‘సాక్షి, హైదరాబాద్: రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్.. జనరల్ రైల్వే పోలీసులు.. చేతుల్లో ఆయుధాలు. రాష్ట్ర, కేంద్ర ఇంటలిజెన్స్ నుంచి ముందస్తు హెచ్చరికలు.. స్వయంగా సికింద్రాబాద్‌లోనే జీఆర్‌పీ ఎస్పీ కార్యాలయం.. 24 గంటలు షిఫ్టులవారీగా పోలీసులభద్రత. అనుక్షణం నిఘాకళ్లతో చూపులు, ప్రయాణికులు, రైల్వేఆస్తులకు ఇబ్బంది కలగకుండా చూసే వ్యవస్థ తీరు ఇదీ! కానీ, వందలమంది యువకులు సికింద్రాబాద్ స్టేషన్ పరిసరాల్లోకి ముందురోజు రాత్రే చేరుకున్నా ఈ నిఘా కళ్లేవీ పసిగట్టలేదు.
ఉదయం వీరు గుంపులుగా స్టేషన్‌లోకి చొచ్చుకొని వచ్చినా కీడు శంకించలేదు. యువకులు ఇష్టంవచ్చినట్టు విధ్వంసం చేస్తుంటే పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించారు. నిఘాసంస్థల హెచ్చరికలు లేనప్పటికీ, దేశంలోని ఇతర ప్రాంతాల్లో విధ్వంసం జరుగుతున్న నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలన్న ప్రాథమిక విషయాన్ని కూడా రైల్వే అధికారులు విస్మరించటం గమనార్హం.
అప్పుడు విధుల్లో 80 మంది పోలీసులే?
సికింద్రాబాద్ స్టేషన్‌లో 50 మంది ఆర్‌పీఎఫ్, 30 మంది జీఆర్‌పీ సిబ్బంది విధుల్లో ఉంటారు. శుక్రవారం ఉదయం ఆర్మీ అభ్యర్థులు వేలల్లో తరలివచ్చాక జరిగిన విధ్వంసం సమయంలోనూ 80 మంది సిబ్బంది ఉన్నట్టు తెలుస్తోంది. ఆర్‌పీఎఫ్‌కు సంబంధించి దాదాపు రెండున్నర వేలమంది అందుబాటులో ఉండి కూడా, ముందస్తుగా రప్పించి మోహరించాలన్న ఆదేశాలు రాలేదు.
ఆందోళనకారులు స్టేషన్ ముందువైపు తొలుత కొంత సేపు ఆందోళన చేపట్టిన తరుణంలో ఓ ఆర్టీసీ బస్సుపై దాడి జరిగింది. ఆ సమయంలో కూడా రైల్వేభద్రత వ్యవస్థ మేల్కొనలేకపోయింది. రైళ్లు, రైల్వే ఆస్తుల పరిరక్షణ బాధ్యత పూర్తిగా ఆర్‌ఫీఎఫ్‌దే. ఇతర శాంతిభద్రతల అంశాన్ని జీఆర్‌పీ చూస్తుంది. ఈ రెండు విభాగాలు నిరంతరం సమన్వయంతో పనిచేసుకోవాల్సి ఉంటుంది.
అయితే దాడికి సంబంధించి ఆర్‌పీఎఫ్‌కు ఎలాంటి నిఘా హెచ్చరికలు అందలేదని రైల్వే అధికారులు చెబుతున్నారు. కాగా, సికింద్రాబాద్ ఘటనపై రైల్వేశాఖ అంతర్గత విచారణకు ఆదేశించినట్టు సమాచారం. సికింద్రాబాద్ స్టేషన్‌పై దాడి జరగ్గానే కాచిగూడ, హైదరాబాద్ స్టేషన్‌ల చుట్టూ భద్రతవలయాన్ని ఏర్పాటు చేశారు. వరంగల్, కాజీపేట లాంటి అన్ని స్టేషన్లలో అదనపు బలగాలను ఏర్పాటు చేశారు.
ఇంతకూ నష్టమెంత..
ఆందోళనకారులు కనిపించిన ఆస్తిని ధ్వంసం చేయటమే లక్ష్యంగా రైల్వేస్టేషన్‌లోనికి ప్రవేశించారు. ఆందోళనకారులు ఉదయం 9 గంటల సమయంలో లోనికి వెళ్లేటప్పటికి ఎనిమిది ప్లాట్‌ఫామ్స్‌పై రైళ్లున్నాయి. రాజ్‌కోట్, ఈస్ట్‌కోస్ట్, అజంతా రైళ్లకు సంబంధించి ఐదు కోచ్‌లకు నిరసనకారులు నిప్పు పెట్టారు. ఇవి నాన్ ఏసీ జనరల్ సెకండ్ క్లాస్ సిట్టింగ్ కోచ్‌లు.
ఇవన్నీ ఒక్కోటి రూ.2 కోట్ల ఖరీదైన్ ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు. దహనం చేసిన వాటిల్లో రెండు సరుకురవాణా (పార్శిల్) వ్యాన్‌లు కూడా ఉన్నాయి. ఒకదానిలో హౌరాకు తరలిస్తున్న చేపల లోడ్ ఉండగా, మరో దానిలో ద్విచక్రవాహనాలు, ఇతర వస్తువులు ఉన్నాయి. ఒక ఎంఎంటీఎస్ సహా ఆరు లోకోమోటివ్ (ఇంజిన్ కోచ్‌లు)లను రాళ్లతో పాక్షికంగా ధ్వంసం చేశారు.
30 ఏసీ కోచ్‌లు, 47 నాన్ ఏసీ కోచ్‌ల్లో విధ్వంసం చోటుచేసుకుంది. 4,500 బెడ్‌రోల్స్ తగులబెట్టారు. రైళ్లకు సంబంధించి రూ.3.30 కోట్ల నష్టం వాటిల్లినట్టు దక్షిణ మధ్య రైల్వే మెకానికల్ డిపార్ట్‌మెంట్ ప్రాథమిక నివేదిక రూపొందించింది. ఇక దహనమైన సరుకు, దుకాణాల విలువను కూడా లెక్కించాల్సి ఉంది. సీసీ టీవీ కెమెరాలు, ప్రకటన టీవీలు, ఫ్యాన్లు, లైట్లు, సరుకు తరలించే కార్లు, బల్లలు, వస్తువులు విక్రయించే స్టాళ్లు.. ఇలా కనిపించినవన్నీ ధ్వంసం చేశారు. పూర్తిగా లెక్కగట్టేందుకు ఓ కమిటీని నియమించారు. ఇక నష్టం విలువ రూ.ఏడు కోట్ల వరకు ఉండొచ్చని, వాస్తవ లెక్కలు పూర్తి పరిశీలన తర్వాత తెలుస్తుందని సికింద్రాబాద్ డీఆర్‌ఎం విలేకరులకు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment