మైత్రీవనం వద్ద అదే సీన్
ఒకే ఒక్క గంట కురిసిన జడివాన అమీర్పేట్ను గడగడలాడించింది. జనసంద్రంగా ఉండే ప్రధాన రహదారి జలసాగరంగా మారిపోయింది. ఎప్పటిలాగానే మైత్రీవనమ్ చౌరస్తా గో‘దారి’ని తలపించింది.
మైత్రీవనం వద్ద భారీగా చేరిన నీటితో ట్రాఫిక్ అస్తవ్యస్తమైంది. దీని ప్రభావం అటు ఎస్ఆర్నగర్, ఇటు పంజగుట్ట జంక్షన్లపై కూడా పడింది. చౌరస్తాలో నిలబడి విధులు నిర్వర్తించేందుకు కూడా ఆస్కారం లేకపోవడంతో ట్రాఫిక్ సిబ్బంది సైతం చేతులెత్తేశారు. వేసవి కాలం ప్రారంభంలో కురిసిన కొద్దిసేపు వర్షానికే మైత్రీవనం చౌరస్తా మునిగిపోవడం వెనుక నాలా పూడికతీత పనులు పూర్తిస్థాయిలో జరగకపోవడమే కారణమని పలువురు పేర్కొంటున్నారు.
గత ఏడాది మైత్రీవనం నుంచి డీకే రోడ్డు మీదుగా లీలానగర్ వరకు సుమారు రూ.26 లక్షల నిధులతో పూడికతీత పనులు చేపట్టారు. వాటిపై అప్పట్లోనే విమర్శలు వెల్లువెత్తాయి. ప్రస్తుతం వాటి పనితీరు ఏ స్థాయిలో ఉందో బయటపడింది. ఫలితంగా ఇక్కడ భారీ పైప్లైన్లు నిర్మించినా ప్రయోజనం లేకపోయింది.