అధ్యక్ష, ఉపాధ్యక్షులు హరి మురళీధర్, జీ.గిరిధర్, కార్యదర్శి ఆర్.వంశీకృష్ణ, కే.రాజశేఖర్, కే.రంగరాజన్ తదితరులు పాల్గొన్నారు. రూ.15వేల కోట్లతో ఐటీ పార్కు రేణిగుంట: జిల్లాలో 300 ఎకరాల్లో రూ.15 వేల కోట్లతో ఐఐటీ పార్కు ఏర్పాటుకు శ్రీకారం చుట్టామని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, ఐటీ శాఖల మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. రేణిగుంట విమానాశ్రయం సమీపంలోని ఐటీ పార్కులో రూ.4.7 కోట్లతో 5.2 ఎకరాల్లో నిర్మించిన ఐటీ ఐఆర్ ఇంకుబేషన్ సెంటర్‌ను మంగళవారం సాయంత్రం బొజ్జల గోపాలకృష్ణారెడిడ్డితో కలసి ఆయన సందర్శించారు. అనంతరం మంత్రి పల్లె రఘునాథరెడ్డి మాట్లాడుతూ విభజన తర్వాత 2020 నాటికి ఐటీ, ఐఆర్ రంగంలో రూ.40 వేల కోట్ల నుంచి రూ.50 వేల కోట్ల టర్నోవర్‌తో రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా ఉంచేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. పరిశ్రమలు స్థాపించే ఔత్సాహికులకు పెట్టుబడుల్లో రాయితీలతోపాటు సింగిల్‌విండో పద్ధతుల్లో 4 వారాల్లో అనుమతులు ఇస్తామన్నారు. జిల్లాలో 300 ఎకరాల్లో రూ.15 వేల కోట్లతో ఐఐటీ పార్కు ఏర్పాటుకు శ్రీకారం చుట్టామన్నారు. రేణిగుంట సమీపంలోని ఐటీ పార్కులో 140 ఎకరాలకు గాను 70 ఎకరాల్లో 6 పరిశ్రమలకు అనుమతులు ఇచ్చామన్నారు.