సాక్షి, ముంబై: మహారాష్ట్రలో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 16 మంది మరణించినట్లు సమాచారం. జల్గావ్ జిల్లాలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బొప్పాయిలతో వెళ్తున్న ఐషర్ ట్రక్కు జల్గావ్ జిల్లాలోని కింగ్వాన్ వద్ద బోల్తా పడింది. దాంతో ట్రక్కులో ఉన్న కూలీల్లో 16 మంది అక్కడికక్కడే మృతిచెందారు. మరణించిన వారిలో ఏడుగురు పురుషులు, ఆరుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద సమయానికి ట్రక్కులో మొత్తం 21 మంది ఉన్నట్టు పోలీసులు తెలిపారు.
ట్రక్కు బొప్పాయిల లోడుతో ధులే నుంచి చోప్డా మీదుగా రావేర్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తోన్న ట్రక్కు అకస్మాత్తుగా బోల్తా పడి ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు తెలిసింది. ప్రమాదంలో మృతి చెందిన వారంతా రావేర్‌కు చెందిన కూలీలుగా గుర్తించారు. గాయపడిన వారిని జల్గావ్ ఆస్పత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.
ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అర్ధరాత్రి ఈ ప్రమాదం జరగడంతో సమాచారం ఆలస్యంగా తెలిసింది. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
చదవండి: కావాలనే యాక్సిడెంట్ చేశాడు..
బొటన వేలిని పరీక్షగా చూసి షాక్!
Comments
Please login to add a commentAdd a comment