సాక్షి, న్యూఢిల్లీ: మైక్రో బ్లాకింగ్ సైట్ ట్విటర్‌కు కేంద్రం మరో అల్టిమేటం జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే జారీ చేసిన ఆదేశాలన్నింటినీ అమలు చేసేందుకు జూలై 4 చివరి గడువు ఇచ్చింది. ఈ మేరకు తుది నోటీసులు జారీ అయ్యాయి.
జులై 4 లోగా గత ఆదేశాలన్నింటినీ పాటించాలని ప్రభుత్వం ట్విట్టర్‌కు నోటీసు జారీ చేసినట్లు బుధవారం అధికారిక వర్గాలు తెలిపాయి. దీనికి సంబంధించి ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ జూన్ 27 న నోటీసు జారీ చేసింది. దీన్ని ట్విటర్ బేఖాతరు చేయడంతో తుది నోటీసులిచ్చిన మంత్రిత్వ శాఖ ఇదే చివరి నోటీసని తేల్చి చెప్పింది. గడువులోగా ప్రభుత్వ ఆదేశాలను అమలు చేయడంలో విఫలమైతే ట్విటర్ మధ్యవర్తి స్థితిని కోల్పోతుందని హెచ్చరించింది. ఆ తరువాత ట్విటర్ పోస్ట్‌లకు బాధ్యత వహించాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది.
కాగా అంతర్జాతీయ న్యాయవాద గ్రూప్ ఫ్రీడమ్ హౌస్, జర్నలిస్టులు, రాజకీయ నాయకులు, రైతు ఉద్యమానికి మద్దతు పలికిన ట్విటర్ ఖాతాలను, కొన్ని ట్వీట్‌లను బ్లాక్ చేయాలని 2021లో ప్రభుత్వం ట్విటర్‌ను కోరింది. ఈ నేపథ్యంలో 80కి పైగా ట్విటర్ ఖాతాలను బ్లాక్ చేశామంటూ దీనికి సంబంధించిన జాబితాను జూన్ 26న కేంద్రానికి సమర్పించింది. అయితే, ట్విటర్ పాటించాల్సిన ఆర్డర్‌లు ఇంకా ఉన్నాయని, ఇందుకు జూలై 4 మాత్రమే చివరి గడువిచ్చామని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు తాజా పరిణామంపై ట్విటర్ ఇంకా స్పందించలేదు.
Comments
Please login to add a commentAdd a comment