హై స్పీడ్ రైళ్లే కాదు... వృద్ధి కూడా కావాలి: మోదీ
న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం జపాన్ ప్రధాని షింజో అబేతో సమావేశమయ్యారు. ఢిల్లీలో జరుగుతున్న భారత్-జపాన్ 9వ వార్షిక సదస్సులో భాగంగా మోదీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మోదీ... భారత్కు కావాల్సింది కేవలం జపాన్ బుల్లెట్ రైళ్ల ఒప్పందమే కాదని... శరవేగంగా అభివృద్ధిని కూడా కోరుకుంటున్నట్లు వ్యాఖ్యానించారు. 'మేక్ ఇన్ ఇండియా' ప్రాజెక్ట్కు జపాన్ చేయూతనిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్లో మానవ వనరులు పుష్కలంగా ఉన్నాయని మోదీ తెలిపారు.
ఇందుకోసం జపాన్ బిలియన్ డాలర్ల నిధులను కేటాయించిందని ప్రధాని మోదీ అన్నారు. తొలిసారి భారత కార్ల కంపెనీ మారుతి సుజుకీ తయారు చేసిన కార్లను జపాన్ ఎగుమతి చేసుకుంటుందని ఆయన వెల్లడించారు. 12 బిలియన్ డాలర్లతో జపాన్లో మేక్ ఇన్ ఇండియా ప్రారంభమైందని తెలిపారు.
అలాగే జపాన్ ప్రధాని షింజో అబే ఈ సదస్సులో నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపించారు. మోదీ ఆర్థిక విధానాలు జపాన్ హై స్పీడ్ ట్రైన్‌లో ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో పౌర అణు ఒప్పందంతోపాటు భారత్‌లో తొలి బుల్లెట్ రైలు ట్రాక్ కోసం రూ.98వేల కోట్ల డీల్, స్మార్ట్‌సిటీలకు సహకారం, పలు మౌలికవసతుల ప్రాజక్టులపై ఒప్పందాలు చేసుకున్నారు. ఈ ఒప్పందాలు ఇరుదేశాలను మరింత పటిష్టం చేస్తాయన్నారు. భారత్-జపాన్ల వాణిజ్య సహకారం శుభపరిణామమని అబే పేర్కొన్నారు.