Japanese PM Shinzo
-
పెరల్ హార్బర్‌కు షింజో
వాషింగ్టన్: జపాన్ ప్రధానమంత్రి షింజో అబే త్వరలో అమెరికాలోని పెరల్ ఓడరేవును సందర్శించనున్నారు. 75 సం॥క్రితం రెండో ప్రపంచ యుద్ధం సమయంలో ఈ ఓడరేవుపై జపాన్ దాడి చేసిన తర్వా త ఇప్పటి వరకు జపాన్ నాయకులెవరూ దీన్ని సందర్శించ లేదు. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ఒబామాతో కలసి హార్బర్‌ను సందర్శించనున్న తొలి జపాన్ ప్రధాని షింజో అబేనే కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. డిసెంబర్ 27న హవాయ్‌లోని హొనొలొలులో ఒబామా జపాన్ ప్రధానితో భేటీ అవుతారని వైట్‌హౌస్ మీడియా కార్యదర్శి ఎర్నెస్ట్ తెలిపారు. గత నాలుగేళ్లలో భద్రత, ఆర్థిక, గ్లోబల్ సవాళ్లు తదితర అంశా ల్లో ఇరుదేశాల సహకారంపై వీరిద్దరు చర్చించనున్నారు. -
హై స్పీడ్ రైళ్లే కాదు... వృద్ధి కూడా కావాలి: మోదీ
న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం జపాన్ ప్రధాని షింజో అబేతో సమావేశమయ్యారు. ఢిల్లీలో జరుగుతున్న భారత్-జపాన్ 9వ వార్షిక సదస్సులో భాగంగా మోదీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మోదీ... భారత్‌కు కావాల్సింది కేవలం జపాన్ బుల్లెట్ రైళ్ల ఒప్పందమే కాదని... శరవేగంగా అభివృద్ధిని కూడా కోరుకుంటున్నట్లు వ్యాఖ్యానించారు. 'మేక్ ఇన్ ఇండియా' ప్రాజెక్ట్‌కు జపాన్ చేయూతనిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్‌లో మానవ వనరులు పుష్కలంగా ఉన్నాయని మోదీ తెలిపారు. ఇందుకోసం జపాన్ బిలియన్ డాలర్ల నిధులను కేటాయించిందని ప్రధాని మోదీ అన్నారు. తొలిసారి భారత కార్ల కంపెనీ మారుతి సుజుకీ తయారు చేసిన కార్లను జపాన్ ఎగుమతి చేసుకుంటుందని ఆయన వెల్లడించారు. 12 బిలియన్ డాలర్లతో జపాన్‌లో మేక్ ఇన్ ఇండియా ప్రారంభమైందని తెలిపారు. అలాగే జపాన్ ప్రధాని షింజో అబే ఈ సదస్సులో నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపించారు. మోదీ ఆర్థిక విధానాలు జపాన్ హై స్పీడ్ ట్రైన్లో ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో పౌర అణు ఒప్పందంతోపాటు భారత్‌లో తొలి బుల్లెట్ రైలు ట్రాక్ కోసం రూ.98వేల కోట్ల డీల్, స్మార్ట్‌సిటీలకు సహకారం, పలు మౌలికవసతుల ప్రాజక్టులపై ఒప్పందాలు చేసుకున్నారు. ఈ ఒప్పందాలు ఇరుదేశాలను మరింత పటిష్టం చేస్తాయన్నారు. భారత్-జపాన్ల వాణిజ్య సహకారం శుభపరిణామమని అబే పేర్కొన్నారు. -
నేడు మోదీతో జపాన్ ప్రధాని భేటీ
మూడు రోజుల పర్యటన కోసం ఢిల్లీ వచ్చిన జపాన్ ప్రధాని ♦ నేడు భారత్-జపాన్ 9వ వార్షిక సదస్సు ♦ నేటి సాయంత్రం వారణాసి గంగాహారతిలో పాల్గొననున్న మోదీ-అబే న్యూఢిల్లీ: జపాన్ ప్రధాని షింజో అబే మూడు రోజుల పర్యటన కోసం భారత్ చేరుకున్నారు. శనివారం ఢిల్లీలో భారత్-జపాన్ 9వ వార్షిక సదస్సులో భాగంగా ప్రధాని మోదీతో అబే భేటీ అవుతారు. పౌర అణు ఒప్పందంతోపాటు భారత్‌లో తొలి బుల్లెట్ రైలు ట్రాక్ కోసం రూ.98వేల కోట్ల డీల్, స్మార్ట్‌సిటీలకు సహకారం, పలు మౌలికవసతుల ప్రాజక్టులపై ఒప్పందాలు చేసుకోనున్నారు. సదస్సు పూర్తయిన తర్వాత మోదీ, అబే శనివారం కాశీ విశ్వేశ్వరుడిని దర్శించుకోనున్నారు. దశాశ్వమేధఘాట్ వద్ద గంగా హారతిని తిలకించనున్నారు. ఇందుకోసం అలహాబాద్ హైకోర్టు నుంచి ప్రత్యేక అనుమతి తీసుకొని గంగా తీరాన భారీ వేదిక ఏర్పాటు చేశారు. శుక్రవారం అబేకు కేంద్ర మంత్రి జయంత్ సిన్హా విమానాశ్రయంలో స్వాగతం పలకగా.. విదేశాంగ మంత్రి సుష్మ.. సాయంత్రం అబేతో భేటీ అయ్యారు. పాకిస్తాన్‌తో ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణ, వివిధ సమస్యల పరిష్కారం కోసం భారత్ తీసుకున్న చొరవను షింజో అబే స్వాగతించారు. ‘ఉద్రికత్తలు తగ్గించుకునే దిశగా ఇరు ప్రభుత్వాలు ముందడుగు వేయటం శుభపరిణామం’ అని అన్నారు. మరోవైపు, అబేకు ఢిల్లీలోని జవహార్‌లాల్ నెహ్రు యూనివర్సిటీ (జేఎన్‌యూ) గౌరవ డాక్టరేట్ ప్రకటించింది. భారత ఆర్థికాభివృద్ధిలో జపాన్ పాత్ర, ప్రధానిగా షింజో అబే చొరవకు గౌరవంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు జేఎన్‌యూ వీసీ సుధీర్ కుమార్ తెలిపారు. జేఎన్‌యూ నిర్ణయంపై అబే కృతజ్ఞతలు తెలిపారు. భారత్-జపాన్ మధ్య బంధం చాలా పురాతనమైనదని.. బలమైనదన్నారు. వచ్చేనెల భారత్-పాక్ చర్చలు ఇస్లామాబాద్: భారత్-పాక్ దేశాల విదేశాంగ శాఖ కార్యదర్శులు వచ్చే నెల ఢిల్లీలో భేటీ కానున్నారు. ఇటీవలి సుష్మ పాక్ పర్యటనలో ఇరు దేశాల మధ్య చర్చల ప్రక్రియ పునరుద్ధరించేందుకు చేసుకున్న ఒప్పందాలపై ఇందులో చర్చించనున్నారు. పాకిస్తాన్ విదేశాంగ సలహాదారు అజీజ్.. శుక్రవారం పాక్ పార్లమెంటులో ఈమేరకు వెల్లడించారు.