jagadesh
-
బీఆర్ఎస్ Vs కాంగ్రెస్.. నేతల మధ్య పొలిటికల్ వార్
సాక్షి, సూర్యాపేట: తెలంగాణ పొలిటికల్ వాతావరణం మరోసారి హీటెక్కింది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ నేతలు పార్టీలపై విమర్శలు చేస్తున్నారు. తాజాగా కాంగ్రెస్‌ను మంత్రి జగదీశ్ రెడ్డి విమర్శించగా.. బీజేపీ, బీఆర్ఎస్ను కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు. ఇక, మంత్రి జగదీష్ రెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ హామీలన్నీ భోగస్. ఆచారణ సాధ్యం కాని హమీలను తెలంగాణ ప్రజలు నమ్మరు. కాంగ్రెస్ నాయకుల మాటలు సినిమా పాత్రల్లో వేసే బఫ్యూన్ల పాత్రలాగా ఉన్నాయి. కాంగ్రెస్ నాయకులు రాసి ఇచ్చిన స్క్రిప్టును సోనియా, రాహుల్ చదివి వినిపించారు. హామీలు నెరవేర్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి లేదు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి హామీలు ఇవ్వలేదు. కర్ణాటక పరిస్థితేంటి? గతంలో 2 లక్షల రుణమాఫీ అన్నా ప్రజలు నమ్మలేదు. అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇవ్వకుండా ఇక్కడికి వచ్చి మాట్లాడితే తెలంగాణ ప్రజలు నమ్మరు. తెలంగాణతో సమానంగా బడ్జెట్ ఉన్న కర్ణాటకలో రైతుబంధు ఎందుకు ఇవ్వట్లేదు. తెలంగాణ ప్రజలకు కేసీఆర్ మీద ఉన్న నమ్మకం కాంగ్రెస్ నాయకులపై లేదు. ఇచ్చిన హామీలు మాత్రమే కాకుండా ఇవ్వని హామీలను కూడా నెరవేర్చిన ఘనత కేసీఆర్‌కే దక్కింది. కేసీఆర్ హామీలను కాపీ కొట్టి పథకాలు ఇస్తామంటే ప్రజలు నమ్మే స్థితిలో లేరు అంటూ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా ప్లాన్.. మరోవైపు, జగ్గారెడ్డి మాట్లాడుతూ.. మొదటి సారి CWC సమావేశాలు హైదరాబాద్‌లో జరిగాయి. బీఆర్ఎస్కు అండగా బీజేపీ, ఎంఐఎం పనిచేస్తున్నాయని రాహుల్ గాంధీ నిన్నటి సభలో స్పష్టంగా చెప్పారు. ఈ మూడు పార్టీలు కలిసి కాంగ్రెస్‌ను అధికారంలోకి రానివ్వకుండా కుట్రలు చేస్తున్నాయి. దేశ ప్రజలు సంక్షేమం కోసం CWC సమావేశాల్లో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. బీజేపీ మత రాజకీయాలు చేస్తూ దేశాన్ని కలుషితం చేస్తోంది. కాంగ్రెస్ సెక్యూలర్ పార్టీ. అన్ని మతాలకు సమాన గౌరవం ఇస్తుంది. మతాలను రెచ్చగొడుతూ అధికారాన్ని కాపాడుకోవాలని బీజేపీ చూస్తోంది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇది కూడా చదవండి: సోనియా గాంధీ అంటే అభిమానం, గౌరవం: విజయశాంతి కామెంట్స్ -
యూనివర్సిటీలకు అన్నివిధాలా సాయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విద్యార్థులకు ప్రపంచస్థాయి సాంకే తికతను చేరువ చేసేం దుకు కేంద్ర శాస్త్ర, సాంకేతిక విభాగం ముందుకు వచ్చింది. యూనివర్సిటీలకు అన్నివిధాలా సాయం అంది స్తామని యూజీసీ తెలిపింది. రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, వైస్‌చైర్మన్ ప్రొఫెసర్ వి.వెంకటరమణ, ఉస్మానియా వర్సిటీ వీసీ ప్రొఫెసర్ డి.రవీందర్‌ల బృందం గురువారం ఢిల్లీలో యూజీసీ నూతన చైర్మన్ ప్రొఫెసర్ మామిడాల జగదీశ్‌ను కలిసింది. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో తీసుకొస్తున్న మార్పులను, పురోగతిని వివరించారు. రాష్ట్రంలో కొత్తగా ప్రవేశపెట్టిన బీఏ, బీకాం ఆనర్స్ కోర్సుల విషయాన్ని ప్రొఫెసర్ రవీందర్ యూజీసీ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. వర్సిటీలకు అవసరమైన నిధులు ఇవ్వాలని కోరారు. ఫ్యాకల్టీ అభివృద్ధి, విద్యార్థులకు ఉపకార వేతనాలివ్వ డం, పరిశోధన విధానాలను విస్తరింపజేయడంపై విశ్వవిద్యాలయాలు ప్రధానంగా దృష్టి పెట్టాయని ప్రొఫెసర్ వి.వెంకటరమణ యూజీసీ చైర్మన్‌కు వివరించారు. త్వరలో వీసీల సమావేశం ఏర్పాటు చేస్తున్నామని, దానికి ముఖ్య అతిథిగా రావాలని కోరగా యూజీసీ చైర్మన్ అంగీకరించారు. తర్వాత వారు కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం కార్యదర్శి డాక్టర్ శ్రీవారి చంద్రశేఖర్‌తో భేటీ అయ్యారు. అనంతరం సామాజిక న్యాయ, సాధికారిత విభాగం కార్యదర్శి ఆర్.సుబ్రహ్మణ్యంను కలసి రాష్ట్రంలో వివిధ వర్గాల విద్యార్థులకు పోటీ పరీక్షల శిక్షణ కేంద్రాలు, మౌలిక వసతులు, లైబ్రరీ సదుపాయాలపై తోడ్పాటు గురించి చర్చించారు. అనంతరం ఈ సమావేశాల వివరాలను ప్రొఫెసర్ లింబాద్రి మీడియాకు వివరించారు. -
‘షెల్టర్ కల్పిస్తామంటే చర్యలు తప్పవు’
న్యూఢిల్లీ: ఈశాన్య ఢిల్లీలో పౌరసత్వ సరవణ చట్టం (సీఏఏ)కి వ్యతిరేకంగా, అనుకూలంగా జరిగిన అల్లర్లు హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. ఈ అల్లర్లలో 42 మంది మరణించగా, వందకు పైగా క్షతగాత్రులు వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో జేఎన్‌యూ క్యాంపస్‌లో అల్లర్ల బాధితులకు ‘షెల్టర్’ కల్పిస్తామని విద్యార్ధి సంఘాలు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటనలపై విశ్వవిద్యాలయ వీసీ జగదీష్ కుమార్ స్పందించారు. ‘ఢిల్లీలోని ప్రజలు శాంతి, సామరస్యంతో ఉండాలని కోరుకుంటున్నాము. బాధితులకు సాధ్యమైనంత సాయం అందించాలనుకుంటున్నాం. కానీ, క్యాంపస్‌లోని కొన్ని విద్యార్థి సంఘాలు క్యాంపస్‌కు సంబంధంలేని వ్యక్తులకు ‘షెల్టర్’ కల్పిస్తామని ప్రకటిస్తున్నాయి. క్యాంపస్‌కు సంబంధంలేని వ్యక్తులు యూనివర్సిటీలోకి పవేశించటం వల్ల జనవరిలో హింసాత్మక ఆందోళనలు జరిగాయని విద్యార్థులు నిరసనలు తెలిపిన విషయాన్ని వీసీ జగదీష్ కుమార్ గుర్తు చేశారు. (కల్లోలం నుంచి క్రమంగా.. 148 ఎఫ్ఐఆర్లు) అల్లర్లలో బాధపడే వారికి సాయం చేయడం వల్ల ఎలాంటి హాని జరగనప్పటికి విశ్వవిద్యాలయ శాంతి, భద్రతల దృష్ట్యా బాధితులకు ‘షెల్లర్’ ఇవ్వకూడదని ఆయన తెలిపారు. దీనిపై విద్యార్థులు ఎంటువంటి ప్రకటనలు చేయొద్దని ఆయన కోరారు. అదేవిధంగా చట్టపరంగా క్యాంపస్‌లో ‘షెల్టర్’ ఇవ్వాలని ఎటువంటి నిబంధన లేదన్నారు. అయిన్పటికీ విద్యార్థి సంఘాలు యూనివర్సిటి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని వీసీ జగదీష్ కుమార్ తెలిపారు.(ఢిల్లీ అల్లర్లపై అంతర్జాతీయ మీడియా దాడి) -
కార్మిక వ్యతిరేక ప్రభుత్వాల మెడలు వంచుదాం
అనంతపురం రూరల్ : కార్పొరేట్ సంస్థల మాయలోపడి కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తూ.. కార్మిక హక్కులను కాలరాస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచాల్సిన అవసరం ఆసన్నమైందని కార్మిక సంఘాలకు సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్ పిలుపు నిచ్చారు. మేడేను పురస్కరించుకొని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక ఆర్డీఓ కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. రాష్ట్రం ఆర్థికలోటులో ఉందంటూనే రూ. కోట్ల ప్రజాధనాన్ని పర్యటనల పేరుతో వృథాగా ఖర్చు చేయడం ఏంటని ప్రశ్నించారు. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులను సమీక్షల పేరిట మానసిక ఇబ్బందులకు గురి చేయడం తప్ప.. వాటితో ఏం ఒరగబెట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు అధ్యక్ష, కార్యదర్శులు శకుంతలమ్మ, రాజారెడ్డి, సహాయ కార్యదర్శి నారాయణస్వామి, సీపీఐ నగర కార్యదర్శి లింగమయ్య, నాయకులు మల్లికార్జున, నరసింహులు, రామక్రిష్ణ, అల్లీపీరా, పద్మావతి, శ్రీరాములు, ఏఐఎస్ఎఫ్ నాయకులు జాన్సన్, మధు, మనోహర్‌తోపాటు పలువురు పాల్గొన్నారు. -
గుప్త నిధి సొత్తు స్వాధీనం
బెజ్జూర్: వ్యవసాయ భూమిలో ఓ రైతుకు లభ్యమైన గుప్తనిధిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా బెజ్జూర్ మండలం మొర్లిగూడకు చెందిన రైతు జగదీష్ గత ఏడాది తన పొలం దున్నుతుండగా ఓ రాగి పాత్ర లభించింది. అందులో ఏడు గ్రాముల బంగారం, 3 తులాల వెండి ఉన్నాయి. వాటితో ఆయన ఆభరణాలు చేయించుకున్నాడు. ఈ విషయం ఆనోటా ఈనోటా రెవెన్యూ అధికారులు, పోలీసులకు చేరింది. దర్యాప్తులో నిజం నిర్ధారణ కావటంతో గురువారం ఉదయం ఎస్సై రాజు, తహశీల్దార్ సూర్యనారాయణ గ్రామానికి చేరుకున్నారు. రైతు జగదీష్ నుంచి ఆ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వానికి వాటిని అప్పగించనున్నట్లు వారు తెలిపారు. -
నిజామాబాద్ ఎమ్మెల్సీగా భూపతిరెడ్డి ఏకగ్రీవం
నిజామాబాద్: వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ-టీడీపీ ఉమ్మడి అభ్యర్థులకు డిపాజిట్లు దక్కకుండా చేసిన టీఆర్ఎస్.. ఇప్పుడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోలింగ్‌కు ముందే ప్రతిపక్షాన్ని చిత్తు చేసింది. ఇప్పటికే వరంగల్, మెదక్ స్థానాన్ని ఏకగ్రీవంగా కైవసం చేసుకున్న టీఆర్ఎస్.. నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్లో రెండు స్థానాలను ఏకగ్రీవంగా గెలుచుకునేందుకు కసరత్తు చేస్తోంది. మెదక్, నిజామాబాద్‌లో గట్టి పోటీ ఇస్తారని భావించిన కాంగ్రెస్ అభ్యర్థులు శుక్రవారం నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దీంతో ఈ రెండు స్థానాలను టీఆర్ఎస్ ఏకగ్రీవంగా గెలుచుకున్నట్లైంది. శనివారం నామినేషన్ల ఉపసంహరణ పూర్తయ్యే సమయానికి ఐదు స్థానాలను ఏకగ్రీవంగా గెలుచుకోవాలని టీఆర్ఎస్ లక్ష్యంగా పెట్టుకుంది. నాలుగు స్థానాలను గెలుచుకోవడం దాదాపుగా ఖాయమైందని ఆ పార్టీ వర్గాలు చెప్పాయి. దాంతో నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవమైంది. ఇండిపెండెంట్ అభ్యర్థి జగదీష్ నామినేషన్ ఉపసంహరించుకోవడంతో టీఆర్ఎస్ అభ్యర్థి భూపతిరెడ్డి ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. -
బియాస్లో విష్ణువర్ధన్‌రెడ్డి మృతదేహం
హైదరాబాద్ : హిమాచల్ ప్రసాద్ బియాస్ నదిలో సోమవారం మరో విద్యార్థి మృతదేహం లభ్యమైంది. మృతుడు నిజామాబాద్ జిల్లా బోధన్‌కు చెందిన మేడం విష్ణువర్థన్ రెడ్డిగా గుర్తించారు. అతని మృతదేహాన్ని హైదరాబాద్ తరలించనున్నారు. ఇప్పటివరకూ బియాస్ నదిలో 20 మృతదేహాలు లభ్యం అయ్యాయి. ఇంకా గల్లంతు అయిన నలుగురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కాగా బియాస్ నదిలో గల్లంతైన విద్యార్థుల కుటుంబాలకు రూ. 5లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టు ఆదేశించింది. ఈ మొత్తాన్ని జలాశయం నిర్వాహకులు, కళాశాల యాజమాన్యం చెరి సగం చెరి సగం చొప్పున చెల్లించాలని న్యాయస్థానం పేర్కొంది. జూన్ 8వ విహారయాత్రకు వెళ్లిన హైదరాబాద్‌లోని విజ్ఞానజ్యోతి కళాశాలకు చెందిన 24 మంది ఇంజినీరింగ్ విద్యార్థులు బియాస్ నదిలో లార్జి డ్యాం నుంచి ఆకస్మికంగా నీరు వదలడంతో కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే. -
బియాస్లో విగత జీవిగా జగదీష్
హైదరాబాద్ : హిమాచల్ ప్రదేశ్ బియాస్ నదిలో గురువారం మరో మృతదేహం లభ్యమైంది. లభ్యమైన మృతదేహాన్ని హైదరాబాద్‌కు చెందిన జగదీశ్దిగా గుర్తించారు. దాంతో ఇప్పటివరకూ 19 మృతదేహాలు బటయపడ్డాయి. కాగా జగదీష్ ముదిరాజ్ (20) మృతదేహం లభ్యం కావటంతో అతని ఇంటివద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి. విషయం తెలియడంతో కుటుంబ సభ్యులు భోరున విలపించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహ్మత్‌నగర్ డివిజన్లోని బంగారు మైసమ్మ బస్తీలో జగదీష్ తల్లిదండ్రులు నివాసం ఉంటున్నారు. తండ్రి మల్లేష్ కొకొకోలా కంపెనీలో పని చేస్తున్నారు. జగదీష్ రెండో కుమారుడు. క్షేమంగా వస్తాడనుకున్న తమ కుమారుడు విగతజీవిగా మారటంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. బియాస్ నదిలో 24మంది ఇంజినీరింగ్ విద్యార్థులు గల్లంత అయిన విషయం తెలిసిందే. మిగతావారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.