తప్పుడు బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెడతారా!
హైదరాబాద్ : కేంద్ర కేబినెట్ ఆమోదించిన తెలంగాణ బిల్లుపై లోక్సత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తప్పుడు బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టడం దేశానికి మంచిది కాదని ఆయన అన్నారు. జయప్రకాష్ నారాయణ శనివారమిక్కడ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ బిల్లుపై తాము ఏడు నిర్థిష్ట సవరణలు ఇస్తే... వాటిలో రెండు మాత్రమే చేర్చారన్నారు. పోలవరం ముంపు ప్రాంత గ్రామాలను సీమాంధ్రలోనే ఉంచటాన్ని పెద్ద ఘనకార్యం చేసినట్లు చెప్పుకోవటం సరికాదన్నారు.
తాము చూపించిన మౌలిక ప్రాతిపదికలకు రిక్త హస్తం చూపించారని జేపీ అన్నారు. ఇరు ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులపై స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రం అన్నింటికీ మాటలతోనే సరిపెడుతోంది తప్ప.... చేతల్లో శూన్యమని జేపీ ఆవేదన వ్యక్తం చేశారు. భద్రాచలం ప్రాంత ప్రజలు తెలంగాణలోనే ఉండాలని కోరుకుంటున్నారని, అనంతపురం, కర్నూలు పంచాయతీలు కూడా తెలంగాణలో ఉంటాయంటున్నాయని జేపీ గుర్తు చేశారు.