GRP
-
బెంగాల్ రైలు ప్రమాదం కేసులో ఊహించని మలుపు
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ కాంచన్‌జంగా రైలు ప్రమాదం కేసు ఊహించని మలుపు తిరిగింది. ఈ యాక్సిడెంట్లో ఇప్పటిదాకా పది మంది మరణించగా.. 40 మందికిపైగా గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఈ ప్రమాదంపై ఫిర్యాదు చేసిన ప్రయాణికురాలు మాట మార్చారు. అసలు తాను ఫిర్యాదే చేయలేదని బాంబ్ పేల్చారు.బెంగాల్ రైలు ప్రమాదంపై జల్పాయ్గురి రైల్వే పోలీసులు(GRP) మంగళవారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. లోకో పైలట్, కో-పైలట్ నిరక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని చెబుతూ.. చైతలి మజుందార్ అనే ప్రయాణికురాలు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ‘‘రైలు రంగపాణి-నిజ్బరి స్టేషన్ల మధ్య ఉండగా.. హఠాత్తుగా కుదుపులకు లోనైంది. మా బోగీలో ఉన్నవాళ్లమంతా అంతా చెల్లాచెదురుగా పడిపోయారు. ఈలోపు స్థానికులు తీవ్రంగా గాయపడిన మమ్మల్ని బయటకు తీశారు. బయటకు వచ్చి చూస్తే మా రైలును వెనుక నుంచి గూడ్స్ ఢీ కొట్టింది. బోగీలు చెల్లాచెదురుగా పడిపోయి ఉన్నాయి. చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకెళ్లే క్రమంలోనూ కొందరు చనిపోయారు. పైలట్-లోకో పైలట్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నా’’ అని ఫిర్యాదులో ఉంది. అయితే ఈ ప్రమాదంలో లోకో పైలట్ మరణించగా.. లోకో పైలట్ తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నాడు. మరోవైపు చైతలి ఫిర్యాదు ఆధారంగానే ఇండియన్ రైల్వేస్ యాక్ట్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు పోలీసులు. ఈలోపే ఆమె ట్విస్ట్ ఇచ్చారు. తాను అసలు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని ఆమె మీడియా ముందుకు వచ్చారు. జీఆర్పీ అధికారులు ఓ తెల్లకాగితంపై తనతో సంతకం చేయించుకున్నారని.. దానినే ఫిర్యాదులేఖగా మార్చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేశారని ఆమె ఆరోపించారు. అయితే మజుందార్ ఆరోపణలపై పోలీసులు స్పందించాల్సి ఉంది. -
రైళ్లలో నకిలీ టీసీలు
చీరాల: రైళ్లలో దోపిడీ దొంగలే కాదు.. టీసీల పేరుతో కొత్త రకం దోపిడీలకు పాల్పడుతున్నారు. టికెట్ లేని ప్రయాణికులు, రిజర్వేషన్ స్లీపర్, ఏసీ బోగీల్లో అనుమతి లేకుండా ఎక్కిన వారే వీరి టార్గెట్. మెడలో ఒక నకిలీ రైల్వే ఐడీ కార్డు, నకిలీ రశీదు బుక్‌తో చూడడానికి నిజమైన టికెట్ కలెక్టర్లా మాట్లాడుతూ టికెట్ తీసుకోని ప్రయాణికులకు జరిమానాలు విధిస్తూ కొత్త రకం దోపిడీకి పాల్పడుతున్నారు. వీరందరూ విజయవాడ నుంచి నెల్లూరు వరకు రైళ్లలో సంచరిస్తూ ముందస్తుగా అనుకున్న రైళ్లలోనే వెళుతుంటారు. ఎవరికీ అనుమానం రాకుండా ప్రవర్తిస్తూ జరిమానాలు విధిస్తూ అడ్డంగా దోచుకుంటున్నారు. అతడే కీలకం బాపట్ల జిల్లా భట్టిప్రోలుకు చెందిన ఉప్పు సాయి ప్రసాద్ తెనాలిలో ఉంటున్నాడు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్మరానికి చెందిన జి.గణేష్, వరంగల్ జిల్లా నెక్కొండ మండలం గొడ్లకొండ గ్రామానికి చెందిన బొంతా కళ్యాణ్, మహబూబాబాద్ జిల్లా నెల్లికోడూరు మండలం పెద్దతండాకు చెందిన బి.ప్రవీణ్ వద్ద లక్ష రూపాయలు తీసుకుని నకిలీ పోస్టింగ్ ఆర్డర్లు ఇవ్వడమే కాకుండా వారిని తనతో ఉంచుకుని విజయవాడ– నెల్లూరు మధ్య రైళ్లలో టీసీలుగా అవతారమెత్తించాడు. రోజూ అతడే డ్యూటీలు వేయించి ఏ రైలు ఎక్కాలో చెప్పేవాడు. రైళ్లలో టికెట్ లేనివారిని గుర్తించి వారి నుంచి జరిమానాలు వసూలు చేయించేవాడు. జరిమానాల సొమ్మును భారీగా తీసుకునేవాడని తెలిసింది. ముందుగా అనుకున్న రైళ్లలోనే టీసీలుగా వెళ్లి టికెట్ తీసుకోని ప్రయాణికుల వద్ద నుంచి జరిమానాలు వసూలు చేస్తున్నారు. విజయవాడ నుంచి నెల్లూరు రైల్వేస్టేషన్ల మధ్య అనుకున్న రైల్వేస్టేషన్లలో దిగి మరో రైలు ఎక్కుతూ జరిమానాలు విధిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో మంగళవారం కృష్ణా ఎక్స్‌ప్రెస్‌లో చీరాలకు వచ్చిన వారు చీరాల రైల్వేస్టేషన్లో అసలు టీసీకి దొరికిపోయారు. టీసీలా వ్యవహరిస్తున్న వారిపై అనుమానం రావడంతో ముగ్గురిని జీఆర్పీ పోలీసులకు అప్పగించారు. దీంతో జీఆర్పీ పోలీసులు విచారించగా సాయి ప్రసాద్ బాగోతం బయటపడింది. సాయి ప్రసాద్ వలే విజయవాడలో ఇదే తరహాలో మరో వ్యక్తి దందా సాగిస్తున్నట్లు బాధితులు తెలిపారు. ఈ విషయమై జీఆర్పీ ఎస్ఐ కొండయ్యను ‘సాక్షి’ వివరణ కోరగా పట్టుబడిన ముగ్గురు మైనర్లు కావడంతో వారికి 41 నోటీసులిచ్చినట్టు తెలిపారు. వ్యవహారంపై విచారణ జరుగుతోందని, దర్యాప్తు పూర్తయ్యాక పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. -
దొందూ దొందే!
‘సాక్షి, హైదరాబాద్: రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్.. జనరల్ రైల్వే పోలీసులు.. చేతుల్లో ఆయుధాలు. రాష్ట్ర, కేంద్ర ఇంటలిజెన్స్ నుంచి ముందస్తు హెచ్చరికలు.. స్వయంగా సికింద్రాబాద్‌లోనే జీఆర్పీ ఎస్పీ కార్యాలయం.. 24 గంటలు షిఫ్టులవారీగా పోలీసులభద్రత. అనుక్షణం నిఘాకళ్లతో చూపులు, ప్రయాణికులు, రైల్వేఆస్తులకు ఇబ్బంది కలగకుండా చూసే వ్యవస్థ తీరు ఇదీ! కానీ, వందలమంది యువకులు సికింద్రాబాద్ స్టేషన్ పరిసరాల్లోకి ముందురోజు రాత్రే చేరుకున్నా ఈ నిఘా కళ్లేవీ పసిగట్టలేదు. ఉదయం వీరు గుంపులుగా స్టేషన్లోకి చొచ్చుకొని వచ్చినా కీడు శంకించలేదు. యువకులు ఇష్టంవచ్చినట్టు విధ్వంసం చేస్తుంటే పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించారు. నిఘాసంస్థల హెచ్చరికలు లేనప్పటికీ, దేశంలోని ఇతర ప్రాంతాల్లో విధ్వంసం జరుగుతున్న నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలన్న ప్రాథమిక విషయాన్ని కూడా రైల్వే అధికారులు విస్మరించటం గమనార్హం. అప్పుడు విధుల్లో 80 మంది పోలీసులే? సికింద్రాబాద్ స్టేషన్లో 50 మంది ఆర్పీఎఫ్, 30 మంది జీఆర్పీ సిబ్బంది విధుల్లో ఉంటారు. శుక్రవారం ఉదయం ఆర్మీ అభ్యర్థులు వేలల్లో తరలివచ్చాక జరిగిన విధ్వంసం సమయంలోనూ 80 మంది సిబ్బంది ఉన్నట్టు తెలుస్తోంది. ఆర్పీఎఫ్కు సంబంధించి దాదాపు రెండున్నర వేలమంది అందుబాటులో ఉండి కూడా, ముందస్తుగా రప్పించి మోహరించాలన్న ఆదేశాలు రాలేదు. ఆందోళనకారులు స్టేషన్ ముందువైపు తొలుత కొంత సేపు ఆందోళన చేపట్టిన తరుణంలో ఓ ఆర్టీసీ బస్సుపై దాడి జరిగింది. ఆ సమయంలో కూడా రైల్వేభద్రత వ్యవస్థ మేల్కొనలేకపోయింది. రైళ్లు, రైల్వే ఆస్తుల పరిరక్షణ బాధ్యత పూర్తిగా ఆర్‌ఫీఎఫ్‌దే. ఇతర శాంతిభద్రతల అంశాన్ని జీఆర్పీ చూస్తుంది. ఈ రెండు విభాగాలు నిరంతరం సమన్వయంతో పనిచేసుకోవాల్సి ఉంటుంది. అయితే దాడికి సంబంధించి ఆర్పీఎఫ్కు ఎలాంటి నిఘా హెచ్చరికలు అందలేదని రైల్వే అధికారులు చెబుతున్నారు. కాగా, సికింద్రాబాద్ ఘటనపై రైల్వేశాఖ అంతర్గత విచారణకు ఆదేశించినట్టు సమాచారం. సికింద్రాబాద్ స్టేషన్‌పై దాడి జరగ్గానే కాచిగూడ, హైదరాబాద్ స్టేషన్ల చుట్టూ భద్రతవలయాన్ని ఏర్పాటు చేశారు. వరంగల్, కాజీపేట లాంటి అన్ని స్టేషన్లలో అదనపు బలగాలను ఏర్పాటు చేశారు. ఇంతకూ నష్టమెంత.. ఆందోళనకారులు కనిపించిన ఆస్తిని ధ్వంసం చేయటమే లక్ష్యంగా రైల్వేస్టేషన్‌లోనికి ప్రవేశించారు. ఆందోళనకారులు ఉదయం 9 గంటల సమయంలో లోనికి వెళ్లేటప్పటికి ఎనిమిది ప్లాట్‌ఫామ్స్‌పై రైళ్లున్నాయి. రాజ్‌కోట్, ఈస్ట్‌కోస్ట్, అజంతా రైళ్లకు సంబంధించి ఐదు కోచ్‌లకు నిరసనకారులు నిప్పు పెట్టారు. ఇవి నాన్ ఏసీ జనరల్ సెకండ్ క్లాస్ సిట్టింగ్ కోచ్‌లు. ఇవన్నీ ఒక్కోటి రూ.2 కోట్ల ఖరీదైన్ ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు. దహనం చేసిన వాటిల్లో రెండు సరుకురవాణా (పార్శిల్) వ్యాన్లు కూడా ఉన్నాయి. ఒకదానిలో హౌరాకు తరలిస్తున్న చేపల లోడ్ ఉండగా, మరో దానిలో ద్విచక్రవాహనాలు, ఇతర వస్తువులు ఉన్నాయి. ఒక ఎంఎంటీఎస్ సహా ఆరు లోకోమోటివ్ (ఇంజిన్ కోచ్‌లు)లను రాళ్లతో పాక్షికంగా ధ్వంసం చేశారు. 30 ఏసీ కోచ్‌లు, 47 నాన్ ఏసీ కోచ్‌ల్లో విధ్వంసం చోటుచేసుకుంది. 4,500 బెడ్‌రోల్స్ తగులబెట్టారు. రైళ్లకు సంబంధించి రూ.3.30 కోట్ల నష్టం వాటిల్లినట్టు దక్షిణ మధ్య రైల్వే మెకానికల్ డిపార్ట్మెంట్ ప్రాథమిక నివేదిక రూపొందించింది. ఇక దహనమైన సరుకు, దుకాణాల విలువను కూడా లెక్కించాల్సి ఉంది. సీసీ టీవీ కెమెరాలు, ప్రకటన టీవీలు, ఫ్యాన్లు, లైట్లు, సరుకు తరలించే కార్లు, బల్లలు, వస్తువులు విక్రయించే స్టాళ్లు.. ఇలా కనిపించినవన్నీ ధ్వంసం చేశారు. పూర్తిగా లెక్కగట్టేందుకు ఓ కమిటీని నియమించారు. ఇక నష్టం విలువ రూ.ఏడు కోట్ల వరకు ఉండొచ్చని, వాస్తవ లెక్కలు పూర్తి పరిశీలన తర్వాత తెలుస్తుందని సికింద్రాబాద్ డీఆర్ఎం విలేకరులకు తెలిపారు. -
ఒక్క ట్వీట్‌తో 26 మంది బాలికలకు విముక్తి
సాక్షి, న్యూఢిల్లీ: సోషల్ మీడియా పుణ్యమా అని 26 మంది మైనర్ బాలికలు అక్రమ రవాణా ముఠా నుంచి సురక్షితంగా బయటపడ్డారు. ఓ ప్రయాణికుడు చేసిన ట్వీట్‌పై స్పందించిన జీఆర్పీ, ఆర్పీఎఫ్ భద్రతా దళాలు సత్వరం రంగంలోకి దిగి బాలికలను రక్షించాయి. మజఫర్ నగర్-బాంద్రాల మధ్య నడిచే అవధ్ ఎక్స్‌ప్రెస్‌లో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలు.. అవధ్ ఎక్స్‌ప్రెస్ ‘ఎస్ 5’ భోగిలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి.. ‘పక్క భోగిలో దాదాపు 25 మంది బాలికలు ఉన్నారు. వారంతా ఏడుస్తూ.. భయం భయంగా దిక్కులు చూస్తున్నారు. బహుశా వారిని బలవంతంగా ఎక్కడికో తరస్తున్నార’ని రైల్వే భద్రతా దళానికి ట్వీట్ చేశాడు. సమాచారం అందుకున్న ఉన్నాతాధికారులు వెంటనే కాపతాన్‌గంజ్‌లో ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులను రంగంలోకి దించారు. సివిల్ దుస్తుల్లో ఉన్న ఇద్దరు ఆర్పీఎఫ్ జవాన్లు బాలికలు ఉన్న భోగిలో ప్రవేశించి గోరఖ్‌పూర్ వరకు కాపలాగా వెళ్లారు. అక్కడే మాటువేసిన మిగతా పోలీసులు బాలికలను రక్షించారు. వారిని బలవంతంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. ఈ రెస్క్యూ ఆపరేషన్ ట్వీట్ అందిన 30 నిమిషాల్లో పూర్తవడం విశేషం. 26 మంది బాలికలను రక్షించామనీ, వారంతా బిహార్‌లోని చంపారన్‌కు చెందిన వారని పోలీసులు వెల్లడించారు. బాలికలను నర్‌కాథిక్యాగంజ్ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని ఈద్గా ప్రాంతానికి తరలిస్తున్నారని తెలిపారు. బాలికలు దగ్గర నుంచి మరిన్నివివరాలు తెలియాల్సి ఉందన్నారు. వారిని బాలికా సంరక్షణ కమిటీకి అప్పగించామన్నారు. పిల్లలంతా 10 నుంచి 14 ఏళ్ల లోపు వారు కావడం గమనార్హం. -
రైల్వేస్టేషన్లో టీటీఈపై జీఆర్పీ దాడి
తాటిచెట్లపాలెం : విల్లుపురం సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో టీటీఈగా విధులు నిర్వహిస్తున్న బి.కిరణ్ సాగర్‌పై బరంపురంలో గవర్నమెంటు రైల్వే పోలీసులు దాడి చేసి గాయపరి చారు. బరంపురం రైల్వేస్టేషన్లో తీవ్ర గాయాలపాలైన టీటీఈ బి.కిరణ్ సాగర్‌ను తోటి టీటీఈలు ఆస్పత్రిలో చేర్చారు. బాధిత టీటీఈ బి.కిరణ్ సాగర్, తోటి టీటీఈలు అందించిన సమాచారం ప్రకారం... సోమవారం రాత్రి విల్లుపురం సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో ఖుర్దా నుంచి విశాఖపట్నం వరకు టీటీఈగా బి.కిరణ్ సాగర్ (విశాఖపట్నం) విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఖుర్దా నుంచి బయలుదేరిన ఎక్స్‌ప్రెస్‌లో యూనిఫాం లేకుండా ఉన్న ఓ జీఆర్పీ పోలీసును టీటీఈ కిరణ్ టికెట్ అడిగారు. దీంతో ఆ వ్యక్తి తాను పోలీసునని బదులివ్వగా ఐడీ కార్డు చూపించాలని టీటీఈ కిరణ్ అడిగారు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అంతలో సరిగ్గా రాత్రి 11 గంటలకు రైలు బరంపురం స్టేషన్ 2వ ఫ్లాట్ఫాంపైకి వచ్చి అగింది. ఆ సమయంలో మరో 5గురు జీఆర్పీ పోలీసులు యూనిఫాం లేకుండా వచ్చి ట్రైన్లో ప్రయాణిస్తున్న జీఆర్పీ పోలీసును కలిశారు. అనంతరం అందరూ కలిసి టీటీఈ కిరణ్ సాగర్‌పై దాడి చేసి గాయపరిచారు. సమాచారం అందుకున్న తోటి టీటీఈలు గాయాలపాలైన కిరణ్ సాగర్‌ను తొలుత రైల్వే ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స చేయించి మెరుగైన చికిత్స కోసం విశాఖపట్నం తరలించారు. జీఆర్పీ ఐఐసీ సస్పెన్షన్ భువనేశ్వర్ : టికెట్ లేని ప్రయాణం చేసిన ప్రభుత్వ రైల్వే పోలీసు ఇన్స్పెక్టర్ ఇన్చార్జిపై సస్పెన్షన్ వేటు వేశారు. బరంపురం ప్రభుత్వ రైల్వే పోలీస్‌స్టేషన్ ఇన్స్పెక్టర్ ఇన్చార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్న రాజేంద్ర కుమార్ ముండాని విధుల నుంచి స స్పెండ్ చేసినట్లు ఒడిశా పోలీసు ప్రధాన కార్యాలయం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. -
ముంబై రైల్వే ట్రాక్‌లపై 3వేల మంది మృతి
ముంబై: ముంబై మెట్రోపాలిటన్ సిటీలోని సబ్-అర్బన్ సహా వివిధ రైలు మార్గాల్లో 2017 సంవత్సరంలో జరిగిన ప్రమాదాల్లో మూడువేలమందిపైగా ప్రయాణికులు మృతిచెందినట్లు రైల్వే శాఖ తెలిపింది. పశ్చిమ, సెంట్రల్, హార్బర్, సబ్ అర్బన్ మార్గాల్లో వీరు చనిపోయినట్లు నగరానికి చెందిన సమాచార కార్యకర్త సమీర్ జవేరి దాఖలు చేసిన పిటిషన్‌కు ప్రభుత్వ రైల్వే పోలీసులు సమాధానమిచ్చారు. 1651మంది పట్టాలు దాటుతూ రైళ్లు ఢీకొని మృతిచెందారని, 654మంది నడుస్తున్న రైళ్ల నుంచి జారిపడి మృతిచెందారని పేర్కొన్నారు. ఆత్మహత్యలకు పాల్పడడం, రైళ్ల నుంచి జారి పడడం, రైళ్లు ఢీకొని మృతిచెందడం వంటి మూడు కారణాలతో ఇంతమంది చనిపోతున్నారని, వీటిలో ఆత్మహత్యలను నివారించలేమని, మిగతా రెండింటిని నిరోధించగలమని సెంట్రల్ రైల్వే జీఆర్పి ఏసీపీ మచ్చీంద్ర చవాన్ చెప్పారు. అత్యంత రద్దీగా ఉండే ఛత్రపతి శివాజి మహరాజ్ టెర్మినస్(సీఎస్ఎంటీ), దాదర్, బైకుల్లా స్టేషన్లు ఉన్న సెంట్రల్ లైన్లో1534మంది చనిపోయారని తెలిపారు. కాగా, వెస్టర్న్ లైన్లో 1540మంది గాయపడ్డారని, 1435మంది సెంట్రల్ లైన్లో, 370మంది హార్బర్ లైన్లో గాయపడ్డారని ఆ నివేదిక పేర్కొంది. ఈ విధంగా రోజుకు 9మంది చనిపోతున్నారని, దీన్ని నివారించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు వివిధ ప్రదేశాల్లో ప్రచార కార్యక్రమాలు చేపట్టామని ఏసీపీ వివరించారు. -
జీఆర్పీలో గొంతు కోసుకున్న దొంగ
రైల్వేగేట్ : వరంగల్ రైల్వేస్టేషన్‌లోని జీఆర్పీలో మంగళవారం ఉదయం ఓ నిందితుడు గొంతు కోసుకున్న సంఘటన కలకలం రేపింది. జీఆర్పీ సీఐ స్వామి కథనం ప్రకారం.. వరంగల్ నగరంలోని పోచమ్మమైదాన్‌లోని వాసవీ కాలనీలోగల లక్ష్మి మెస్ అండ్ పేయింగ్ గెస్ట్ హాస్టల్లో ఐదుగురు వ్యక్తులు ఉంటున్నారు. అదే హాస్టల్‌కు వారం రోజుల క్రితం హైదరాబాద్ ఈసీఐఎల్ ప్రాంతానికి చెందిన వారణాసి అజయ్ వచ్చాడు. మంగళవారం తెల్లవారుజామున 4 గంటలకు అజయ్ ఎవరికీ చెప్పకుండా మిగతా ఐదుగురి బ్యాగులు, వారి సెల్ఫోన్లు తీసుకుని వరంగల్ రైల్వేస్టేషన్‌కు వచ్చాడు. గమనించిన మిగతా ఐదుగురు వెంటనే వరంగల్ రైల్వేస్టేషన్‌కు వచ్చారు. అక్కడ వారిని చూసిన అజయ్ పుష్పుల్ రైలు ఎక్కాడు. వారు కూడా రైలు ఎక్కడంతో అతడు వెంటనే రైలు నుంచి దూకేశాడు. వారు అతడిని పట్టుకుని వరంగల్ జీఆర్పీ తీసుకొచ్చారు. జరిగిన సంఘటనను పోలీసులకు వివరించగా వారు అజయ్‌ని మట్టెవాడ రైల్వేస్టేషన్‌కు తరలించే క్రమంలో ఒక్కసారిగా అతడు తన వద్ద ఉన్న పదునైన ఇనుప ముక్కతో గొంతు కోసుకున్నాడు. వెంటనే అతడిని ఎంజీఎం ఆస్పత్రికి తరలించినట్లు సీఐ స్వామి వివరించారు. పేయింగ్ గెస్ట్ హాస్టల్ నుంచి బ్యాగులు, సెల్ఫోన్లు అపహరించిన కేసు మట్టెవాడ రైల్వేస్టేషన్లో అజయ్‌పై నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం అజయ్‌కి ఎలాంటి ప్రాణహానీ లేదని సీఐ చెప్పారు. -
రైలులో ప్రయాణికుడిపై హిజ్రాల దాడి
కాజీపేట రూరల్: అండమాన్ ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణిస్తున్న ఒక ప్రయాణికుడిపై హిజ్రాలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. హిజ్రాల దాడిలో గాయాలపాలైన ప్రయాణికుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాజీపేట జీఆర్పీ ఎస్సై పి.దయాకర్ కథనం ప్రకారం.. ఉత్తరప్రదేశ్ అలహాబాద్‌కు చెందిన ఓంప్రకాష్ జైశ్వాల్ వస్త్ర వ్యాపారం చేస్తున్నాడు. వ్యాపార నిమిత్తం నాగపూర్ నుంచి ఒంగోలుకు అండమాన్ ఎక్స్‌ప్రెస్ రైలులో బయల్దేరాడు. జమ్మికుంటలో ఈ రైలులోకి ఎక్కిన హిజ్రాలు ఓం ప్రకాష్ ను డబ్బులు ఇవ్వమని అడగగా ఇవ్వకపోవడంతో అతడిని కాళ్లతో తన్ని కిటికి వద్దకు నెట్టేశారు. దీంతో అతడికి తలకు తీవ్రగాయాలై రక్త స్రావం జరిగింది. హిజ్రాలు కాజీపేట–వరంగల్ మధ్య దిగి పరారయ్యారు. కాజీపేట జీఆర్పీ పోలీసులు ఓం ప్రకాష్‌ను ఆస్పతికి పంపించారు. పరారైన హిజ్రాల కోసం గాలిస్తున్నారు. -
రైల్లోనుంచి మహిళను తోసేసిన టీటీఈ
జల్గావ్: ఏసీ రైలు ఎక్కబోతున్న ఓ ప్రయాణికురాలిని టీటీఈ తోసివేయడంతో ఆమె మృతిచెందిందన్న ఆరోపణలపై కేసు నమోదైంది. పోలీసులు అందించిన వివరాల్లోకెళ్తే... రైలు ఎక్కబోతున్న తన అత్త ఉజ్వల పాండే(38)ను టీటీఈ సంపత్ సాలుంఖే రైల్లో నుంచి తోసివేశాడని, దీంతో ఆమె మృతిచెందిందని ఆరోపిస్తూ రాహుల్ పురోహిత్ అనే వ్యక్తి ప్రభుత్వ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముంబై హెడ్‌క్వార్టర్స్ ఉద్యోగిగా, ఎల్టీటీ-రాజేంద్రనగర్ పాట్నా ఎక్స్‌ప్రెస్(13202) ఏసీ రైల్లో టీటీఈగా సాలుంఖే విధులు నిర్వర్తిస్తున్నారు. పిటిషన్లో పురోహిత్ చేసిన ఫిర్యాదు ప్రకారం.. ఖాండ్వాకు వెళ్లేందుకు తన కూతురు పాలక్‌తో కలిసి ఏబీ బోగీని ఎక్కేందుకు ఉజ్వలపాండే ప్రయత్నిస్తుండగా టీటీఈ సాలుంఖే ఆమెను అడ్డుకున్నారు. అంతట్లోనే రైలు కదలడంతో ఎక్కడ ట్రెయిన్ మిస్ అవుతుందోననే కంగారులో మళ్లీ బోగీలోకి ఎక్కేందుకు ప్రయత్నించడగా సాలుంఖే ఆమెను తోసివేశాడు. దీంతో ఆమె ప్లాట్‌ఫామ్‌కు, రైలుకు మధ్య ఉన్న ఖాళీ స్థలంలో నుంచి కింద పడిపోయింది. రైలు ఆమెపైనుంచి దూసుకుపోవడంతో అక్కడికక్కడే మరణించింది. ఆ సమయంలో టీటీఈ తాగిన మత్తులో ఉన్నాడు. ఉజ్వల రైలుకింద పడిన విషయాన్ని గమనించిన సాలుంఖే వెంటనే కోచ్ లోపలికి వెళ్లి దాక్కునే ప్రయత్నం చేశాడు. ప్యాంట్రీ కార్లో దాక్కున్న ఆయనను ప్రయాణికులు బయటకు తీసుకొచ్చి రైల్వే పోలీసులకు అప్పగించారు. ఇదిలాఉండగా పురోహిత్ ఫిర్యాదు మేరకు సాలుంఖేపై భారత శిక్షాస్మృతి, సెక్షన్ 304 ప్రకారం కేసు నమోదు చేశామని, అతణ్ని అరెస్టు చేశామని రైల్వే పోలీసులు తెలిపారు. కాగా ఉజ్వల రెండో తరగతి టికెట్ కొని, మొదటి తరగతిలో ఎక్కేందుకు ప్రయత్నించడంతోనే టీటీఈ అడ్డుకున్నాడని, అయినప్పటికీ ఆమె ఎక్కేం దుకు ప్రయత్నించడంతోనే ఈ ప్రమాదం సంభవించిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.