సీజనల్ వ్యాధులపై అప్రమత్తం అవసరం
పార్వతీపురం టౌన్: ఐటీడీఏ సబ్‌ప్లాన్ మండలాల్లో సీజనల్ వ్యాధులపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ వివేక్‌యాదవ్ అన్నారు. మంగళవారం పార్వతీపురం వచ్చిన ఆయన ఐటీడీఏ కార్యాలయంలో ఆరోగ్యశాఖ, మలేరియా శాఖ, గ్రామీణ నీటి సరఫరా విభాగం, గిరిజన సంక్షేమ శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో మాట్లాడుతూ వ్యాధులు ప్రబలకుండా వైద్యాధికారులు, వైద్యసిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. గ్రామాల్లో ప్రత్యేక వైద్యశిబిరాలు నిర్వహించి గిరిజనులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని సూచించారు.
వైద్య, ఆరోగ్య సిబ్బంది మండల హెడ్క్వార్టర్సులో తప్పకుండా ఉండాలని, రోగాలను సమర్థంగా ఎదుర్కోవాలని సూచించారు. ప్రతీ మంగళ, బుధవారాల్లో ప్రజలను చైతన్యపరుస్తూ గ్రామాలు, పట్టణాల్లో ర్యాలీలు నిర్వహించాలని, ఆరోగ్యం, పారిశుద్ధ్యంపై అవగాహన కలిగించాలని చెప్పారు. అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలనీ తెలిపారు. గిరిజన గ్రామాల్లో తాగునీటి పథకాలు, బావుల్లో క్లోరినేషన్ చేయాలన్నారు. మురుగునీరు నిల్వలేకుండా చర్యలు చేపట్టాలని తెలిపారు. వ్యాధుల వివరాలు తెలుసుకునేందుకు ఐటీడీఏలో మానిటరింగ్‌సెల్ ఏర్పాటుచేయాలని సూచించారు.
దోమల నివారణ మందు పిచికారీపై మలేరియా అధికారి ఎం.ఎం.రవికుమార్ రెడ్డిని ప్రశ్నించారు. తొలివిడత పూర్తయ్యిందని, రెండోవిడత జూలై 1 నుంచి ఆగస్టు 15 వరకు చేపడతామని తెలిపారు. పిచికారీ సిబ్బందికి వేతనాలు ఇవ్వలేదన్న విషయాన్ని ఆయన కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. రెండో విడత వేసేటపుడు ఉపాధి హామీ పథకం ద్వారా వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆశ్రమ పాఠశాలల్లో పిల్లలకు ఎప్పటికప్పుడు వైద్యపరీక్షలు నిర్వహించాలని చెప్పారు. సమావేశంలో ఐటీడీఏ సహాయ ప్రాజెక్టు అధికారి వి.ఎస్.ప్రభాకరరావు, ఉప సంచాలకుడు విజయ్‌కుమార్, కార్యనిర్వాహక ఇంజినీరు కుమార్, జిల్లా పంచాయతీ అధికారి సత్యనారాయణ, ,గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారిణి గాయత్రీ దేవి తదితరులు పాల్గొన్నారు.