‘గులాబీ’ గూటికి జనార్దన్‌గౌడ్ ?
ఎల్లారెడ్డి టౌన్, న్యూస్‌లైన్ : కాంగ్రెస్ పార్టీతో రెండు దశాబ్దాల అనుబంధాన్ని తెంచుకున్న ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జనార్దన్ గౌడ్ గులాబీ గూటికి చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి నేరెళ్ల ఆంజనేయులుతోపాటు నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు, కార్యకర్తలు సై తం ఆయన వెంట సాగనున్నట్లు సమాచారం.
జనార్దన్ గౌడ్ ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా ఉంటూ వస్తున్నారు. ఆయన 1999, 2004, 2008, 2009 ఎన్నికల్లో పోటీ చేశారు. 2008 ఉప ఎన్నికలో గెలిచారు. ఈ ఎన్నికల్లోనూ తనకే టికెట్టు వస్తుందని ఆశించారు. అయితే అనూహ్యంగా నల్లమడుగు సురేందర్‌ను పార్టీ తెరపైకి తేవడంతో అవాక్కయ్యారు. నియోజకవర్గంలో ఐదుగురు సీనియర్లు ఉండగా కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి టికెట్ కేటాయించడాన్ని నిరసిస్తూ పార్టీకి మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు.
స్వతంత్ర అభ్యర్థిగా జనార్దన్‌గౌడ్ నామినేషన్ వేసినా.. శనివారం ఉపసంహరించుకున్నారు. తమకు కాదని పార్టీలోకి కొత్తగా వచ్చిన వ్యక్తికి టికెట్టు ఇచ్చిన అధిష్టానానికి బుద్ధి చెప్పాలని సీనియర్లు నిర్ణయించుకున్నారు. టీఆర్ఎస్లో చేరి కాంగ్రెస్న ఓడించాలన్న లక్ష్యంతో వారు ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ విషయమై మాజీ మంత్రి నేరెళ్లతో కలిసి ప్రణాళిక రూపొందించినట్లు తెలుస్తుంది. రెండు రోజుల్లో కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరతారని సమాచారం.
వారిస్తున్న మరికొందరు..
ఇన్నాళ్లు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ టీఆర్ఎస్కు వ్యతిరేకంగా పని చేశామని, ఇప్పుడు అదే పార్టీ లో చేరడం బాగుండదని కొందరు నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. దీంతో రాజకీయాలకు దూరంగా ఉండాలని కొందరు ఆలోచిస్తున్నారు. పలువురు కార్యకర్త లు, నాయకులు మాత్రం బీజేపీలోకి వెళ్దామని సూచించినట్లు తెలిసింది. ఏ పార్టీలోనూ చేరొద్ద ని, కాంగ్రెస్ తమకు చేసిన మోసాలను ప్రజ లకు వివరిద్దామని ఇంకొందరు సూచించినట్లు సమాచారం. ఏ విషయమై రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.