
నోయిడా: దేశీయంగా ఎల్రక్టానిక్స్ పరికరాల వ్యవస్థ అభివృద్ధి చెందుతోందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. వచ్చే 3–4 ఏళ్లలో భారత్ చెప్పుకోతగ్గ స్థాయిలో విడిభాగాల ఎగుమతిదారుగా ఎదగగలదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మొబైల్ రంగానికి ప్రకటించిన ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక పథకంతో అదనంగా 5 లక్షల ఉద్యోగావకాశాలు వచ్చాయని, రాబోయే అయిదేళ్లలో ఇది మరింతగా పెరుగుతుందని మంత్రి చెప్పారు.
‘దేశీయంగా డిజైన్ సామర్థ్యాలను మెరుగుపర్చుకుంటున్నాం. ఇది దేశానికి ప్రయోజనకరంగా ఉండనుంది. ఎల్రక్టానిక్స్ పరికరాల తయారీ కూడా వృద్ధి చెందుతోంది. వచ్చే 3–4 ఏళ్లలో మొబైల్ ఫోన్ల తరహాలోనే మనం విడిభాగాలను కూడా గణనీయంగా ఎగుమతి చేయబోతున్నాం‘ అని ఆయన పేర్కొన్నారు. డిక్సన్ టెక్నాలజీస్‌కి చెందిన నాలుగో మొబైల్ ఫోన్స్ తయారీ యూనిట్‌ను ప్రారంభించిన సందర్భంగా మంత్రి ఈ విషయాలు చెప్పారు.
డిక్సన్ అనుబంధ సంస్థ ప్యాడ్జెట్ ఎల్రక్టానిక్స్ దీన్ని రూ. 256 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసింది. ఈ ప్లాంటు వార్షిక సామ ర్ధ్యం 2.5 కోట్ల యూనిట్లు కాగా, చైనా కంపెనీ షావో మికి కోసం స్మార్ట్‌ఫోన్లను తయారు చేస్తారు. ఎల్రక్టానిక్స్ సంస్థల సమాఖ్య ఎల్సినా అంచనల ప్రకారం 2021–22లో దేశీయంగా మొత్తం విడిభాగాల మార్కెట్ 39 బిలియన్ డాలర్లుగా ఉండగా.. ఇందులో 68 శాతం వాటా దిగుమతులదే ఉంటోంది.
Comments
Please login to add a commentAdd a comment