‘ఇజ్జత్ స్కీమ్‌లో లోపాలు సవరించండి’
నెలకు రూ. 1500 లోపు ఆదాయం ఉన్న వారు నెలకు రూ. 20 ఖర్చుతో వంద కిలోమీటర్లలోపు రైల్లో ప్రయాణం చేసేందుకు వీలుగా కేంద్రం తెచ్చిన ఇజ్జత్ పథకంలో లోపాలను సవరించాలని టీఆర్ఎస్ ఎంపీ ప్రొఫెసర్ ఎ.సీతారాంనాయక్ కేంద్రాన్ని కోరారు. గురువారం ఆయన ఈ అంశాన్ని లోక్‌సభ జీరోఅవర్‌లో ప్రస్తావించారు. 2013 వరకు ఆదాయ ధ్రువీకరణ పత్రం ఇచ్చేందుకు ఎంపీలు, ఎమ్మెల్యేలకు అధికారం కల్పించారని, అయితే 2013 తరువాత రైల్వే అధికారులకు దీనిని కట్టబెట్టారని పేర్కొన్నారు. స్థానిక రెవెన్యూ అధికారులకు ఈ అధికారాన్ని కట్టబెట్టడం ద్వారా పేదలకు ఈ పాస్ అందుబాటులోకి తేవాలని కోరారు. అలాగే వార్షిక ఆదాయం రూ. 18,000 పరిమితిగా ఉందని, దీనిని రూ. లక్షకు పెంచాలని కోరారు.