చీరాల: రైళ్లలో దోపిడీ దొంగలే కాదు.. టీసీల పేరుతో కొత్త రకం దోపిడీలకు పాల్పడుతున్నారు. టికెట్ లేని ప్రయాణికులు, రిజర్వేషన్ స్లీపర్, ఏసీ బోగీల్లో అనుమతి లేకుండా ఎక్కిన వారే వీరి టార్గెట్. మెడలో ఒక నకిలీ రైల్వే ఐడీ కార్డు, నకిలీ రశీదు బుక్‌తో చూడడానికి నిజమైన టికెట్ కలెక్టర్‌లా మాట్లాడుతూ టికెట్ తీసుకోని ప్రయాణికులకు జరిమానాలు విధిస్తూ కొత్త రకం దోపిడీకి పాల్పడుతున్నారు. వీరందరూ విజయవాడ నుంచి నెల్లూరు వరకు రైళ్లలో సంచరిస్తూ ముందస్తుగా అనుకున్న రైళ్లలోనే వెళుతుంటారు. ఎవరికీ అనుమానం రాకుండా ప్రవర్తిస్తూ జరిమానాలు విధిస్తూ అడ్డంగా దోచుకుంటున్నారు.
అతడే కీలకం
బాపట్ల జిల్లా భట్టిప్రోలుకు చెందిన ఉప్పు సాయి ప్రసాద్ తెనాలిలో ఉంటున్నాడు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్మరానికి చెందిన జి.గణేష్, వరంగల్ జిల్లా నెక్కొండ మండలం గొడ్లకొండ గ్రామానికి చెందిన బొంతా కళ్యాణ్, మహబూబాబాద్ జిల్లా నెల్లికోడూరు మండలం పెద్దతండాకు చెందిన బి.ప్రవీణ్ వద్ద లక్ష రూపాయలు తీసుకుని నకిలీ పోస్టింగ్ ఆర్డర్లు ఇవ్వడమే కాకుండా వారిని తనతో ఉంచుకుని విజయవాడ– నెల్లూరు మధ్య రైళ్లలో టీసీలుగా అవతారమెత్తించాడు.
రోజూ అతడే డ్యూటీలు వేయించి ఏ రైలు ఎక్కాలో చెప్పేవాడు. రైళ్లలో టికెట్ లేనివారిని గుర్తించి వారి నుంచి జరిమానాలు వసూలు చేయించేవాడు. జరిమానాల సొమ్మును భారీగా తీసుకునేవాడని తెలిసింది. ముందుగా అనుకున్న రైళ్లలోనే టీసీలుగా వెళ్లి టికెట్ తీసుకోని ప్రయాణికుల వద్ద నుంచి జరిమానాలు వసూలు చేస్తున్నారు. విజయవాడ నుంచి నెల్లూరు రైల్వేస్టేషన్ల మధ్య అనుకున్న రైల్వేస్టేషన్లలో దిగి మరో రైలు ఎక్కుతూ జరిమానాలు విధిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు.
ఈ క్రమంలో మంగళవారం కృష్ణా ఎక్స్‌ప్రెస్‌లో చీరాలకు వచ్చిన వారు చీరాల రైల్వేస్టేషన్‌లో అసలు టీసీకి దొరికిపోయారు. టీసీలా వ్యవహరిస్తున్న వారిపై అనుమానం రావడంతో ముగ్గురిని జీఆర్పీ పోలీసులకు అప్పగించారు. దీంతో జీఆర్పీ పోలీసులు విచారించగా సాయి ప్రసాద్ బాగోతం బయటపడింది. సాయి ప్రసాద్ వలే విజయవాడలో ఇదే తరహాలో మరో వ్యక్తి దందా సాగిస్తున్నట్లు బాధితులు తెలిపారు.
ఈ విషయమై జీఆర్పీ ఎస్‌ఐ కొండయ్యను ‘సాక్షి’ వివరణ కోరగా పట్టుబడిన ముగ్గురు మైనర్లు కావడంతో వారికి 41 నోటీసులిచ్చినట్టు తెలిపారు. వ్యవహారంపై విచారణ జరుగుతోందని, దర్యాప్తు పూర్తయ్యాక పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment