ఏపీలోని 3 వర్సిటీల్లో జపనీస్ బోధన
హైదరాబాద్: జపాన్ ప్రభుత్వ ఏజెన్సీలు, ప్రైవేటు కంపెనీలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిని కనపరుస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జపాన్ భాషా బోధనను అమలు పరిచేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ బాధ్యతను ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఎల్.వేణుగోపాలరెడ్డికి అప్పగించింది. దాంతో ప్రాథమిక స్థాయినుంచి ఓ యజ్ఞంలా దీన్ని చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జపాన్ భాష తప్పనిసరిగా తెలిసి ఉండాలనే ఉద్దేశంతో ఏపీలో మూడు విశ్వవిద్యాలయాల్లో జపనీస్ భాషను ప్రవేశపెట్టనుంది. విశాఖపట్నం ఆంధ్రా యూనివర్సిటీ, గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, తిరుపతి శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీలలో జపాన్ భాషా శిక్షణ తరగతులు నిర్వహించనుంది,
ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిలో జపాన్ కంపెనీలు పెట్టుబడులతో ముందుకు వస్తున్న తరుణంలో విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలకు వెసులుబాటు వాతావరణం కల్పించాలని భావిస్తోంది. దీనికి జపాన్ భాషా శిక్షణ తీసుకున్న వారికి ఎక్కువ అవకాశాలు ఉంటాయనే ఉద్దేశంతో జపనీస్ నేర్పించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచార సలహాదారుడు పరకాల ప్రభాకర్ పీటీఐతో తెలిపారు. జపాన్ కంపెనీలతో పనిచేసేందుకు వీలుగా జపాన్, తెలుగు, ఇంగ్లీష్ భాషలు తెలిసినవారు చాలా అవసరమని, భవిష్యత్తులో జపనీస్ తెలిసినవారికి మరింత డిమాండ్ పెరగనుందని ప్రభాకర్ పేర్కొన్నారు.