కామన్ సివిల్ కోడ్ కుదరదు
– ట్రిపుల్ తలాక్ సమస్య ప్రభుత్వ సృష్టి
– జేఐహెచ్ జాతీయ సలహా మండలి సభ్యుడు అమీనుల్ హసన్
కర్నూలు (ఓల్డ్‌సిటీ): ‘మనది భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశమని, ఎవరి మతాచారాలు వారవి ఇక్కడ కామన్ సివిల్ కోడ్ అమలు కుదరదు’ అని జమాతే ఇస్లామీ హింద్ (జేఐహెచ్) జాతీయ సలహా మండలి సభ్యుడు అమీనుల్ హసన్ పేర్కొన్నారు. ముస్లిం పర్సనల్‌లా జాగృతి ఉద్యమంలో భాగంగా జేఐహెచ్ జిల్లా శాఖ శుక్రవారం సాయంత్రం పాతబస్తీలోని అమాన్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన గొప్ప బహిరంగ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతకు ముందు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రిపుల్ తలాక్‌తో ముస్లిం మహిళలకు ఎలాంటి సమస్య లేదని, అయితే ప్రభుత్వమే సమస్యను సృష్టిస్తుందని తెలిపారు.
విడాకుల సమస్య ముస్లింలకు 0.5 శాతం ఉండగా హిందూవులకు 3.7 శాతంగా ఉందని వివరించారు. ఇస్లాం ధర్మంలో షరియత్లోని అంశాలను మార్చే అధికారం ఎవరికీ ఉండదన్నారు. ఈ విషయం ప్రస్తుతం తరం యువకులకు తెలియదని, వారందరికి అవగాహన కల్పించేందుకే ముస్లిం పర్సనల్‌లా జాగృతి ఉద్యమం చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. అనంతరం దంపతులు వివాహ బంధాన్ని ఎలా కొనసాగించాలనే అంశాన్ని వివరించారు. కార్యక్రమంలో ఏపీ కార్యదర్శి, క్యాంప్ కన్వీనర్ మౌలానా సయ్యద్ ఇమ్దాదుల్లా హుసేని నిజామి, ప్రభుత్వ ఖాజీ సయ్యద్ సలీం బాష ఖాద్రి, అహ్లెహదీస్ ఖాజీ ముతహ్హర్ జామయీ, ముఫ్తి సయ్యద్ ఆరిఫ్‌పాషా ఖాద్రి, మౌలానాలు మాట్లాడారు. కార్యక్రమంలో జేఐహెచ్ జిల్లా ఆర్గనైజర్ చాంద్‌బాష, నగర ప్రచార కార్యదర్శి సైఫుద్దీన్, సభ్యుడు ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు.