వడదెబ్బకు ముగ్గురి బలి
వడదెబ్బకు ముగ్గురి బలి: వీపనగండ్ల / మాగనూర్ / జడ్చర్ల టౌన్, న్యూస్‌లైన్ : జిల్లాలో వేర్వేరు చోట్ల ముగ్గురు వ్యక్తులు వడదెబ్బకు గురై మృత్యువాతపడ్డారు. వివరాలిలా ఉన్నాయి. గురువారం ఉదయం వీపనగండ్ల మండలం మియ్యాపూర్కు జె.సత్యన్న (55) సమీపంలోని తమ పొలం వద్దకు వెళ్లి వ్యవసాయ పనులు చేపట్టాడు.
అదే రాత్రి ఇంటికి వచ్చాక తీవ్ర అస్వస్థతకు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈయనకు భార్య చిలకమ్మతో పాటు కుమార్తె, ముగ్గురు కుమారులు ఉన్నారు. ఈ సంఘటనతో వారు బోరుమన్నారు. మరో సంఘటనలో కొన్నాళ్లుగా మాగనూర్ మండలం కృష్ణకు చెందిన కాళప్ప (65) స్థానిక రైల్వేస్టేషన్ పరిసరాల్లో భిక్షాటన చేస్తూ జీవనం గడిపేవాడు. ఈయనకు భార్య సరస్వతి ఉంది.
రెండు రోజులుగా ఎండలు విపరీతంగా ఉండటంతో శుక్రవారం మధ్యాహ్నం అస్వస్థతకు గురై రైల్వేస్టేషన్ ప్రాంతంలోని చెట్టు కింద మృతి చెందాడు. అలాగే జడ్చర్ల మండలం ఉదండాపూర్‌కు చెందిన చెన్నయ్య (62) స్థానికంగా కూలి పనులు చేసుకుని జీవించేవాడు. ప్రస్తుతం పశువుల కాపరిగా వ్యవహరిస్తున్నాడు. ఈయనకు భార్య చెన్నమతో పాటు మగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఎప్పటిలాగే గురువారం ఉదయం శివారులో పశువులను తీసుకెళ్లి మేపి అదే రాత్రి ఇంటికి చేరుకున్నాడు. అనంతరం వాంతులు, విరేచనాలు కావటంతో కుటుంబ సభ్యులు గమనించి ఆర్ఎంపీ వద్ద చికిత్స చేయించారు. చివరకు శుక్రవారం ఉదయం ఇంట్లోనే మృతి చెందాడు. బాధిత కుటుంబాన్ని వీఆర్ఓ పాండురంగయ్య పరామర్శించి పంచనామా నిర్వహించారు.