యూపీఏలో అవినీతి మంత్రులున్నారు కానీ...
విజయనగరం: బీజేపీ నేత కావూరి సాంబశివరావు సంచలన వ్యాఖ్యలకు తెర తీశారు. గతంలో 10 ఏళ్లు పాటు సాగిన యూపీఏ ప్రభుత్వంలో అవినీతి మంత్రులు ఉన్నారని ఆరోపించారు. కానీ ప్రస్తుతం ఎన్డీఏ హయాంలోని మోదీ ప్రభుత్వంలో అలాంటి మంత్రులు లేరని తెలిపారు. మోదీ దేశ ప్రధానిగా పాలన పగ్గాలు చేపట్టి మంగళవారానికి ఏడాది పూర్తి అయింది. ఈ నేపథ్యంలో బీజేపీ దేశవ్యాప్తంగా జన కల్యాణ్ పర్వ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది.
ఈ సందర్భంగా బుధవారం విజయనగరంలో జరిగిన కార్యక్రమంలో కావూరి సాంబశివరావు పాల్గొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కచ్చితంగా ఇచ్చి తీరాలని ఆయన ఈ సందర్బంగా మోదీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాగా 2009 ఏలూరు లోక్సభ నియోజకవర్గం నుంచి గెలుపొందిన కావూరి సాంబశివరావు ... యూపీఏ ప్రభుత్వ హయాం 2009 - 2014 మధ్య కాలంలో అంటే 2013లో కేంద్ర జౌళీ శాఖ మంత్రిగా పని చేసిన సంగతి తెలిసిందే.