విజయమెవరిదో!
కృష్ణా మిల్క్ యూనియన్‌లో మళ్లీ ఆధిపత్య పోరు
చైర్మన్ పదవి కోసం రెండు వర్గాల పోటీ
3 డెరైక్టర్ పదవులకు 10 మంది నామినేషన్లు
25న ఓటింగ్
విజయవాడ : కృష్ణా మిల్క్ యూనియన్‌లో ఆధిపత్య పోరు మరోసారి తీవ్రరూపం దాల్చింది. చైర్మన్ మండవ జానకిరామయ్యను పదవి నుంచి తప్పించి ఆ సీట్లో కూర్చునేందుకు ప్రత్యర్థి వర్గీయులు పావులు కదుపుతున్నారు. జానకిరామయ్య కూడా తన పదవిని కాపాడుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కృష్ణా మిల్క్ యూనియన్‌లో ఈ నెలాఖరుకు మూడు డెరైక్టర్(ఇద్దరు పురుషులు, ఒక మహిళ) పదవులు ఖాళీ అవుతాయి. వాటిని భర్తీ చేసేందుకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నెల 25న ఓటింగ్ నిర్వహించనున్నారు. మూడు స్థానాలను దక్కించుకుని చైర్మన్ పదవిని పొందాలని ప్రత్యర్థి వర్గీయులు, తన పదవిని కాపాడుకునేందుకు జానకిరామయ్య ఎవరికి వారే ఎత్తులు వేస్తున్నారు. దీంతో విజయం ఎవరికి దక్కుతుందోనని టీడీపీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది.
టీడీపీ అధిష్టానం వద్ద గత ఏడాది ఒప్పందం..
జానకిరామయ్యను తప్పించి ఆయన స్థానంలో గన్నవరం మాజీ దాసరి బాలవర్ధనరావును నియమించేందుకు టీడీపీలోని ఓ వర్గం గతేడాది ప్రయత్నించింది. జానకిరామయ్య వ్యూహాత్మకంగా వ్యవహరించడంతో పంచాయితీ టీడీపీ అధిష్టానం వద్దకు చేరింది. అప్పట్లో చైర్మన్‌గా మండవ కొనసాగేలా, బాలవర్ధనరావు కేవలం డెరైక్టర్ పదవితోనే సరిపెట్టుకునేలా ఒప్పందం కుదిరింది. అయితే, ఏడాది తర్వాత బాలవర్ధనరావును చైర్మన్‌ను చేయాలని అప్పట్లో నిర్ణయించారు. ఈ మేరకు ప్రస్తుతం మండవ చైర్మన్ పదవి నుంచి తప్పుకోవాల్సి ఉంది. కానీ, ఆయన ఇందుకు సముఖంగా లేనట్లు సమాచారం. దీంతో ప్రస్తుతం జానకిరామయ్య వర్గానికే చెందిన మూడు డెరైక్టర్ పోస్టులు ఖాళీ అవుతున్నాయి. ఎలాగైనా వాటిని దక్కించుకుని చైర్మన్ పదవి పొందాలని దాసరి వర్గం ప్రయత్నిస్తోంది. దీంతో ఈ ఎన్నికలకు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
దాసరి వర్గం నుంచి ఏడుగురు..మండవ వర్గం నుంచి ముగ్గురు..
విజయవాడ పాలప్రాజెక్టు ఆవరణలోని క్షీరదర్శిని సమావేశ మందిరంలో శుక్రవారం నామినేషన్ పత్రాలను స్వీకరించారు. జానకిరామయ్య వర్గానికి చెందిన బీవీకే సుబ్బారావు, జాస్తి రాధాకృష్ణ, యెర్నేని గీతాదేవి నామినేషన్లు దాఖలు చేశారు. దాసరి వర్గానికి చెందిన వేమూరి సాయి వెంకటరమణ, యార్లగడ్డ శ్యామ్‌బాబు, లింగం ఉషారాణి, శ్రీపద్మ, శ్రీనివాసరావు, పెద్ద రంగమ్మ, ఎ.బాబు నామినేషన్లు వేశారు. ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తున్న అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఆఫ్ కో-ఆరపరేటివ్ సొసైటీస్ రిటైర్డ్ అధికారి ఎల్.గురునాథం నామినేషన్ పత్రాలను స్వీకరించారు. ఈ నెల 25వ తేదీ ఉదయం ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ ఎన్నికలో 435 మంది సభ్యులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
మొత్తం 15 డెరైక్టర్లకు గానూ, ప్రస్తుతం మూడు పోస్టులకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. జానకిరామయ్య వర్గం నుంచి ఒక్కరు గెలిచినా ఆయన చైర్మన్ పదవిలోనే కొనసాగే అవకాశం ఉంది. టీడీపీ నేతలు కూడా మండవకు అనుకూలంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. మండవ వ్యతిరేక వర్గం నుంచి ముగ్గురు గెలిస్తే దాసరి చైర్మన్ అయ్యే అవకాశం ఉంది.