పట్టుబడిన నకిలీ పోలీసులు
రూ. 60 లక్షల విలువైన సొత్తు స్వాధీనం
ముంబాయి నుంచి వచ్చి చోరీలు
పలు రాష్ట్రాల్లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్
నగర పోలీసు కమిషనర్ ఎం.ఎన్. రెడ్డి
బెంగళూరు : పోలీసు ముసుగులో మహిళలను మోసం చేస్తున్న ఐదుగురు మోస్ట్ వాంటెడ్ నేరగాళ్లను ఇక్కడి బెంగళూరు సీసీబీ పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు లాల్ సమీర్ జాఫర్ హుస్సేన్ అలియాస్ జాఫర్, జాఫర్ ఆలీ సయ్యద్, ఉస్మాన్, గులాం ఆలీ సయ్యద్, అబ్బాస్ ఆలీలను అరెస్టు చేశామని బెంగళూరు నగర పోలీసు కమిషనర్ ఎం.ఎన్. రెడ్డి చెప్పారు. బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. నిందితుల నుంచి రూ. 60 లక్షల విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
అరెస్టయిన నిందితులు ఇరాన్ సంతతికి చెందిన వారు. ఉస్మాన్, అబ్బాస్ కర్ణాకలోని గుల్బర్గాలో నివాసం ఉండగా మిగిలిన వారు ముంబాయిలోని ఇందిరానగరలోని కల్యాణ్ ప్రాంతంలోని రైల్వేస్టేషన్ సమీపంలో నివాసం ఉంటున్నారు. వీరు తరచూ బెంగళూరుకు వచ్చి దొంగతనాలకు పాల్పడేవారు. ఒంటరిగా వెళ్తున్న మహిళలను గుర్తించి తాము పోలీసులమని, దొంగలు ఉన్నారు జాగ్రత్తగా ఉండాలని మాయమాటలు చెబుతారు. అనంతరం వారిని మాటల్లో దింపి వారి వద్ద ఉన్న బంగారు నగలు లాక్కొని ఉడాయిస్తారు.
ఒక్క రోజులో 10కి పైగా వీరు ఈ విధంగా లూటీలు చేసి వాహనంలో ముంబాయి పారిపోయే వారని పోలీసుల విచారణలో బయటపడింది. 2013లో బెంగళూరు న గరంలో నకిలీ పోలీసుల ముసుగులో ఉన్న అసాదుల్లా జాఫరి అలియాస్ ఖాలియా, సమీర్ సద్యద్ అనే ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులకు వారిని విచారణ చేయగా మిగలిన నిందితులపై నిఘా ఉంచి ముంబయిలో అరెస్ట్ చేశామని బెంగళూరు నగర పోలీసు కమిషనర్ ఎం.ఎన్. రెడ్డి చెప్పారు.
నిందితులపై బెంగళూరులో వివిధ పోలీస్ స్టేషన్లలో 60 కేసులు నమోదు అయ్యాయని అన్నారు. బెంగళూరు సహ మంగళూరు, మైసూరు, ఉడిపి, కుందాపుర, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, గోవా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీలో కూడా కేసులు నమోదయ్యాయని, ఈ ఐదుగురు మోస్ట్ వాంటెడ్ క్రిమిన ల్స్ అని రెడ్డి తెలిపారు. సమావేశంలో బెంగళూరు నగర అడిషనల్ పోలీసు కమిషనర్ అలోక్ కుమార్తో సహ సీనియర్ పోలీసు అధికారులు పాల్గొన్నారు.