స్మార్ట్ ఫోన్ ధరలు సగానికి దిగొస్తాయట?
న్యూఢిల్లీ: ఖరీదైన స్మార్ట్ ఫోన్ కొనుక్కోవాలని ఆలోచిస్తున్నారా? అయితే కొంచెం ఆగండి. ఎందుకంటే.. త్వరలోనే స్మార్ట్ ఫోన్ ధరలు దాదాపు సగానికి పడిపోనున్నాయని తాజా అధ్యయనంలో తేలింది. రాబోయే ఒక నెలలోనే కార్ల విలువ కంటే వేగంగా వీటి ధరలు పడిపోయే అవకాశం ఉందని చెబుతోంది. యూకే కు చెందిన మ్యూజిక్ మ్యాగ్ పై.కామ్ ఈ నివేదికను గురువారం వెల్లడి చేసింది.
ఒక నెలలోనే స్మార్ట్ ఫోన్ ధరలు దిగి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. మార్కెట్లోకి విడుదలైన ఏడాదికి కార్ల విలువ 20 శాతం పడిపోతే... స్మార్ట్ ఫోన్ల విలువ కేవలం ఒక నెలలో 65 శాతం పడిపోయిందని రిపోర్ట్ చేసింది. మరోవైపు మిగతా యాండ్రాయిడ్ డివైస్ లతో పోలిస్తే.. ఐ ఫోన్ విలువ కొంచెం మెరుగ్గా ఉండొచ్చని పేర్కొంది. అత్యాధునిక సాంకేతికవిలువలతో కూడిన మంచి, వేగవంతమైన సుపీరియర్ మోడల్స్ అందుబాటులోకి రావడం ఈ పరిణామానికి దోహదపడిందని చెప్పింది.
ఒక నిర్దిష్టమైన ఫోన్ మోడల్ కు సంబందించిన ప్రజాదరణపై కూడా ఇది ప్రభావితం చూపిస్తుందని, తత్ఫలితంగా దాని విలువ పడిపోవడం , డిమాండ్ తగ్గడం సంభవిస్తుందని ఈ నివేదిక నిర్ధారించింది.