Jagat vikhyath reddy
-
ఐటీ అధికారులుగా ఎలా నటించారంటే..
సాక్షి, హైదరాబాద్: బోయిన్పల్లి కిడ్నాప్ కేసు నిందితులు చాకచక్యంగా తప్పించుకు తిరుగుతున్నారు. ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చి 9 రోజులైంది. పోలీసులు సూత్రధారిని అరెస్టు చేసినా ప్రధాన నిందితులను మాత్రం పట్టుకోలేకపోతున్నారు. పోలీసుల నుంచి త్రుటిలో తప్పించుకుంటూ చుక్కలు చూపిస్తున్నారు. ఈ నెల 5న అర్ధరాత్రి కిడ్నాప్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. వెంటనే స్పందించిన పోలీసులు సూత్రధారి భూమా అఖిలప్రియను అదుపులోకి తీసుకుని బాధితుల్ని విడిపించారు. ఆ తర్వాతి రోజే ఆమెను అరెస్టు చేశారు. అప్పటికే ఈ కేసులో ఆమె భర్త భార్గవ్‌రామ్, అనుచరుడు గుంటూరు శ్రీను కీలకంగా వ్యవహరించారని పోలీసులు గుర్తించారు. అయితే అఖిలప్రియ అరెస్టు తర్వాత మిగిలిన నిందితులు అంతా తమ అదుపులోనే ఉన్నట్లుగా పోలీసులు వ్యవహరించారు. మళ్ళీ ఆదివారం నుంచి వేగంగా స్పందించిన ప్రత్యేక బృందాలు ఆ మరుసటిరోజు అఖిలప్రియ పీఏ బోయ సంపత్, భార్గవ్‌రామ్ పీఏ నాగరదొడ్డి మల్లికార్జున్రెడ్డిలతోపాటు గుంటూరు శ్రీను అనుచరుడు డోర్లు బాల చెన్నయ్యలను పట్టుకున్నారు. చదవండి: ముగిసిన అఖిలప్రియ పోలీస్ కస్టడీ ఈలోపు భార్గవ్‌రామ్, గుంటూరు శ్రీను, అఖిలప్రియ సోదరుడు జగద్విఖ్యాత్‌రెడ్డి తదితరులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. పోలీసుల ఉదాసీనతలను తమకు అనుకూలంగా మార్చుకున్న ఈ నిందితులు ఉత్తరాదికి పారిపోయారు. నిందితులు అప్పటికే నేరచరిత్ర కలిగి ఉండటం, పోలీసుల దర్యాప్తు తీరుతెన్నులపై కొంత అవగాహన కలిగి ఉండటంతో ఎత్తులకు పైఎత్తులు వేస్తూ పారిపోయారు. భార్గవ్‌రామ్ బెంగళూరు నుంచి, గుంటూరు శ్రీను పుణే నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. వీళ్లు బస చేసిన హోటళ్లపై పోలీసులు దాడి చేయడానికి కొద్దిసేపటి ముందే బయటకు జారుకున్నారు. వీరితోపాటు జగద్విఖ్యాత్‌రెడ్డి, చంద్రహాస్ తదితరుల కోసం హైదరాబాద్ పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. చదవండి: అతడి అరెస్టుతో సంచలన విషయాలు వెలుగులోకి కిడ్నాప్ ఎలా జరిగిందంటే.. అఖిలప్రియ పోలీసు కస్టడీ బుధవారంతో ముగిసింది. మూడు రోజులపాటు ఈమెను విచారించిన బోయిన్పల్లి పోలీసులు అనేక కీలకాంశాలు రాబట్టారు. కిడ్నాప్ జరిగినరోజు బా ధితుల ఇంటికి భార్గవ్‌రామ్‌తోపాటు జగద్వి ఖ్యాత్రెడ్డి కూడా వెళ్లినట్లు తేలింది. అపహరణకు ముందు కూకట్‌పల్లిలో ఉన్న పార్థ గ్రాండ్ హోటల్లో భార్గవ్‌రామ్ మిగిలిన నిందితులతో సమావేశం ఏర్పాటు చేశాడు. అక్కడ నుంచి వారిని యూసుఫ్‌గూడలోని ఎంజీఎం ఇంటర్నేషనల్ స్కూల్‌కు తీసుకువచ్చారు. అక్కడి ప్రొజెక్టర్‌లో గ్యాంగ్, స్పెషల్ 26 సినిమాల్లోని కొన్ని సీన్స్ ప్రదర్శించారు. ఐటీ అధికారులుగా ఎలా నటించాలనేది ఆ సీన్ల ద్వారా చూపించారు. అక్కడే అద్దెకు తెచ్చిన పోలీసు దుస్తులు, కొత్తగా ఖరీదు చేసిన ఫార్మల్ డ్రెస్సులను నిందితులు ధరించారు. అక్కడ నుంచి బోయిన్పల్లి వరకు భార్గవ్‌రామ్, జగద్విఖ్యాత్‌రెడ్డి ఒకే వాహనంలో ప్రయాణించారు. కిడ్నాప్ జరిగిన తర్వాత నేరుగా మొయినాబాద్‌లోని ఫామ్‌హౌస్‌కు చేరుకున్న భార్గవ్ అక్కడే బాధితులతో సంతకాలు చేయించాడు. ఈ కేసులో మొత్తం30 మంది ప్రమేయముందని అధికారులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే నలుగురిని అరెస్టు చేశారు. మరో పది మంది అదుపులో ఉండగా మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. -
అతడి అరెస్టుతో సంచలన విషయాలు వెలుగులోకి
సాక్షి, హైదరాబాద్: బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో ఏ1గా ఉన్న టీడీపీ నేత, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సోదరుడు జగత్‌విఖ్యాత్‌రెడ్డి కారు డ్రైవర్ అరెస్టుతో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విచారణలో భాగంగా.. కిడ్నాప్‌లో జగత్‌విఖ్యాత్‌కు ప్రమేయం ఉన్నట్లు అతడు వెల్లడించినట్లు సమాచారం. అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్‌తో పాటు అతడు కూడా.. బాధితుడు ప్రవీణ్‌రావు ఇంట్లోకి ప్రవేశించినట్లు తెలుస్తోంది. ఐటీ అధికారులమంటూ.. వారిని బెదిరించినట్లు సమాచారం. వీరిద్దరు స్పాట్లో ఉండగా... లోథా అపార్ట్మెంట్లో ఉన్న అఖిలప్రియ ఫోన్ చేసి మాట్లాడినట్లు తెలుస్తోంది. అదే విధంగా కిడ్నాప్ తర్వాత.. భార్గవ్, జగత్‌విఖ్యాత్ ఒకే వాహనంలో వెళ్లినట్లు కూడా విచారణలో వెల్లడైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో జగత్ విఖ్యాత్‌ను కూడా ఈ కేసులో నిందితుడిగా చేర్చనున్నట్లు తెలుస్తోంది. (చదవండి: అక్షయ్ సినిమా నుంచి స్ఫూర్తి పొందిన అఖిలప్రియ) మూడోరోజు విచారణ.. 300 ప్రశ్నలు ఈ కేసులో నిందితురాలిగా ఉన్న భూమా అఖిలప్రియ మూడోరోజు విచారణ ముగిసింది. ఈ క్రమంలో.. ఆమె భర్త భార్గవ్‌రామ్ సొంత పాంహౌజ్‌లో.. బాధితుల నుంచి సంతకాలు సేకరించినట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటి వరకు అఖిలప్రియకు 300 ప్రశ్నలు సంధించిన పోలీసులు.. ఈ కేసులో నిందితులైన భార్గవ్‌రామ్, చంద్రహాస్, గుంటూరు శ్రీను ఆచూకీపై ఆరా తీశారు. టెక్నికల్ సాక్ష్యాలను అఖిలప్రియ ముందు ఉంచటంతో.. పలు ప్రశ్నలకు ఆమె సమాధానం దాటవేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. భార్గవ్, గుంటూరు శ్రీను, జగత్ విఖ్యాత్ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. -
పోలీసుల అదుపులో భార్గవ్‌రామ్!?
సాక్షి, హైదరాబాద్: బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో హైదరాబాద్ పోలీసులు పురోగతి సాధించారు. గోవాలో నలుగురు నిందితులను మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. సిద్ధార్థ్‌తో పాటు ముగ్గురిని హైదరాబాద్‌కు తీసుకువస్తున్నారు. అయితే ఈ కేసులో ఏ1 నిందితురాలిగా ఉన్న టీడీపీ నేత, మాజీ మంత్రి అఖిలప్రియ భర్త, నిందితుడు భార్గవ్‌రామ్ ఆచూకీ మాత్రం లభించలేదు. అతడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. బెంగళూరు, చెన్నై, గోవా, ఏపీలో ప్రత్యేక బృందాలు అతడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. ఇక ఈ కేసులో అఖిలప్రియ సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డికి కూడా ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే అతడి కారు డ్రైవర్‌ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం.. భార్గవ్ రామ్, గుంటూరు శ్రీనుతో పాటు మరికొంత మందిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.(చదవండి: కథ.. స్క్రీన్‌ప్లే.. దర్శకత్వం.. అఖిలప్రియ!) ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉంది: డీసీపీ బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితులు పరారీలోనే ఉన్నారని నార్త్‌జోన్ డీసీపీ కల్మేశ్వర్ సింగెన్వర్ తెలిపారు. భార్గవరామ్, గుంటూరు శ్రీను ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా.. న్యాయవాది సమక్షంలో అఖిల ప్రియ విచారణ సాగుతోందన్న డీసీపీ.. రెండో రోజు విచారణ పూర్తయినట్లు వెల్లడించారు. గురువారం మధ్యాహ్నం వరకు అఖిలప్రియ తమ కస్టడీలోనే ఉంటుందని తెలిపారు. ఆమె హెల్త్ కండీషన్ బాగుందని పేర్కొన్నారు. ఇక విచారణలో భాగంగా కొన్ని కాగా కిడ్నాప్ చేయడానికి గల ఉద్దేశంపైనే ప్రధానంగా విచారణ సాగినట్లు సమాచారం. ఈ క్రమంలో నిందితుల సెల్ టవర్ లొకేషన్, కాల్ డేటా వివరాలను పోలీసులు అఖిల ప్రియ ముందు పెట్టినట్లు తెలుస్తోంది. ప్రశ్నలకు మాత్రమే అఖిల ప్రియ జవాబు ఇచ్చారని.. మరికొన్నింటికి గుర్తు లేదంటూ సమాధానం దాట వేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బుధవారం నాటి దర్యాప్తు కీలకంగా మారనుంది. -
అవన్నీ అవాస్తవాలు: భూమా జగత్‌విఖ్యాత్ రెడ్డి
సాక్షి, ఆళ్లగడ్డ: భూ వివాదానికి సంబంధించి టీడీపీ నేత భూమా అఖిలప్రియకు వ్యతిరేకంగా ఆమె సోదరుడు జగత్‌విఖ్యాత్‌రెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. ఇద్దరు అక్కల నుంచి తనకు న్యాయం చేయాలంటూ ఈనెల 14న రంగారెడ్డి జిల్లా అదనపు కోర్డులో కేసు దాఖలు చేసి ప్రతివాదులకు నోటీసులు పంపించారు. భూమా శోభా నాగిరెడ్డి పేరుతో రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం మంచిరేవులలో ఉన్న వెయ్యి గజాల స్థలాన్ని ఆమె మృతి అనంతరం 2016లో దాదాపు రూ.2 కోట్లకు విక్రయించినట్లు సమాచారం. అప్పట్లో భూమా నాగిరెడ్డితోపాటు ఆయన ఇద్దరు కుమార్తెలు ఆఖిలప్రియ, మౌనికారెడ్డి దీనిపై సంతకాలు చేయగా తనయుడు జగత్‌విఖ్యాత్‌రెడ్డి వేలిముద్ర వేశాడు. ప్రస్తుతం ఆ స్థలం విలువ రెట్టింపు అయింది. అయితే స్థలం అమ్మే సమయానికి తాను మైనర్‌నని, తనకు ఏమీ తెలియని వయసులో తండ్రితో పాటు సోదరిలిద్దరూ కలిసి విక్రయించారని, ఇప్పుడు తన వాటాగా మూడో భాగం కావాలని కోరుతూ జగత్‌విఖ్యాత్‌రెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. అక్కలతో పాటు భూమిని కొనుగోలు చేసిన హైదరాబాద్‌కు చెందిన సుధాకర్‌రెడ్డి, వెంకటహరిత చీమల, సుబ్బరాయ ప్రఫుల్ల చందు రేటూరి, సయ్యద్ ఎతేష్యామ్ హుస్సేన్, పశ్చిమ గోదావరికి చెందిన ప్రవీణ రంగోలను ప్రతివాదులుగా పేర్కొన్నాడు. కాగా జగత్‌విఖ్యాత్‌రెడ్డి తరపున అఖిలప్రియ మరిది (భార్గవరామ్ తమ్ముడు) శ్రీసాయి చంద్రహాస్ కేసు వేశారు. అందరూ ఒకే ఇంట్లో ఉంటూ కోర్టును ఆశ్రయించడం పట్ల కొనుగోలుదారులు అఖిలప్రియపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. అయితే తన సోదరుడు తమపై కేసు వేయలేదని అఖిలప్రియ అన్నారు. భూ విక్రయంపై కొనుగోలుదారులు కోర్టుకు వెళ్లారని, అందులో భాగంగా తమకు తాఖీదులు వచ్చాయన్నారు. మరోవైపు జగత్‌విఖ్యాత్‌రెడ్డి తమ కుటుంబంలో ఎలాంటి విభేదాలు లేవంటూ ఓ వీడియో విడుదల చేశారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు అవాస్తవమని, ప్రస్తుతం సోదరి అఖిలప్రియతో కలిసి దుబాయ్‌లో ఉన్నట్లు చెప్పారు. -
భూమా కుమారుడికి త్రుటిలో తప్పిన ప్రమాదం
బేగంపేట,న్యూస్‌లైన్: వైఎస్ఆర్సీపీ ముఖ్యనేత, నంద్యాల అసెంబ్లీ అభ్యర్థి భూమానాగిరెడ్డి కుమారుడు జగత్ విఖ్యాత్‌రెడ్డి త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. వివరాలు... జగత్ విఖ్యాత్‌రెడ్డి బుధవారం సాయంత్రం ఉప్పల్‌లో జరుగుతున్న క్రికెట్మ్యాచ్ చూడడానికి జూబ్లీహిల్స్ నుంచి నిస్సాన్ ఎక్స్‌ట్రయల్ కారు (ఏపీ21ఏఎఫ్09)లో డ్రైవర్‌తో కలిసి బయలుదేరారు. కారు బేగంపేట ఎయిర్పోర్ట్ ఫ్లైఓవర్ దిగుతుండగా రేడియేటర్ నుంచి ఒక్కసారిగా పొగ, మంటలు లేచాయి. అప్రమత్తమైన డ్రైవర్ కారును పక్కనే ఉన్న పోలీస్‌స్టేషన్ సమీపంలో ఆపేశాడు. విఖ్యాత్‌రెడ్డితో పాటు డ్రైవర్ వెంటనే కిందకు దిగారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన వచ్చి మంటలను ఆర్పివేశారు. రేడియేటర్ వేడెక్కడం వల్లనే మంటలు వచ్చినట్లు భావిస్తున్నారు. ఈ ఘటన వల్ల కొద్దిసేపు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. ఇటీవలే రోడ్డు ప్రమాదంలో తల్లి శోభానాగిరెడ్డిని కోల్పోయిన విఖ్యాత్ అదృష్టవశాత్తు త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడని స్థానికులు పేర్కొన్నారు. పోలీసులు వేరే వాహనంలో విఖ్యాత్‌రెడ్డిని అక్కడి నుంచి పంపించివేశారు.