ప్రత్యేక జిల్లా కోరుతూ జనగామ బంద్
► అట్టుడికిన జనగామ
► జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళన
► అరెస్టులు.. రాస్తారోకోలు
జనగామ : జనగామ జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం జనగామ జేఏసీ ఆధ్వర్యంలో బంద్ జరిగింది. జనగామ, మద్దూరు, నర్మెట, లింగాలఘనపురం మండలాల పరిధిలో ధర్నాలు నిర్వహించారు. జనగామ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలు మోహరించారు.
జేఏసీ చైర్మన్ ఆరుట్ల దశమంతరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్సీసీతో పాటు పలు పార్టీల నాయకులు, మహిళ, విద్యార్థి సంఘాల నాయకులు రహదారిపై భైఠాయించారు. జిల్లా ఏర్పాటు చేయడానికి జనగామ అర్హత ఎందుకు లేదో సమాధానం చెప్పాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గంటపాటు రాస్తారోకో నడుస్తుండడంతో వరంగల్, హైదరాబాద్, విజయవాడ, సిద్దిపేట వైపు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళన చేస్తున్న నాయకులను బలవతంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో నాయకులు ప్రతిఘటించడంతో ఉద్రిక్తత నెలకొంది.
ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులపై పోలీసులు చేయి చేసుకోవడమే కాకుండా, వారి కెమెరాలను పగులగొట్టారు. దీంతో జర్నలిస్టులు ఆందోళనకు దిగడంతో దిగివచ్చారు. పోలీసులు అరెస్టు చేసే సమయంలో ఎన్ఎస్యూఐ మాజీ జిల్లా అధ్యక్షులు జక్కుల వేణుమాధవ్‌కు గాయాలు కావడంతో పోలీసులు ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. తెలంగాణ సాంసృతి సంప్రదాయాలను ప్రతిభింబిచేలా మహిళలు బోనాలతో ఆందోళన చేపట్టి జనగామ జిల్లా ఆకాంక్షను తెలియజేశారు.