ఆందోళన వద్దు
= బియ్యం ధరలపై ముఖ్యమంత్రి భరోసా
= త్వరలో లెవీ సమస్య పరిష్కరిస్తాం
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్ర వ్యాప్తంగా బియ్యం మిల్లుల యజమానులు నిరవధిక సమ్మెకు దిగినప్పటికీ, బియ్యం ధర పెరగకుండా అన్ని చర్యలూ చేపడతామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య భరోసా ఇచ్చారు. మంగళవారం ఆయనిక్కడ జనతా దర్శన్‌లో పాల్గొన్న అనంతరం విలేకరులతో మాట్లాడారు. మిల్లర్లతో చర్చించాల్సిందిగా ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి దినేశ్ గుండూరావుకు సూచించామని వెల్లడించారు. రెండు, మూడు రోజుల్లో దీనిపై నిర్ణయం తీసుకుంటామన్నారు.
రైతుల నుంచి మిల్లర్లు క్వింటాల్ రూ.1,600 చొప్పున ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారని, క్వింటాల్ బియ్యం ధరను రూ.2,600గా నిర్ణయించామని వివరించారు. దీనికంటే ఎక్కువ ధరను కోరడం న్యాయం కాదన్నారు. రూపాయి కిలో బియ్యం పథకం అన్న భాగ్యకు 13.5 లక్షల టన్నుల లెవీ బియ్యం అవసరమని తెలిపారు. కాగా ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలకు ఒకే సీఈటీని నిర్వహిస్తామని వెల్లడించారు. ఫీజు నిర్ధారణకు ఓ కమిటీని, సీట్ల పంపకానికి మరో కమిటీని నియమించామని చెప్పారు. ఈ దశలో 2006లో మాదిరే సీట్ల పంపకం ఉంటుందంటూ వస్తున్న వదంతులను ఆయన కొట్టి పారేశారు.