టాప్ టెక్ బిలీనియర్లకు దడదడ
న్యూఢిల్లీ : భారత్ కు టెక్నాలజీ ఇండస్ట్రీ ఎంతో ముఖ్యమైనది. గత మూడు దశాబ్దాలుగా దేశీయ ఆర్థికవద్ధిలో ఐటీ సెక్టార్ ఎనలేని సేవలందిస్తోంది. లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడమే కాక, బిలీనియర్స్ జాబితాలో కనీసం ఏడుగురు భారతీయ వ్యవస్థాపకులు ఉండేలా సంచలనాలు సృష్టిస్తోంది. కానీ ఎప్పుడైతే అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చారో అప్పటి నుంచి టెక్ ఇండస్ట్రీలో భయాందోళనలు నెలకొన్నాయి. అమెరికాలో టెక్ సర్వీసులు అందించే కంపెనీలకు షాకిచ్చేలా ట్రంప్ వీసా నిబంధనలను కఠినతరం చేస్తున్నారు. ఈ నిబంధనలు టాప్ టెక్ బిలీనియర్లుగా వెలుగొందుతున్న వారి సంపదకు దెబ్బకొడుతోంది.
విప్రో లిమిటెడ్ చైర్మన్ అజిమ్ ప్రేమ్జి, హెచ్సీఎల్ చైర్మన్ శివ్ నాడార్, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణమూర్తి, నందన్ నిలేకనీ వంటి ఇతర టాప్-100 టెక్ రిచెస్ట్ బిలీనియర్ల సంపద ఆవిరవుతుందని రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. దేశీయ స్టాక్ సూచీలు 0.6 శాతం పైకి ఎగిసిన సమయంలో ఐటీ స్టాక్స్ 3 శాతం మేర పడిపోయాయి. కానీ వీసా విషయంలో అమెరికా తీసుకొస్తున్న నిబంధనలపై స్పందించడానికి మాత్రం లీడింగ్ అవుట్ సోర్సింగ్ కంపెనీలు ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, హెచ్సీఎల్ టెక్నాలజీస్ లు వెనుకాడుతున్నాయి. ఈ కంపెనీలు అందించే ఎగుమతుల్లో మూడో వంతు రెవెన్యూలు అమెరికా నుంచే వస్తుండటం గమనార్హం.