Jalgaon
-
విద్యార్థినిల బట్టలు విప్పించి డ్యాన్స్ చేయించిన ఖాకీలు
ముంబై: అనాథ ఆశ్రమాలు, ప్రభుత్వ వసతి గృహాల్లో ఉండే బాలికలపై జరిగే దారుణాలకు సంబంధించి అప్పుడప్పుడు వార్తలు చదువుతూనే ఉంటాం. తమకంటూ ఎవరు లేని ఈ అభాగ్యుల పట్ల జాలి, దయ చూపాల్సింది పోయి పశువుల్లా ప్రవర్తిస్తారు కొందరు అధికారులు. తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి మహారాష్ట్రలో చోటు చేసుకుంది. రక్షించాల్సిన ఖాకీలే భక్షకులుగా మారారు. పోలీసులు మరి కొందరు వ్యక్తులతో కలిసి ప్రభుత్వ హాస్టల్లో ఉంటున్న కొందరు విద్యార్థినిల చేత అసభ్య కార్యక్రమాలు చేయించారు. బుల్దానా, చిక్లి నియోజక వర్గం బీజేపీ ఎమ్మెల్యే శ్వేతా మహాలే దీని గురించి దిగువ సభలో ప్రస్తావించడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు.. రాష్ట్రంలోని జల్గావ్లో ప్రభుత్వం ఆశాదీప్ మహిళల వసతి గృహాన్ని నిర్వహిస్తోంది. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం కొందరు పోలీసు అధికారులు, మరి కొందరితో కలిసి హాస్టల్‌కి వెళ్లారు. అక్కడున్న విద్యార్థినిలను బెదిరించి వారి బట్టలు విప్పించి.. డ్యాన్స్ చేయించారు. ఈ దారుణం గురించి ఓ ఎన్జీఓకు తెలియడంతో వారు ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో నేడు శ్వేతా మహాలే దీని గురించి దిగువ సభలో ప్రస్తావించారు. ఈ సందర్భంగా శ్వేతా మహాలే మాట్లాడుతూ.. ‘‘ఈ దారుణంలో పోలీసులు కూడా పాలు పంచుకున్నారని తెలిసి సిగ్గుపడుతున్నాము. ఇలాంటి పనులతో రాష్ట్రం పరువు పోతుంది. మహిళలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే వారి పట్ల రాక్షసులుగా మారుతున్నారు. ఇలాంటి బాధితులు చాలా మందే ఉంటారని భావిస్తున్నాం. ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం ”అన్నారు శ్వేతా మహాలే. రాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ ఈ విషయంపై దర్యాప్తునకు ఆదేశించామని తెలిపారు. మహాలే లేవనెత్తిన సమస్యకు సమాధానమిస్తూ దేశ్ ముఖ్ ఈ సంఘటనపై దర్యాప్తు జరిపేందుకు నలుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశామని.. వారు రెండు రోజుల్లో నివేదిక సమర్పించనున్నట్లు తెలిపారు. దారుణం జరిగిన హాస్టల్‌ను మహిళా, శిశు సంక్షేమ శాఖ నిర్వహిస్తుంది. చదవండి: ఇది పశువుల హాస్టల్.. ప్రియుడిని హత్య చేస్తే.. ఓ రాత్రి నీతో గడిపేందుకు ఓకే -
ఘోర రోడ్డు ప్రమాదం: 16 మంది మృతి
సాక్షి, ముంబై: మహారాష్ట్రలో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 16 మంది మరణించినట్లు సమాచారం. జల్గావ్ జిల్లాలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బొప్పాయిలతో వెళ్తున్న ఐషర్ ట్రక్కు జల్గావ్ జిల్లాలోని కింగ్వాన్ వద్ద బోల్తా పడింది. దాంతో ట్రక్కులో ఉన్న కూలీల్లో 16 మంది అక్కడికక్కడే మృతిచెందారు. మరణించిన వారిలో ఏడుగురు పురుషులు, ఆరుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద సమయానికి ట్రక్కులో మొత్తం 21 మంది ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ట్రక్కు బొప్పాయిల లోడుతో ధులే నుంచి చోప్డా మీదుగా రావేర్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తోన్న ట్రక్కు అకస్మాత్తుగా బోల్తా పడి ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు తెలిసింది. ప్రమాదంలో మృతి చెందిన వారంతా రావేర్‌కు చెందిన కూలీలుగా గుర్తించారు. గాయపడిన వారిని జల్గావ్ ఆస్పత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అర్ధరాత్రి ఈ ప్రమాదం జరగడంతో సమాచారం ఆలస్యంగా తెలిసింది. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చదవండి: కావాలనే యాక్సిడెంట్ చేశాడు.. బొటన వేలిని పరీక్షగా చూసి షాక్! -
ఇల్లు చూసుకోమంటే.. చంపేశారు!
సాక్షి, ముంబై: జల్గావ్ జిల్లాలో సంచలనం సృష్టించిన నలుగురు పిల్లల దారుణ హత్య కేసును పోలీసులు ఛేదించారు. దీనికి సంబంధించి నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జల్గావ్ జిల్లా రావేర్ పట్టణానికి ఒక కిలోమీటరు దూరంలో ఉన్న భోర్‌ఖేడా గ్రామ సమీపంలోని ఓ పొలంలో పనులు చేసుకుంటూ మహతాబ్, రుమాలీబాయి బిలాల్ అనే దంపతుల తమ ఐదుగురి పిల్లలతో అక్కడే చిన్న గుడిసె వేసుకుని నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో బిలాల్ దంపతుల బంధువులు దశదిన కర్మలో పాల్గొనేందుకు స్వరాష్ట్రం మధ్యప్రదేశ్‌కు పెద్ద కుమారుడితో పాటు వెళ్లారు. మిగతా పిల్లలను ఇంట్లోనే వదిలేసి వెళ్లారు. మూడేళ్ల వయసున్న చిన్న కుమార్తె, మరో 11 ఏళ్లు, ఎనిమిదేళ్ల వయసున్న ఇద్దరు కుమారులు, 13 ఏళ్ల వయసున్న ఇంకో కుమార్తెను ఇంట్లోనే వదిలేసి వెళ్లారు. ఈ క్రమంలో ఇంట్లో తమ తమ్ముళ్లు, చెల్లెళ్లు ఒక్కరే ఉంటారని, గ్రామానికి ఇల్లు దూరంగా ఉండటంతో వారిని చూసుకోవాలని బిలాల్ పెద్ద కుమారుడు అతని మిత్రులకు చెప్పాడు. ఇదే అదనుగా చూసుకున్న నిందితులు 13 ఏళ్ల వయసున్న బాలికపై కన్నేశారు. మద్యం తాగి వచ్చి బాలికపై అత్యాచారానికి ఒడిగట్టారు. (చదవండి: మిథున్ చక్రవర్తి కుమారుడిపై అత్యాచారం కేసు) విషయం ఎక్కడ బయటపడుతుందోనన్న భయంతో బాలికతో పాటు మిగతా వారిని అతి కిరాతకంగా గొడ్డలితో నరికి చంపి మృతదేహాలను పక్కనే ఉన్న పొలంలో పడేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని డాగ్ స్క్వాడ్ సాయంతో నిందితులు ముఖేశ్ సన్యాల్, రాజు అలియాస్ గుడ్డు, సునీల్ సీతారాంలతో పాటు మరో మైనర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ కేసును ఇంకా లోతుగా దర్యాప్తు చేస్తున్నామని, అంతవరకు ఎలాంటి విషయాలు వెల్లడించలేమని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంలో గొడ్డలి, రక్తంతో తడిసిన నిందితుల దుస్తులు, రెండు నాటుసారా మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బాలికపై సాముహిక అత్యచారం? ఈ ఘటనలో నిందితులు మైనర్ బాలికపై సామూహిక అత్యచారం చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. పోస్టుమార్టంలో మైనర్ బాలికపై అత్యచారం జరిగినట్టు ప్రాథమిక ఆధారాలు లభించాయి. అయితే పూర్తి రిపోర్టు వస్తే ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. రూ.రెండు లక్షల సాయం... - గులాబ్రావ్ పాటిల్, జిల్లా ఇన్చార్జి మంత్రి బాధిత కుటుంబ సభ్యులతో జల్గావ్ ఇంచార్జ్ గులాబ్ రావ్ పాటిల్ భేటీ అయ్యారు. బిలాల్ కుటుంబాన్ని ఓదార్చడంతో పాటు ఆ కుటుంబానికి రూ.2 లక్షల ఆర్థిక సాయం చేశారు. అదవిధంగా ఈ కేసు దర్యాప్తు సరైన దిశలో కొనసాగుతుందని తెలిపారు. దోషులకు కచ్చితంగా శిక్ష పడేలా చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. -
దారుణం.. అసలు చేతులెలా వచ్చాయో
ముంబై: మహారాష్ట్రలో దారుణం చోటు చేసుకుంది. తల్లిదండ్రులు పని నిమిత్తం బయటకు వెళ్లారు.. ఇంట్లో ఉన్న 3 నుంచి 12 సంవత్సరాల వయసు ఉన్న నలుగురు తోబుట్టువులను గొడ్డలితో అతి కిరాతకంగా నరికి చంపారు దుండగులు. వింటినే ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘటన మహారాష్ట్రలోని జల్గావ్లో చోటు చేసుకుంది. వివరాలు.. మధ్యప్రదేశ్‌కి చెందిన మెహతాబ్, రుమాలి భీలాలా దంపతులు పని నిమిత్తం మహారాష్ట్ర, జల్గావ్ బోర్ఖేడా గ్రామానికి వచ్చారు. వీరికి నలుగురు పిల్లలు సైతా (12), రావల్ (11), అనిల్ (8), సుమన్ (3) ఉన్నారు. ఇక్కడ ముస్తఫా అనే వ్యక్తి పొలంలో పనికి కుదిరారు. ఈ నేపథ్యంలో దంపతులు శుక్రవారం పని నిమిత్తం బయటకు వెళ్లారు. కాసేపటికి వీరి ఇంటికి వచ్చిన పొలం యజమాని ముస్తఫా పిల్లలు రక్తపు మడుగులో పడి ఉండటం చూసి తల్లిదండ్రులకు సమాచారం అందించాడు. పోలీసులకు కూడా తెలపడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. (చదవండి: ఏడాదిగా భార్యను టాయిలెట్లో బంధించి..) దర్యాప్తులో భాగంగా పోలీసులు పిల్లల మృతదేహాల దగ్గర ఒక గొడ్డలిని గుర్తించారు. నిందితుడు పిల్లలందరిని ఈ గొడ్డలితో హత్య చేసి ఉండవచ్చిన పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసును దర్యాప్తు చేయడానికి ఒక ఐపీఎస్ అధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు అధికారులు. పోస్ట్‌మార్టం నిమిత్తం చిన్నారుల మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. -
‘వారిని చంపింది కరోనా కాదు’
ముంబై: పూణెలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తున్న హర్షల్ నెహెతే కుటుంబ సభ్యులు చాలా సంతోషంగా ఉన్నారు. ప్రస్తుతం హర్షల్ భార్య డెలివరీ కోసం పుట్టింటికి వెళ్లింది.. త్వరలోనే వారి ఇంటికి మరో చిన్నారి అతిథి రాబోతున్నారు. తన కోసం కుటుంబం అంతా ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తుంది. ఇలాంటి సంతోష సమయంలో బిడ్డ కంటే ముందుగానే పిలవని అతిథిగా కరోనా వారి ఇంటికి వచ్చింది. ముందుగా హర్షల్ తండ్రి తులసిరామ్‌కి కరోనా సోకింది. అతడిని నాసిక్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగానే ఉంది. తండ్రి ఆరోగ్యానికి డోకా లేదు అనుకునే లోపు నాయనమ్మ మాలతి నెహెతేకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఆమెను జల్గావ్ సివిల్ ఆస్పత్రిలో చేర్చారు. అయితే ఈ నెల 2 నుంచి ఆమె కనిపించడం లేదని ఆస్పత్రి సిబ్బంది హర్షల్‌కు సమాచారం అందించారు. (వూహాన్‌ను అధిగమించిన ముంబై) నాయనమ్మ గురించి ఆందోళన పడుతుండగానే మరో పిడుగులాంటి వార్త తెలిసింది. తల్లి టీనా నెహెతేకు కరోనా పాజిటివ్‌గా తెలిసింది. ఆమెను కూడా జల్గావ్ సివిల్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. 6 గంటలపాటు ఎదురు చూసినా ఐసీయూ బెడ్ లభించకపోవడంతో బుధవారం టీనా మరణించారు. ఈ దుఖంలో ఉండగానే మరో విషాదకర వార్త తెలిసింది. గత ఎనిమిది రోజులుగా కనిపించకుండా పోయిన మాలతి నెహెతే మృతదేహం సగం కుళ్లిపోయిన స్థితిలో జల్గావ్ ఆస్పత్రి బాత్రూమ్లో వెలుగు చూసింది. బుధవారం టాయిలెట్‌కు వెళ్లిన ఓ కోవిడ్ పేషెంట్ పక్క బాత్రూం నుంచి భరించలేనంత దుర్గంధం వెలువడుతుందని ఫిర్యాదు చేయడంతో.. సిబ్బంది తలుపులు పగలగొట్టి చూడగా మాలతి మృతదేహం బయటపడింది. అంటే గత 8 రోజులుగా సిబ్బంది ఎవరూ ఆస్పత్రి మరుగుదొడ్లను శుభ్రం చేయలేదని తెలుస్తోంది. (కరోనా భయం.. మానవత్వం దూరం) అయితే మాలతి కంటే ముందు ఈ ఆస్పత్రిలో ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్న మరో ముగ్గురు కోవిడ్ రోగులు మరుగుదొడ్డికి వెళ్లేందుకు ప్రయత్నిస్తూ ప్రాణాలు విడిచినట్లు రికార్డులు తెలుపుతున్నాయి. ఈ క్రమంలో సిబ్బంది నిర్లక్క్ష్యం పట్ల ఆందోళన వ్యక్తమవుతుండటంతో రాష్ట్ర వైద్య విద్య కార్యదర్శి సంజయ్ ముఖర్జీ, జల్గావ్ డీన్ డాక్టర్ బి ఎస్ ఖైరేతో సహా మరో ఐదుగురు అధికారులను సస్పెండ్ చేశారు. సమగ్ర విచారణకు ఆదేశించారు. ఇదిలా ఉండగా చనిపోయిన తల్లి, నాయనమ్మలకు అంత్యక్రియలు నిర్వహించేందుకు ఒక్కరు కూడా తోడు లేరంటూ హర్షల్ విచారం వ్యక్తం చేస్తున్నాడు. తన తల్లి, నాయనమ్మలను చంపింది కరోనా కాదని.. వైద్య సౌకరర్యాల కొరత, అధికారుల నిర్లక్క్ష్యం వల్లే వారు మరణించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. -
రైల్లోనుంచి మహిళను తోసేసిన టీటీఈ
జల్గావ్: ఏసీ రైలు ఎక్కబోతున్న ఓ ప్రయాణికురాలిని టీటీఈ తోసివేయడంతో ఆమె మృతిచెందిందన్న ఆరోపణలపై కేసు నమోదైంది. పోలీసులు అందించిన వివరాల్లోకెళ్తే... రైలు ఎక్కబోతున్న తన అత్త ఉజ్వల పాండే(38)ను టీటీఈ సంపత్ సాలుంఖే రైల్లో నుంచి తోసివేశాడని, దీంతో ఆమె మృతిచెందిందని ఆరోపిస్తూ రాహుల్ పురోహిత్ అనే వ్యక్తి ప్రభుత్వ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముంబై హెడ్‌క్వార్టర్స్ ఉద్యోగిగా, ఎల్టీటీ-రాజేంద్రనగర్ పాట్నా ఎక్స్‌ప్రెస్(13202) ఏసీ రైల్లో టీటీఈగా సాలుంఖే విధులు నిర్వర్తిస్తున్నారు. పిటిషన్లో పురోహిత్ చేసిన ఫిర్యాదు ప్రకారం.. ఖాండ్వాకు వెళ్లేందుకు తన కూతురు పాలక్‌తో కలిసి ఏబీ బోగీని ఎక్కేందుకు ఉజ్వలపాండే ప్రయత్నిస్తుండగా టీటీఈ సాలుంఖే ఆమెను అడ్డుకున్నారు. అంతట్లోనే రైలు కదలడంతో ఎక్కడ ట్రెయిన్ మిస్ అవుతుందోననే కంగారులో మళ్లీ బోగీలోకి ఎక్కేందుకు ప్రయత్నించడగా సాలుంఖే ఆమెను తోసివేశాడు. దీంతో ఆమె ప్లాట్‌ఫామ్‌కు, రైలుకు మధ్య ఉన్న ఖాళీ స్థలంలో నుంచి కింద పడిపోయింది. రైలు ఆమెపైనుంచి దూసుకుపోవడంతో అక్కడికక్కడే మరణించింది. ఆ సమయంలో టీటీఈ తాగిన మత్తులో ఉన్నాడు. ఉజ్వల రైలుకింద పడిన విషయాన్ని గమనించిన సాలుంఖే వెంటనే కోచ్ లోపలికి వెళ్లి దాక్కునే ప్రయత్నం చేశాడు. ప్యాంట్రీ కార్లో దాక్కున్న ఆయనను ప్రయాణికులు బయటకు తీసుకొచ్చి రైల్వే పోలీసులకు అప్పగించారు. ఇదిలాఉండగా పురోహిత్ ఫిర్యాదు మేరకు సాలుంఖేపై భారత శిక్షాస్మృతి, సెక్షన్ 304 ప్రకారం కేసు నమోదు చేశామని, అతణ్ని అరెస్టు చేశామని రైల్వే పోలీసులు తెలిపారు. కాగా ఉజ్వల రెండో తరగతి టికెట్ కొని, మొదటి తరగతిలో ఎక్కేందుకు ప్రయత్నించడంతోనే టీటీఈ అడ్డుకున్నాడని, అయినప్పటికీ ఆమె ఎక్కేం దుకు ప్రయత్నించడంతోనే ఈ ప్రమాదం సంభవించిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.