జల్గావ్: ఏసీ రైలు ఎక్కబోతున్న ఓ ప్రయాణికురాలిని టీటీఈ తోసివేయడంతో ఆమె మృతిచెందిందన్న ఆరోపణలపై కేసు నమోదైంది. పోలీసులు అందించిన వివరాల్లోకెళ్తే... రైలు ఎక్కబోతున్న తన అత్త ఉజ్వల పాండే(38)ను టీటీఈ సంపత్ సాలుంఖే రైల్లో నుంచి తోసివేశాడని, దీంతో ఆమె మృతిచెందిందని ఆరోపిస్తూ రాహుల్ పురోహిత్ అనే వ్యక్తి ప్రభుత్వ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముంబై హెడ్‌క్వార్టర్స్ ఉద్యోగిగా, ఎల్‌టీటీ-రాజేంద్రనగర్ పాట్నా ఎక్స్‌ప్రెస్(13202) ఏసీ రైల్లో టీటీఈగా సాలుంఖే విధులు నిర్వర్తిస్తున్నారు. పిటిషన్‌లో పురోహిత్ చేసిన ఫిర్యాదు ప్రకారం.. ఖాండ్వాకు వెళ్లేందుకు తన కూతురు పాలక్‌తో కలిసి ఏబీ బోగీని ఎక్కేందుకు ఉజ్వలపాండే ప్రయత్నిస్తుండగా టీటీఈ సాలుంఖే ఆమెను అడ్డుకున్నారు.
అంతట్లోనే రైలు కదలడంతో ఎక్కడ ట్రెయిన్ మిస్ అవుతుందోననే కంగారులో మళ్లీ బోగీలోకి ఎక్కేందుకు ప్రయత్నించడగా సాలుంఖే ఆమెను తోసివేశాడు. దీంతో ఆమె ప్లాట్‌ఫామ్‌కు, రైలుకు మధ్య ఉన్న ఖాళీ స్థలంలో నుంచి కింద పడిపోయింది. రైలు ఆమెపైనుంచి దూసుకుపోవడంతో అక్కడికక్కడే మరణించింది. ఆ సమయంలో టీటీఈ తాగిన మత్తులో ఉన్నాడు. ఉజ్వల రైలుకింద పడిన విషయాన్ని గమనించిన సాలుంఖే వెంటనే కోచ్ లోపలికి వెళ్లి దాక్కునే ప్రయత్నం చేశాడు.
ప్యాంట్రీ కార్‌లో దాక్కున్న ఆయనను ప్రయాణికులు బయటకు తీసుకొచ్చి రైల్వే పోలీసులకు అప్పగించారు. ఇదిలాఉండగా పురోహిత్ ఫిర్యాదు మేరకు సాలుంఖేపై భారత శిక్షాస్మృతి, సెక్షన్ 304 ప్రకారం కేసు నమోదు చేశామని, అతణ్ని అరెస్టు చేశామని రైల్వే పోలీసులు తెలిపారు. కాగా ఉజ్వల రెండో తరగతి టికెట్ కొని, మొదటి తరగతిలో ఎక్కేందుకు ప్రయత్నించడంతోనే టీటీఈ అడ్డుకున్నాడని, అయినప్పటికీ ఆమె ఎక్కేం దుకు ప్రయత్నించడంతోనే ఈ ప్రమాదం సంభవించిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
రైల్లోనుంచి మహిళను తోసేసిన టీటీఈ
Published Thu, May 29 2014 10:36 PM | Last Updated on Sat, Sep 2 2017 8:02 AM
Advertisement