
న్యూఢిల్లీ: దేశీయంగా కృత్రిమ మేథ (ఏఐ) అభివృద్ధిని నియంత్రించే యోచనేదీ లేదని కేంద్ర ఐటీ, టెలికం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. దానికి సంబంధించి ఏవైనా చట్టాలు తెచ్చే అంశం గానీ పరిశీలనలో లేదని లోక్‌సభకు ఇచ్చిన రాతపూర్వక సమాధానంలో ఆయన పేర్కొన్నారు.
కృత్రిమ మేథ విషయంలో నైతికత, రిస్కుల గురించి ఆందోళనలు ఉన్నాయని.. ఏఐని ప్రామాణీకరించడంలో ఉత్తమ విధానాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వ ఏజెన్సీలు కృషి చేస్తున్నాయని మంత్రి వివరించారు. బాధ్యతాయుతమైన ఏఐ అంశంపై నీతి ఆయోగ్ ఇప్పటికే పలు పత్రాలు ప్రచురించిందని చెప్పారు. ఏఐపై పరిశోధనలకు ఉపయోగపడేలా సీడీఏసీతో కలిసి కేంద్ర ఎలక్ట్రానిక్స్.. ఐటీ శాఖ ఐరావత్ (ఏఐ రీసెర్చ్, అనలిటిక్స్ ప్లాట్‌ఫామ్)కు రూపకల్పన చేసిందని పేర్కొన్నారు.